Home ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖలో ఆన్‌లైన్ సేవలు..

మార్కెటింగ్ శాఖలో ఆన్‌లైన్ సేవలు..

Online services in marketing department ..

కాగితాల్లో పనులకు చెల్లు చీటి
శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది
డిజిటల్ సిగ్నేచర్ల అప్పగింత
పారదర్శకతకు పెద్ద పీట

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో:  మార్కెటింగ్ శాఖలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు కాగిత రహిత సేవలందించేందుకు ఈ-సర్వీసెస్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు కాగితాల్లో సాగిన పనులకు చెక్ పెడుతూ అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందించబోతున్నారు. ట్రేడింగ్ లైసెన్స్, రెన్యూవల్, మార్కెట్ ఫీజు, కమీషన్ ఏజెంట్ లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా మార్కెటింగ్ శాఖ రూపొందించిన యాప్‌తోనే పనైపోతుంది. దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లోనే ఈ విధానం అమలవుతుండగా సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావ్ కృషి ఫలితంగా వాటి సరసన మన రాష్ట్రం కూడా చేరినట్లైంది. దీనికి సంబంధించి గతేడాది డిసెంబర్ 4 నుంచి 9వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల ఆధికారులకు సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేశారు. అంతే కాకుండా డిజిటల్ సిగ్నేచర్లను కూడా అందజేశారు. వ్యాపారులకు సైతం శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అది పూర్తి కాగానే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం సీజన్ కాకపోవడంతో మార్కెట్ యార్డుల్లో పెద్దగా లావాదేవీలేమీ జరగవు. ఇలాంటి సమయంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తే తప్పొప్పులను సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 మార్కెట్ కమిటీలుండగా, వీటి పరిధిలో ఏటా కో ట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతాయి. లావాదేవీల్లో ఒక శాతంగా కమిటీలకు ఆదాయం సమకూరుతుంది. ఇలా ఏటా జిల్లాలోని మార్కెట్ కమిటీలకు దాదాపు 20 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా మార్కెట్ల పరిధిలో లైసెన్స్ కలిగిన వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. అయితే మార్కెట్ కమిటీల్లో కార్యకలాపాలన్నీ మ్యానువల్‌గా జరగడం ఇబ్బందికరంగా పరిణమించింది. దీని వల్ల సేవల్లో పారదర్శకత లోపిస్తోంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట జాప్యం జరగడం, అవినీతికి ఆస్కారం ఉండడంతో పారదర్శకతకు ప్రాధాన్యత కల్పిస్తూ కర్ణాటక తదితర రాష్ట్రాలు మార్కెటింగ్‌లో ఈ సర్వీసెస్‌ను ప్రారంభించి మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఇది గమనించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలోనూ ఈ విధానం అమలుకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు గతేడాది డిసెంబర్ 4 నుంచి 9వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సిబ్బందికి కొత్త విధానంపై శిక్షణ ఇచ్చారు. అంతే కాకుండా డిజిటల్ సిగ్నేచర్లు కూడా అందించారు. ట్రేడింగ్ లైసెన్స్‌కు యాప్ (టీఎస్‌మార్కెటింగ్)లో రూ. 100 చెల్లించి దరఖాస్తు ఫాం పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫాం నింపిన తర్వాత దానితోపాటు లైసెన్స్‌కు కావాల్సిన ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా లైసెన్స్ ఫీజు రూ. 5000 కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్‌లోడ్ చేసిన దరఖాస్తు సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శికి వెళ్తుంది. ఆయన దరఖాస్తును పరిశీలించిన తర్వాత లైసెన్స్ కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు సిఫార్సు చేస్తారు. యథాతధంగా ఆ దరఖాస్తును డైరెక్టర్ ఆమోదించి సంబంధిత వ్యాపారికి లైసెన్స్ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తారు. ఇలా కమీషన్ ఏజెంట్ లైసెన్స్, తక్‌పట్టి, ఇతర రశీదులు, మార్కెట్ ఫీజు చెల్లింపు తదితర లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో జరుగనున్నాయి. అయితే యార్డుల్లో కార్యకలాపాలు జరిపే లైసెన్స్ కలిగిన వ్యాపారులకు సైతం శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇది పూర్తి కాగానే కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇకపోతే ప్రస్తుతం మార్కెట్ యార్డులో పెద్దగా లావాదేవీలేమీ జరిగే అవకాశం లేనందు వల్ల కొత్త విధానం ప్రయోగాత్మకం గా అమలు చేసి తప్పులు దొర్లినా నిదానంగా సరి చేసుకుంటూ సీజన్ వచ్చే వరకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండవచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇక గతంలో వ్యాపారులకు ట్రేడింగ్ లైసెన్స్ కావాలంటే మానువల్‌గా దరఖాస్తు చేసుకొని అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా వ్యాపారులు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఈ సర్వీసెస్ యాప్‌లో దరఖాస్తు చేసుకొని మార్కెటింగ్ శాఖ సేవలను నిర్దేశించిన గడువులోగా పొందేందుకు అవకాశం కలుగుతుందని అంటున్నారు. అలాగే మార్కెటింగ్ శాఖకు వచ్చే ఆదాయం, తదితర అంశాలలో ఎలాంటి లోటుపాట్లు దొర్లే అవకాశాలు ఉండవనే అభిప్రాయపడుతున్నారు.