Home ఆఫ్ బీట్ ఆరోగ్య, వైద్య ఖర్చుల మృత్యుమృదంగం

ఆరోగ్య, వైద్య ఖర్చుల మృత్యుమృదంగం

ఆసుపత్రి భారంతో పేదరికం ఊబిలోకి 

life

ప్రయివేటు ఆసుపత్రులు పెరగడం, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య సేవలపై సబ్సిడీలు లేకపోవడం వల్ల ప్రజలు విపరీతమైన వైద్యఖర్చులు తామే  పెట్టుకోవలసి వస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ2014 ఇండియా ప్రొఫైల్ రిపోర్టు ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వైద్యఖర్చులు స్వంత జేబు నుంచే  పెట్టుకోవలసి రావడం వల్ల 3.2 శాతం భారతీయులు దారిద్య్రానికి గురవుతున్నారు. దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. దాదాపు 70 శాతం భారతీయులు తమ మొత్తం సంపాదన  వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. 

ఆరోగ్యం కోసం, వైద్యం కోసం చేసిన ఖర్చులవల్లనే ఆరుకోట్ల ముప్పయి లక్షల మంది ప్రతి ఏటా దారిద్య్రానికి గురవుతున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ పెరుగుతున్న ఆరోగ్యఖర్చులతో బూడిదపోసినట్లవుతున్నాయి. దేశంలో ప్రజలకు ఆరోగ్యసమస్యలు తలెత్తినప్పుడు ఆర్థికంగా ఆదుకునే యంత్రాంగం లేదు. ప్రస్తుతంలో ఆరోగ్యానికి, వైద్యానికి అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రయివేటు ఆసుపత్రులలోనే కాదు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా రోగికి ఖర్చు తప్పదు. ది డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్‌లో ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం తలసరి ఆదాయంలో 6.9శాతం వైద్యం కోసం తమ జేబుల్లోంచి ఖర్చు పెడితే, పట్టణ ప్రాంతాల్లో 5.5 శాతం ఖర్చు పెట్టింది.
లోక్‌సభలో 2016లో ఆరోగ్యమంత్రి ఈ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ వైద్యం కోసం విపరీతమైన ఖర్చు పట్టణాలతో పోల్చితే గ్రామాల్లోనే ఎక్కువగా ఉందన్నారు. గ్రామీణ ఆరోగ్యసదుపాయాలను పెంచవలసిన అవసరం ఉందని కూడా చెప్పారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యసంస్థ 2015లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రికి వచ్చిన 2500 మంది రోగులలో సగంమంది డిశ్చార్జ్ అయిన ఆరునెలల తర్వాత పేదరికం వల్లనే చనిపోయారు. ఇందులో చాలా మంది రోగులు వలస కూలీలు. కుటుంబాల్లో సంపాదించేవారు కూడా వాళ్లే. తమ కుటుంబాలను ఊళ్ళలో వదిలి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చినవారు. డిశ్చార్జ్ అయిన తర్వాత వారిని బతికించి ఉంచడానికి అవసరమైన ఖర్చును వారి కుటుంబం భరించలేకపోయింది. ముగ్గురు నలుగురు పిల్లలను చూసుకోవడం, తలకు గాయమైన భర్తకు అవసరమైన సదుపాయాలు కల్పించడం భార్యలకు సాధ్యం కాలేదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యచికిత్స పొందగలిగినప్పటికీ ఆ తర్వాత అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోలేకపోవడం వల్ల చనిపోయిన వారు కొందరైతే, అసలు వైద్యచికిత్స పొందే అవకాశం కూడా లభించని వారు ఎందరో. ఉదాహరణకు ఎయిమ్స్ ట్రామా సెంటరులో కనీసం 10 నుంచి 15పడకలు అవసరం, కాని కేవలం ఆరు పడకలు మాత్రమే ఉన్నాయి. అంటే పడకలు ఖాళీగా లేనందువల్ల రోగులను వెనక్కు పంపేయడం జరుగుతుంది.
ప్రపంచబ్యాంకు 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో వైద్యచికిత్స కింద ప్రభుత్వం పెట్టే తలసరి ఖర్చు 61 డాలర్లు మాత్రమే. బ్రెజిల్‌లో ఈ ఖర్చు 1085 డాలర్లు. చైనాలో 367 డాలర్లు. వైద్య ఆరోగ్య రంగాలకు భారత ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుపెట్టడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేవు. భారతదేశంలో 2005లో 1000 మంది జనాభాకు కేవలం 0.9 పడకలు మాత్రమే ఉండేవి. ఇటీవల పరిస్థితి కాస్త బాగుపడి 1.2 పడకల స్థాయి వరకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం 1000 మంది జనాభాకు కనీసం 3.5 పడకలు ఉండాలి. రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో, గ్రామస్థాయిలో సదుపాయాల విషయంలో చాలా తేడా ఉంది. ప్రభుత్వం ప్రజారోగ్యానికి చేసే ఖర్చు తక్కువ కావడం, సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయివేటు వైద్యం మూడు చికిత్సలు ఆరు ఆపరేషన్లుగా సాగుతోంది. అత్యంత ఖరీదైన ఆరోగ్య పరిశ్రమ ఒకటి ఉనికిలోకి వచ్చింది.
ఇటీవల ప్రపంచబ్యాంకుకు చెందిన జిష్ణుదాస్, అలకా హోలలు భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్యాశాలల్లో వైద్యం నాణ్యతపై చేసిన సర్వే ప్రకారం ప్రయివేటు డాక్టర్లు ఎక్కువ ఫీజులు వసూలు చేసినా, ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. ఈ సంవత్సరం ఉత్తర ప్రదేశ్ బీరుచ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పదేళ్ళ బాలుడు చనిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి వందరూపాయలు లంచం ఇవ్వలేనందువల్ల సమయానికి వైద్యం చేయలేదు. ఇలా లంచం కోసం ప్రాణాలు తీసే పరిస్థితి మన ప్రభుత్వఆసుపత్రుల్లో చాలా చోట్ల కనబడుతుంది. ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగే అవకాశం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఈ పరిస్థితి వల్లనే ప్రజలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారు.
భారతదేశంలో సగటు కుటుంబ సంపాదన 5000 నుంచి 10000 రూపాయల మధ్య ఉంటుంది. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళి మెరుగైన వైద్యం పొందడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సగటు వ్యక్తి తన వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందినప్పటికీ ఆ తర్వాత మందులను తన సంపాదన నుంచి కొనడం అనేది సాధ్యపడే పనికాదు. గత సంవత్సరం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అధారిటీ ఇచ్చిన గణాంకాల ప్రకారం 76 శాతం ప్రజలకు ఎలాంటి ఆరోగ్య ఇన్సూరెన్సు లేదు. అందువల్ల చాలా మంది ఆసుపత్రి ఖర్చులు జేబు నుంచే పెట్టుకోవలసి వస్తుంది.
ప్రయివేటు ఆసుపత్రులు పెరగడం, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య సేవలపై సబ్సిడీలు లేకపోవడం వల్ల ప్రజలు విపరీతమైన వైద్యఖర్చులు తామే పెట్టుకోవలసి వస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ2014 ఇండియా ప్రొఫైల్ రిపోర్టు ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వైద్యఖర్చులు స్వంత జేబు నుంచే పెట్టుకోవలసి రావడం వల్ల 3.2 శాతం భారతీయులు దారిద్య్రానికి గురవుతున్నారు. దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. దాదాపు 70 శాతం భారతీయులు తమ మొత్తం సంపాదన వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. ఎలాంటి వ్యాధికి గురయ్యారన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అంటువ్యాధులు కానటువంటి వ్యాధుల చికిత్సకు ఖర్చు ఎక్కువ. దేశంలో 60 శాతం చావులకు ఇవే కారణాలు. నాలుగు ముఖ్యమైన అంటేతర వ్యాధులు, క్యాన్సర్, కార్డియో వాస్కులర్ డిసీజ్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, డయాబిటీస్ ఈ నాలుగు వ్యాధుల వల్ల దేశంలో 30 నుంచి 70 సంవత్సరాల లోపు పౌరుల్లో మరణాలు ఛాలా ఎక్కువగా ఉన్నాయి. కాని ఈ వ్యాధులు నిజానికి సంపన్న దేశాల వ్యాధులుగా పేరుపడినవి. అనారోగ్య కరమైన జీవనవిధానం వల్ల ఈ వ్యాధులు దాపురిస్తున్నాయి. ఈ వ్యాధులు దేశంలో రావలసిన సమయం కన్నా పదేళ్ళు ముందే వచ్చాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. నాణ్యమైన వైద్యచికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది మంచి వయసులోనే చనిపోతున్నారు.2015లో జరిగిన లాన్సెట్ అధ్యయనం ప్రకారం 30 శాతం జనాభా జబ్బు చేసినప్పటికీ డబ్బులేనందువల్ల చికిత్స కోసం వెళ్ళడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం, పట్టణ ప్రాంతాల్లో 31 శాతం కేసుల్లో ఆస్తులను అమ్మి, అప్పులు చేసి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం దేశంలో గుండెవ్యాధి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రయివేటు ఆసుపత్రి మొదటి గుండెమార్పిడి ఆపరేషన్ చేసింది. 28 సంవత్సరాల యువకుడికి ఈ ఆపరేషను చేశారు. అతడు ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబానికి చెందినవాడు. ఈ వైద్యానికి సాధారణంగా 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అతనికి 7 లక్షల బిల్లు వేశారు. గుండె మార్పిడికి అవసరమైన హృదయాన్ని దాత ఉచితంగా ఇచ్చినప్పటికీ చికిత్సకు అయిన ఖర్చు ఇది. ఈ ఖర్చును రోగులే భరించాలి. గుండెమార్పిడి చికిత్సకు అవసరమైన ఖర్చు భరించలేక 20 సంవత్సరాల యువకుడు ఒకతను చనిపోయాడు. నిజానికి అతనికి గుండెను దానం చేసిన దాత ఉన్నారు. కాని ఖర్చులు భరించే స్తోమత లేనందువల్ల చనిపోయాడు.
గుండెమార్పిడి జరిగిన తర్వాత ఆరునెలల పాటు ఆపరేషను తర్వాతి సదుపాయాలకు నెలకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఖర్చవుతాయి. ఆ తర్వాత జీవితాంతం నెలకు 10 వేల నుంచి 15 వేల రూపాయల మందుల ఖర్చు ఉంటుంది. అలాగే క్యాన్సరుకు సంబంధించి ఎన్ యస్ యస్ ఓ గణాంకాల ప్రకారం పదిహేను రోజులకు 57 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చువుతుంది. బడ్జెటు 2015-16లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ప్రభుత్వ ఇన్సూరెన్సు కన్నా 152 శాతం ఎక్కువ. కాని ఇధి కనీస మౌలిక సదుపాయాలను ఇవ్వడం లేదు. రాష్ట్రీయ స్వాస్థ్ బీమా యోజనలో కేవలం 30 వేల రూపాయలు మాత్రమే లభిస్తాయి. అది కూడా నగదుగా లభించవు. అంటే వైద్య చికిత్స తర్వాత మందులకు ఇతర ఖర్చులకు ఇవ్వరు. అదీ కాకుండా 282 మంది గని కార్మికులు, 454 మంది రిక్షా కార్మికులు, 710 మంది పారిశుధ్య కార్మికులు 2015లో ఈ స్కీములో చేరారు. కాబట్టి మనం ఇన్సూరెన్స్ కవరేజిలో ఆసుపత్రి నుంచి ఢిశ్చార్జ్ అయిన తర్వాతి ఖర్చులను కూడా చేర్చవలసి ఉంది. ఇది సామాజిక భద్రతగా ఉపయోగపడుతుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పట్ల శ్రద్ధ చూపకపోవడం, డాక్టర్లు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. 2015 మార్చి నాటికి 10 శాతం ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేరు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల కోసం డాక్టర్లను రిక్రూట్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది. కాని ప్రతి ఆరోగ్యకేంద్రంలోనూ ఇరవై నాలుగు గంటలు మెడికల్ డాక్టరు ఉండవలసిన అవసరం లేదు. శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది చాలా రోగాలకు వైద్యం చేయగలరు. కాబట్టి దిగువ స్థాయిలో వైద్యసేవలను అందించడానికి పారామెడికల్ శిక్షణను మరింత పెంచవలసి ఉంది. టెలిమెడిసిన్ వంటి సాంకేతిక పద్ధతులను కూడా వాడుకోవాలి. ఒకేవిధమైన వ్యాధులకు గురయ్యే గ్రామాలను గుర్తించి డాక్టర్లను ప్రణాళికాబద్దంగా నియమించడం ద్వారా కూడా ఫలితాలు సాధించవచ్చు. భారతదేశం విశ్వగురువు అని చెప్పుకుంటున్నాం, సూపర్ పవర్ గా మారుతుందని ఆశిస్తున్నాం, కాని దేశంలో ప్రజలు వైద్య చికిత్సకయ్యే ఖర్చు భరించలేక మరణించే పరిస్థితి సిగ్గుచేటు. ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపి తగిన కేటాయింపులు చేయకపోతే పేదరిక నిర్మూలన కార్యక్రమాల వల్ల లాభం ఉండదు. పేదరికం మరింత పెరుతుంది.

lif
ప్రపంచబ్యాంకు 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో వైద్యచికిత్స కింద ప్రభుత్వం పెట్టే తలసరి ఖర్చు 61 డాలర్లు మాత్రమే. బ్రెజిల్‌లో ఈ ఖర్చు 1085 డాలర్లు. చైనాలో 367 డాలర్లు. వైద్య ఆరోగ్య రంగాలకు భారత ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుపెట్టడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేవు. భారతదేశంలో 2005లో 1000 మంది జనాభాకు కేవలం 0.9 పడకలు మాత్రమే ఉండేవి. ఇటీవల పరిస్థితి కాస్త బాగుపడి 1.2 పడకల స్థాయి వరకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం 1000 మంది జనాభాకు కనీసం 3.5 పడకలు ఉండాలి. రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామస్థాయిలో సదుపాయాల విషయంలో చాలా తేడా ఉంది. ప్రభుత్వం ప్రజారోగ్యానికి చేసే ఖర్చు తక్కువ కావడం, సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయివేటు వైద్యం మూడు చికిత్సలు ఆరు ఆపరేషన్లుగా సాగుతోంది. అత్యంత ఖరీదైన ఆరోగ్య పరిశ్రమ ఒకటి ఉనికిలోకి వచ్చింది.

మన తెలంగాణ పరిశోధక విభాగం