Home ఎడిటోరియల్ బెంగాల్‌లో చెల్లేది చేప మాటే!

బెంగాల్‌లో చెల్లేది చేప మాటే!

Choopu-Cartoon

చేప నుంచి బెంగాల్ పౌరుడ్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తే బెంగాల్ రాష్ట్రంలో బిజెపికి ఎదురు తిరగడం ఖాయం. మత భక్తిని అతిగా ప్రదర్శించడం అవినీతిపరుల నైజమని తెలిపే సత్యజిత్‌రాయ్ సినిమా ఒకటి ఉంది. ‘జాయ్ బాబా ఫెలూనాథ్’ అనే ఆ చిత్ర ఇతివృత్తం వారణాసి నేపథ్యంలో సాగుతుంది. ‘మచిలీబాబా’ అనే ఒక నకిలీ సాధువు పురావస్తు కళాఖండాలను దొంగ రవాణా చేస్తుంటాడు. కథ పక్కనపెడితే అవినీతికి, మత భక్తి ప్రదర్శనకి మధ్యగల సంబంధంపై చేసిన ఘాటైన వ్యాఖ్యే ఈ చిత్రం అసలు విషయం. జనసంఘ్ వ్యవస్థా పకుడు ఎస్‌పి ముఖర్జీ కన్యాకుబ్జ బ్రాహ్మణుడే అయినా ఆయన పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌కు చెందిన వారు. ఆ పూర్వీకులు రోజూ చేపలు, మాంసం తినేవారు. ఆయన ఆహారాన్ని మతంతో ముడిపెట్టలేదు. ఉపాహారానికి ముందు జంధ్యాన్ని పట్టుకొని, ఏవో మంత్రాలు పఠించి మాంసం వంటకాలు తినడానికి ఉపక్రమించేవారు. ఆయన భోజన ప్రియుడు. ఆ తరంలో కొందరు తాతలు మాంసాహారాన్ని గట్టిగా సమర్థించేవారు. అది శరీరానికి అవసరం అయిన పుష్ఠిని చేకూర్చు తుందని, మానసిక ఆరోగ్యానికి కూడా మాంసాహారం మంచిదని నమ్మేవారు. అంతే కాకుండా పదిమందికీ చెప్పేవారు కూడా.
‘చరిత్రకు అందని కాలం నుంచి మానవ మెదడు పెరుగుదలలో మాంసాహారం పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా సముద్రపు జీవుల మాంసం ఈ విషయంలో చాలా ముఖ్యమైనది. ఒమెగా-3 అనే పోషక పదార్థం చేప నూనెలో, సముద్రపు జీవుల మాంసంలో సమృద్ధిగా ఉంది. అదే మానవ మెదడు ఎదుగుదలకు తోడ్పడుతోంది’- ఈ మాట పూర్వీకులు చెపుతూ వచ్చినది. ఇది శాస్త్రీయ మూలాలు గల విషయం. బెంగాలీలలో మెదడు బలం, జ్ఞాపక శక్తి చాలా తక్కువని ప్రతీతి. బహుశా అందుకే బెంగాలీలు చేపను ఇష్టంగా తినే అలవాటును పెంచుకొని ఉండవచ్చు. కాని ఇప్పుడు బెంగాలీలు ఆహారంలో చేప మాయమైపోయే ప్రమాదం ఏర్పడింది. సామాజిక మీడియా ప్రచారం ద్వారా బిజెపి హిందూత్వ ఆహార విధానాలు బెంగాల్‌ను చేరాయి. గత ఆరు నెలలుగా ఫేస్‌బుక్‌లో, ఇతర సామాజిక ప్రచార సాధనాల్లో విరివిగా దర్శనమిస్తున్న పోస్టులను చూస్తే బెంగాల్‌లో ప్రస్తుత ప్రచార సరళి అర్థమవుతుంది.
బెంగాల్ గ్రామాల నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే గో రక్షణ అన్నది అక్కడ ఒక చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. అలాగే కుల రాజకీయాలను ప్రోత్సహించే వాతావరణం కూడా ఏర్పడుతోంది. కులం, మతం పేర బెంగాల్ ప్రజలను విభజించడానికి క్రింది స్థాయి నుంచీ నిధుల బలంతో గట్టి ప్రచారం సాగుతోంది. దీని గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొంతు విప్పారు. ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. కవి మైఖేల్ మధుసూదన్ దత్తా క్రిస్టియన్‌గా మారినందున ఆయన రచనలను నిషేధించాలని సామాజిక మీడియాల్లో డిమాండ్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఎం.ఎం.దత్తా మతం మారడమే కాకుండా విదేశీ వనితను పెళ్లాడారనీ, భగవాన్ శ్రీరాముని అవమానించారని కూడా ఆ డిమాండ్‌లో ఉదహరిస్తున్నారు. రవీంద్రనాథ్ టాగూర్‌ను హిందూ వ్యతిరేకిగా, వ్యక్తిత్వంలేని మనిషిగా చిత్రిస్తూ కూడా ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన సెక్యులరిస్టులు, బ్రిటిష్ దొరల తొత్తుగా కూడా ప్రచార పోస్టులు దర్శనమిస్తున్నాయి.
మరోపక్క వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటోపాధ్యా యను బెంగాల్‌లో అసలయిన హిందువుగా కీర్తిస్తున్నారు. ఆయనకే నోబెల్ బహుమతి రావలసి ఉండేనని, కాని ఆయన యధార్థ వాది కావడంతో రాలేదని ఈ ప్రచారాల్లో పేర్కొంటున్నారు. అసలు నిజం ఏమిటంటే ‘నోబెల్ బహుమతి’ ప్రకటించే ఆనవాయితీ మొదలయ్యే సరికే బంకిం మరణించారు. ఈ సంగతిని తమకు అనుకూలంగా ఆ ప్రచార కులు విస్మరిస్తున్నారు. ప్రస్తుతం ‘అఖిల భారత మత్స రక్షణ కమిటీ’ పేరిట కొత్త సంస్థ సామాజిక మీడియాలో వెలిసింది. వారు చేప తినే అలవాటున్న బెంగాలీలను కొరడా దెబ్బలు కొడతామని బెదిరిస్తున్నారు. మత్స అవతారం ప్రసక్తి తెచ్చి ఈ అంశాన్ని మతపరం చేస్తున్నారు. చాలా మంది బెంగాలీలు దీనిని అపహాస్యం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని వ్యతిరేకించేవారు పుట్టిస్తున్న హాస్యం మధ్య ఆందోళనకరమైన పరిస్థితి రూపుదిద్దుకొంటోంది. కేవలం ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడంతో ఈ సమస్య తీరిపోదని చాలామంది బెంగాలీలు భావిస్తున్నారు. హిందూత్వ సాంప్రదాయవాదుల నుంచి బెంగాల్ స్వేచ్ఛా సంస్కృతిని రక్షించడం అసలు విషయంగా ప్రస్తుతం కొందరు భావిస్తున్నారు. శ్రీరామ నవమి నాడు త్రిశూలాలు, కత్తులతో ఊరేగింపు జరుపుతామని జాదవ్ పూర్ బెంగాల్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ గోష్ (ఖరగ్‌పూర్ ఎంఎల్‌ఎ) ఇటీవల జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సదస్సులో ప్రకటించారు.
శ్రీరామ నవమి ఉత్సవం జరపడం రాష్ట్రంలోకి కొత్తగా దిగుమతి చేసిన ఆచారం. బెంగాల్‌లో రాముణ్ణి పూజించే సాంప్రదాయం అంతగా లేదు. హిందూస్థానీ సంస్కృతిని రుద్దడానికే ఆ ఎంఎల్‌ఎ కత్తులు, త్రిశూలాలతో యాత్ర తలపెట్టినట్లు చాలామంది బెంగాలీలు భావిస్తు న్నారు. బెంగాలీల స్వేచ్ఛాయుత సంస్కృతిని నశింపచేసి, దాని స్థానంలో ఉత్తరాది గో సంస్కృతిని ప్రవేశపెట్టడానికి బిజెపి యత్నిస్తున్నట్లు చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని ‘సామాజిక, సాంస్కృతిక ఇంజినీరింగ్’ గా వారు చూస్తున్నారు. ప్రజలను విభజించడానికే హిందూ గుర్తింపు రుద్దుతున్నారని బెంగాలీలు విమర్శిస్తున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బిజెపి ఓట్ల వాటా 17% ఉండగా, 2016 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 10%కి తగ్గిపోయింది. ఓట్ల వాటాను పెంచడానికి బిజెపి శాయశక్తులా శ్రమిస్తోంది. హిందూత్వ సిద్ధాంతంపై పోరాటానికి చేతులు కలపాల్సిందిగా లెఫ్ట్‌ఫ్రంట్‌కు మమత ఇటీవల పిలుపునిచ్చారు. ఒక పద్ధతిప్రకారం సాగిస్తున్న ప్రచారం ద్వారా హిందూత్వను రాష్ట్రంలో వ్యాపింపచేయ డానికి ప్రయత్నం సాగుతున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. హిందూత్వ వ్యాప్తికి బిజెపి బెంగాల్‌లో సాగిస్తున్న ప్రచారం ఎదురుతన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో చేపలను తినకూడదంటే సాగదు. బెంగాలీలను వారికిష్టమైన దాని నుంచి వేరుచేస్తే తెలివి తక్కువతనమే అవుతుంది. శాకాహారం, రోడ్లపై రోమియోలు సంచ రించకుండా నిఘా, మితవాదధోరణులు బెంగాల్‌కు, ఆ మాటకు వస్తే, భారతదేశానికి సరిపడే అంశాలు కావు. బెంగాలీలు ఇటువంటి భావాల పట్ల వ్యతిరేకత కనపర్చడం మొదలయింది. తమ స్వేచ్ఛాయుత సంస్కృతి ని రక్షించుకోవడానికి వారు ఈ భావాలను తీవ్రంగా ప్రతిఘటించదలి చారు. 2014 తర్వాత హిందూత్వ వ్యాప్తిని గట్టిగా అడ్డుకొన్న ప్రాంతాల్లో బెంగాల్ కీలకమైనది. అందుచేత బిజెపికి అక్కడ ‘ఎదురు గాలే’.
* దేవదన్ చౌధురి