Search
Saturday 17 November 2018
  • :
  • :

పేద పిల్లలకే సర్కారు బడి

 Only Poor Students Join Govt schools in Telangana

మనతెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు పేదల బడులుగానే కొనసాగుతున్నాయి. పాలకులు ప్రభుత్వ పాఠశాలల తీరుపై సమగ్ర సమీక్షలు జరకపోగా మొక్కుబడిగా సాగిస్తున్న సమీక్షలు లోపాలను సవరించలేకపోతున్నాయి. ఫలితంగా నిరుపేదల పిల్లలు చదివే విద్యాలయాలుగా ప్రభుత్వ పాఠశాలలు గుర్తింపుపొందాయి. ప్రతియేడు సమగ్ర విద్యావిధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా కోట్లాది రూ.లను ఖర్చు చేస్తుంటాయి. అందుకు ప్రణాళికాబద్ధంగా నిధుల కేటాయింపు, శాస్త్రీయ విధానంలో విద్య బోధన కోసం అనేక సమీక్షలు, కసరత్తు జరుగుతూనే ఉంటుంది. అయితే అం దుకు ప్రతియేడు కోట్లాది రూ.ల వేతనాలు సైతం ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందుతునే ఉంటాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యే వారు విద్యాబోధనకు సంబంధించి శిక్షణ పూర్తి చేసుకున్న వారు కావడం గమనార్హం. వారంతా ఉన్నత విద్య అభ్యసించి బిఈడి, టిటిసి పూర్తి చేసిన వారు కావడంతో పిల్లల సమగ్ర అభివృద్ధ్దికి దోహదపడే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూ.ల భవనాల నిర్మాణం, నిర్వాహణ ఖర్చులను భరిస్తునే ఉంటుంది. వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్షం మేరకు మాడల్ స్కూళ్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. బాలికల విద్య కోసం కస్తూర్భా విద్యాలయాలను, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇంత చేసినా ఫలితం మాత్రం కనిపించపోగా పేద పిల్లల కోసమే ప్రభుత్వ విద్య అన్న పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కలిపి 2183 పాఠశాలలుండగా 9365 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

వీటికి తోడు గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్భా విద్యాలయాల్లో మరింత మంది పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల 64 వేల 481 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యేక పాఠశాలల్లో మరో 8వేల వరకు విద్యార్థులు చదువుతుండగా వారంతా అత్యంత పేద వర్గాలకు చెందిన విద్యార్థులుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆదర్శ పాఠశాలలపై దృష్టి పెట్టడంతో గత రెండేళ్లు గా మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు వారి పిల్లలను ఆదర్శ పాఠశాలలో చేర్పించినట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నాయకులు, ధనికుల పిల్లలు మాత్రం ఖరీదైన కాన్వెంట్ స్కూళ్లలో విద్యనభ్యసించడం గమనార్హం. ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యబోదన నాణ్యమైనదిగా భావిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండటం రాష్ట్రంలో విద్యవిధానానికి నిదర్శనంగా నిలుస్తుంది. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యబోధన సరైన పద్దతిలో సాగితే అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల అర్హత మేరకు అక్కడే మంచి విద్య లభించే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏ మాత్రం శిక్షణ లేని, తక్కువ విద్యార్హత కలిగిన బోదన సిబ్బంది ఉండటం గమనార్హం. కేవలం పాఠశాల పనిగంటలు సక్రమంగా ఉండటంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోను పర్యవేక్షణ ఫలితంగా మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై వారికి నమ్మకం లేదని పరోక్షంగానే చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలో విద్యశాఖ పనితీరుపై సమీక్షించే అధికారులు సైతం వారి పిల్లలను స్థానికంగా ఉండే ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తుండడం గమనార్హం. అందుకు అధికారులు చెప్పే సాకు ఆంగ్ల మాద్యమం కాగా పలు ఆదర్శ పాఠశాలల్లో, కెజిబివిల్లో ఆంగ్ల బోదన కొనసాగుతుందన్న విషయాన్ని వారు గుర్తు చేసుకోవాల్సి ఉంది. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యబోదన హోదాకు తగినది కాదన్నట్లుగా దనికులు భావిస్తుండడం, ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు బోదనలో పోటీతత్వాన్ని ప్రదర్శించకపోవడం ఇలాంటి కారణాలు ప్రభుత్వ విద్యసంస్థలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

గతంలో ఓ ప్రజాప్రతినిధి ఇదే విషయంపై ప్రభుత్వ ఉపాధ్యాయులకు బహిరంగంగానే సవాల్ విసిరి ఉపాధ్యాయ వర్గాలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానని, ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మీడియా ద్వారా సవాల్ విసిరారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోదనపై దృష్టి సారించకపోవడంతో పట్టణాల్లో పెద్ద ఎత్తున కార్పోరేట్ విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే మద్యతరగతి, పేద వర్గాలు సైతం తమ పిల్లల భవిష్యత్తు కోసం వ్యయప్రయాసాలకు వెనుకాడక కార్పోరేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పిస్తూ ఆర్థిక భారానికి గురవుతున్నారు. నిజానికి కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను, ఆంక్షలను యేనాడు పట్టించుకోకపోగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర ప్రత్యేక ఫీజుల పేరుతో దోపిడిని కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థల భవనాలు సైతం నిబంధనలకు లోబడి లేకపోగా పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపేలా విద్యబోదన జరుగుతున్న అధికారులు ఏనాడు దృష్టిసారించిన పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా క్రమ పద్దతిలో ఎదగాల్సిన బాల్యం అనేక ఒత్తిడిలకు లోనై వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు కంకణబద్దులు కావాల్సి ఉంది.
ఆదర్శంగా నిలుస్తున్న పలు ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలు నిరుపేద బడులుగా అపఖ్యాతిని మూటగట్టుకోగా పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం తమ వృత్తికి న్యాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యసంస్థల్లో విద్యబోదన కార్పోరేట్ విద్యకు మించి సాగుతోంది. ఆయా విద్యాసంస్థల్లో ఆంగ్ల బోధనతో పాటు విద్యార్థుల పోటీతత్వాన్ని పెంచడం, అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం వల్ల స్థానికుల ప్రశంసనలను పొందుతున్నారు.

Comments

comments