Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో మూడు రోజులే

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో మూడు రోజులే

31తో ముగియనున్న తుదిగడువు
శివారులో స్పందన కరువు
వరుసగా సాగుతున్న కూల్చివేతలు
హెచ్‌ఎండిఎకు వచ్చిన దరఖాస్తులు 25 వేలు
అంతగా ఆసక్తి చూపని రియల్టర్లు
పెద్దనోట్ల ప్రభావం… పాలకుల భరోసా..?

HMDA-1

మన తెలంగాణ/ సిటీ బ్యూరో : మరో మూడు రోజులే ఎల్‌ఆర్‌ఎస్‌కు తుదిగడువు. కూల్చి వేతలు జరుగుతున్నా… భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతా యన్నా… ప్రతి నిర్మాణ అనుమతులకు ఇది తప్పనిసరియని ప్రచారం చేసినా… లేఅవుట్ క్రమబద్ధ్దీకరణకు ఆశించిన మేర ప్రజల నుండి స్పందన రావడం లేదు. ఒకవైపు నోట్ల రద్దు… మరోవైపు రాజకీయ నాయకుల భరోసా కారణంగా హెచ్ ఎండిఎకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు అంతంతగానే వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 25 వేల వరకే వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి వేలాదిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో ఎల్‌ఆర్‌ఎస్ వచ్చినప్పుడు స్పందించిన రియల్టర్లు, ప్లాట్ల యజమానులు మరోమారు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం కూడా నెలరోజుల గడువును నూతనంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, దరఖాస్తులు అంతగా చేరడంలేదు.
నోట్ల రద్దు ప్రభావం…
పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుచేసుకునేందుకు వెనుకాడుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకుంటే ఈ ఆస్థిని లెక్కలోకి తీసుకుని ఇంత ఆదాయం ఎలా వచ్చిందని ఐటి వారు నోటీసులు పంపిస్తారనే అనుమానాల్లో కొందరు విముఖత వ్యక్తంచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదాయానికి మించిన ఆస్థుల కేటగిరిలోకి మేముచేరుతామనే భావనలో చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు ముందుకు రావడంలేదని చర్చ జరుగుతుంది. వీరి అనుమానాలను నివృత్తిచేసే విధంగా ప్రచారం జరిగితే అక్రమలేఅవుట్లలోని ప్లాట్లవారు క్రమబద్దీకరణకు ముందుకు వచ్చే వీలు లేకపోలేదని దరఖాస్తుదారుల అభిప్రాయం.
ఇదీ హెచ్‌ఎండిఎ పరిధి….
ప్రస్తుతం అథారిటీ విస్తీర్ణం 7,257 చ.కి.మీ.లు. ఏడు జాల్లాలు, 55 మండలాల్లోని 849 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ప్రతి మండల కేంద్రం రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగానే పేరున్నది. మేజర్ గ్రామపంచాయితీలు, నగర శివారులోనే గ్రామాల్లో వందలాది లేఅవుట్లు వెలిశాయి. వెలుస్తున్నాయి. ఒక్క మేడ్చెల్‌మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే 1367 అక్రమలేఅవుట్లను గుర్తించింది హెచ్‌ఎండిఎ. వీటిల్లో కనీసంగా 40 వేల ప్లాట్లు విక్రయం జరిగి ఉంటుంది. భువనగరి-యాదాద్రి జిల్లాలో విపరీతంగా అక్రమలేఅవుట్లు వెలిశాయి. యాదాద్రి దేవాలయం అభివృద్ధి ప్రచారంతో భువనగిరి, యాదాద్రి మండలంలో ఎక్కడచూసినా వెంచర్లే ఉన్నాయి. ఇక్కడే కనీసంగా లక్ష ప్లాట్లు ఉండటం ఖాయం. ఇలాగే శివారులోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ జిల్లాల పరిధిలో లేఅవుట్లపై చర్యలు తీసుకున్నది హెచ్‌ఎండిఎ. కానీ, అంతగా దరఖాస్తులు రాలేదు.
ఓవైపు కూల్చివేతలు…
అనుమతి లేని లేఅవుట్లు, ఆ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయరాదని చెప్పేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెచ్‌ఎండిఎ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ మొదటివారం నుండి నేటికినీ చర్యలు కొనసాగుతున్నాయి. అనుమతి లేని లేఅవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా ఇంటి నిర్మాణాలకు అనుమతులివ్వరాదని స్పష్టంగా అథారిటీ వెల్లడించింది. అందులో భాగంగానే నిజాంపేట్‌లోని బండారీలేఅవుట్‌పై వరుసదాడులు కొనసాగిస్తుంది. ఆ నిర్మాణాలకు గ్రామపంచాయితీ అనుమతులు మంజూరు చేసినా అక్రమలేఅవుట్‌యని కూల్చివేతలు చేపట్టింది. అదేవిధంగా నగర శివారులోని ప్రతి గ్రామపంచాయితీ, నగర గ్రామపంచాయితీల్లోనూ అనుమతిలేని లేఅవుట్లలో వెలసిన నిర్మాణాలను, లేఅవుట్లపై చర్యలు తీసుకుంటుంది. సుమారు 100 లేఅవుట్లలో కూల్చివేతలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. 400 నిర్మాణాలపై చర్యలు సాగించినట్టు తెలిపాయి. అయినా ఇప్పటి వరకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు.
పాలకుల భరోసా…?
ఇదే తుది గడువుకాదు. ప్రభుత్వానికి ఆదాయం అవసరం. మరోమారు పొడిగిస్తారనే అభిప్రాయాన్ని నగర శివారుకు చెందిన స్థానిక, జిల్లాలకు చెందిన పాలకులు మౌఖికంగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు ఏకండా మరో అవకాశం వస్తుందని, లేదా మేమున్నాములే.. అంటూ ప్లాట్ల యజమానులకు భరోసా ఇస్తున్నట్టు పలువురు వెల్లడిస్తున్నారు. మరి కొందరు మరో మూడు రోజులు గడువుంది కదానంటూ యోచిస్తున్నట్టు దరఖాస్తుదారులు వివరిస్తున్నారు.