Home జగిత్యాల అయ్యో పాపం… ఉపాధి కూలీలు

అయ్యో పాపం… ఉపాధి కూలీలు

womans-image

ఇటీవల తాటిపల్లిలో అడవి పంది దాడిలో మహిళ దుర్మరణం
సారంగాపూర్‌లో వాహనం బోల్తా పడ్డ ఘటనలో 30 మందికి గాయాలు
వారం క్రితం కుస్తాపూర్‌లో మట్టిపెల్లలు విరిగి పడి ముగ్గురు మహిళల మృతి

జగిత్యాల: రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేతి నిండా పని కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కూలీల ప్రాణాలను మింగేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం… కూలీల అజాగ్రత్త మూలంగా జిల్లాలో ఈ నెల రోజుల్లో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెల రోజుల క్రితం మల్యాల మండలం తాటిపల్లి శివారులో ఉపాధి పనులు చేసేందుకు వెళ్తున్న వారిపై అడవి పంది దాడి చేయడంతో ఓ మహిళాకు తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందింది. పక్షం రోజుల క్రితం సారంగాపూర్ మండలం బట్టపెల్లికి చెందిన 38 మంది కూలీలు వాహనంలో పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బోల్తా పడి తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా వారం రోజుల క్రితం మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన ఉపాధి హామీ కూలీలు కుంటలో పనులకు వెళ్లి మట్టి గడ్డ తీస్తుండగా మట్టి పెల్లలు మీద పడి ముగ్గురు కూలీలు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సంఘటనలో టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యులుగా పేర్కొంటూ అధికారులు వారిని సస్పెండ్ చేశారు. అయితే నష్టం జరగకముందు పకడ్బంధీ చర్యలు తీసుకోకుండా నష్టం జరిగిన తర్వాత నామ మాత్రంగా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలో ఈ నెల రోజుల్లో ఉపాధి పనులకు వెళ్లి నలుగురు మృత్యువాత పడటం, 40 మంది గాయాల పాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. మండుతున్న ఎండల దృష్టా ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని చెబుతున్న అధికారుల ఆదేశాలను క్షేత్ర స్థాయి సిబ్బంది బేఖాతర్ చేస్తున్నారు. ఉపాధి కూలీలు పనులు చేసే చోట రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఎక్కడా కూలీలలకు నీడ వసతి కల్పించిన దాఖలాలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం… క్షేత్ర స్థాయిలో సిబ్బంది పట్టింపు లేని తనం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్న అధికారులు ఉపాధి కూలీలకు రక్షణ కల్పించేందుకు, ఎలాంటి ఆపాయాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే.

ఏప్రిల్ 12న మల్యాల మండలం తాటిపల్లి శివారులోని బోయిని గుట్ట వద్ద చేపట్టిన ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు కూలీలు వెళ్లారు. ఉపాధి పనులకు వెళ్లిన తాటిపెల్లి గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మీ (48) అనే మహిళపై అడవిలోంచి వచ్చిన అడవి పంది దాడి చేయగా తీవ్ర గాయాలపాలైంది. దాంతో తోటి కూలీలు ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది. ఉపాధి పనులకు వెళ్లి మృత్యువాత పడ్డ రాజ్యలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా నిర్వహించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించి వెనుదిరిగారు.

అలాగే ఏప్రిల్ 23న సారంగాపూర్ మండలం బట్టపల్లి గ్రామానికి చెందిన 38 మంది ఉపాధి కూలీలు బట్టపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు టాటా ఎస్ వాహనంలో వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వాహనంలో సామర్ధానికి మించి ఉండటంతో మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో అందులో ఉన్న పురాణం ఎల్లమ్మ, పురాణం మమత, పోతు లత, ఇట్టె లక్ష్మిలకు కాళ్లు, చేతులు విరగగా మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలు మరిచిపోక ముందే గత మంగళవారం మల్లాపూర్ మండలం కుస్తాపూర్ జానకమ్మ కుంటలో మట్టి తవ్వకం పనుల్లో పాల్గొన్న ఉపాధి కూలీలపై మట్టి పెల్లలు కూలడంతో సరికెల ముత్తమ్మ, సరికెల రాజు, జెల్ల పోసానిలు తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. ఉపాధి కూలీలు కుంటలోని పెద్ద మట్టి కుప్పను తవ్వుతుండగా పై నుంచి మట్టి పెల్లలు మీద పడటంతో ఊపిరాడక ముగ్గురు మృత్యువాతపడటం. ఇద్దరు తీవ్ర గాయాల పాలు కావడం గ్రామంలో విషాదం నింపింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం… క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టింపు లేని తనం వల్లే ఉపాధి కూలీలు దుర్మరణం పాలవుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉపాధి కూలీల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.