Home తాజా వార్తలు భారత్ కు చావో రేవో

భారత్ కు చావో రేవో

Openers who failed to get started in the first two matches

సిరీస్ కోసం ఇంగ్లండ్ తహతహ, నేటి నుంచి మూడో టెస్టు

ఓపెనర్లు ఈసారైనా..
తొలి రెండు మ్యాచుల్లో శుభారంభం అందించడంలో విఫలమైన ఓపెనర్లు ఈసారైన మెరుగైన ఆరంభాన్ని ఇస్తారనే నమ్మకంతో టీమిండియా ఉంది. తొలి మ్యాచ్‌లో విజయ్, ధావన్‌లు నిరాశ పరిచారు. రెండో మ్యాచ్‌లో రాహుల్‌ను ఓపెనర్‌గా దించినా ఫలితం లేకుండా పోయింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ను ఆడిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇక, తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా దిగిన స్టార్ ఆటగాడు మురళీ విజయ్ ఘోరంగా విఫలమయ్యాడు. లార్డ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ల స్థానంపై అనిశ్చితి నెలకొంది. ధావన్, విజయ్, రాహుల్‌లలో ఎవరికి తుది జట్టులో స్థానం లభిస్తుందో తేలలేదు. ఓపెనర్లుగా ఎవరు దిగిన జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరోసారి భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు ఖాయం.

రహానె, పుజారాలు కీలకం..
ఇక, రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి రెండు టెస్టులో రహానె ఘోరంగా విపలమయ్యాడు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్నా రహానె మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రహానె తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. పుజారా కూడా గాడిలో పడక తప్పదు. వీరిద్దరూ సామర్థం మేరకు ఆడితే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరుతాయి. కానీ వీరిద్దరూ ఎలా ఆడుతారో అంతుబట్టకుండా పోయింది. ఫాస్ట్ పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన వీరిద్దరు ఈ సిరీస్‌లో మాత్రం ఆశించిన విధంగా ఆడడం లేదు. రెండో టెస్టులో ఆడిన పుజారా పూర్తిగా నిరాశ పరిచాడు. ఈసారైన మెరుగ్గా ఆడాల్సిన బాధ్యత పుజారాపై నెలకొంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడనే దానిపై ఆసక్తి నెలకొంది. రహానె కూడా పూర్తి స్థాయి ఆటను కనబరచాలి.

కోహ్లి కీలకం..
మరోవైపు రెండో టెస్టులో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లికి మూడో టెస్టు కీలకంగా మారింది. తొలి టెస్టులో అసాధారణ పోరాట పటిమను కనబరిచిన కోహ్లి లార్డ్‌లో విఫలమయ్యాడు. గాయం వల్ల అతను సరిగ్గా ఆడలేక పోయాడు. కానీ, ప్రస్తుతం కోహ్లి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అంతేగాక ఇంగ్లండ్ బౌలర్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. తొలి టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీతో కోహ్లి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నాడు. వరుస ఓటములతో డీలా పడిన భారత్‌లో ఆత్మవిశ్వాసం నింపాలంటే కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచాలి. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడో వేచి చూడాల్సిందే.