Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎదురే లేదు

Opinion poll revealed that TRS in state come power again

మళ్లీ సిఎం కెసిఆరే, ముందస్తు మాస్టర్ స్ట్రోక్

ఇండియా టుడే పోల్
టిఆర్‌ఎస్‌కు బహుదూరంలో కూటమి

సానుకూల ఓటు ప్రభంజనం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కెసిఆర్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ‘మై యాక్సిస్ ఇండియా’, ‘ఇండియా టుడే’ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. టిఆర్‌ఎస్‌కు 44% మేర ఓట్లు రావచ్చని, మహా కూటమికి 34% ఓట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. గత నెల 22 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో పై విషయం వెల్లడైంది. సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో ఫలితాలు టిఆర్‌ఎస్‌కు మరింత ఆశాజనకంగా ఉన్నట్లు తేలింది. కనీసంగా పది శాతం మేర వ్యత్యాసం ఉన్నందున ఈ వెలితిని పూడ్చుకోవడం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కూటమికి కాస్త ఇబ్బందేనని ఆ సర్వే అభిప్రాయపడింది. విపక్షాలు కూటమిగా ఏర్పడ్డా ప్రయోజనం లేదని సర్వే తేల్చింది.

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలను ఇండియాటుడే ఛానెల్ గురువారం సాయంత్రం వెల్లడించింది. అందులో భాగంగా తెలంగాణ ఫలితాలను కూడా ప్రస్తావించింది. సర్వేలో అనేక ప్రశ్నలకు ప్రజల నుంచి స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడయ్యాయని ఛానెల్ వ్యాఖ్యాతలు రాజ్‌దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వల్‌లు పేర్కొన్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు కూడా సర్వే ఫలితాలతో ఏకీభవించి ‘మెథడాలజీ’పై సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ళుగా వివిధ సెక్షన్ల ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు, ‘ముందస్తు’ నిర్ణయం, ప్రభుత్వ పనితీరు పట్ల సానుకూలత టిఆర్‌ఎస్‌కు బాగా కలిసొస్తున్నాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి

ఫిర్‌భీ సిఎం కెసిఆర్ 75% : రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కావాలని 75% మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అన్ని సెక్షన్ల ప్రజలు ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేశారని, రెండు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కెసిఆర్‌కు ప్రజాదరణ పెరిగినట్లు సర్వేలో తేలింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ‘మాస్టర్ స్ట్రోక్’గా సర్వేలో తేలింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ దానికంటే అనుకూలతే ఎక్కువగా ఉందని, అందువల్లనే కెసిఆర్‌ను మళ్ళీ సిఎంగా కోరుకుంటున్నవారు సుమారు 75% మంది ఉన్నారని తేలింది. సెప్టెంబరులో చేసిన సర్వేలో కెసిఆర్‌కు 43% ప్రజాదరణ ఉంటే, నవంబరు నాటికి అది 46%కి పెరిగింది.

మహా కూటమికి 34% ఓట్లు మాత్రమే : టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా ఉన్న మహా కూటమి రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం దాదాపు పది శాతం వెనకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. అధికార టిఆర్‌ఎస్‌కు 44% ఓట్లు పడతాయని సర్వేలో తేలగా కూటమికి మాత్రం 34% మాత్రమే పడతాయని తేలింది. కెసిఆర్ సిఎం కావాలని కోరుకునేవారు 75% మంది ఉంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిఎం కావాలని కోరుకునేవారు పాతికశాతం లోపేఉన్నట్లు తేలింది. సెప్టెంబరులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్ల ప్రజాదరణ 18% నుంచి 25%కి పెరిగింది. ఇక బిజెపి కిషన్‌రెడ్డి పట్ల ఆదరణ 15% నుంచి 16%కి, కోదండరాంకు 6% నుంచి 7%కి పెరగ్గా ఒవైసీకి మాత్రం అదే స్థాయిలో 4%గా కొనసాగుతోంది.

 టిఆర్‌ఎస్‌దే హవా

తెలంగాణలో మరోసారి టిఆర్‌ఎస్ అధికారంలోకి రానుందని, తాజా సర్వేలో ముందంజలో ఉందని ఇండియాటుడే కన్సల్టెంట్ సంపాదకులు రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఇండియా టుడే తాజా సర్వేలో కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు 75% అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌కు 44% మేర ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు తేలిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

                                                                                                                                                                                  –  రాజ్‌దీప్ సర్దేశాయ్ 

10% తేడా భర్తీ అసాధ్యం 

టిఆర్‌ఎస్ కంటే మహాకూటమి 10% ఓట్ల మేర వెనకబడి ఉన్నందున భర్తీ చేయడం సులువైన అంశమేమీ కాదని చెన్నయ్ మేథమేటికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ రాజీవ కరండికర్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ అనుకూలత పెరుగుతూ ఉందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, పదిశాతం ఓట్ల తేడాను అధిగమించడం కూటమికి చాలా కష్టమని వ్యాఖ్యానించారు.

                                                                                                                                                                                        – రాజీవ కరండికర్

 పొత్తు బెడిసికొడుతుంది 

టిడిపితో పొత్తు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలకు కారణం కానుందని రాజకీయ శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ శాస్త్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా తెలుగుదేశం పట్ల ప్రజల్లో సాధారణ అభిప్రాయం ఉందని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన కాంగ్రెస్‌కు సానుకూలత కంటే వ్యతిరేకత పెరిగిందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉన్నందున టిడిపికి ప్రతికూలత ఉంటుందన్నారు.

                                                                                                                                                                                             – సందీప్ శాస్త్రి 

Opinion poll revealed that TRS in state come power again

Telangana Latest News

Comments

comments