Home ఎడిటోరియల్ సాధ్యమైతే ‘జమిలి’ మంచిదే!

సాధ్యమైతే ‘జమిలి’ మంచిదే!

Article about Modi china tour

లోక్‌సభ, శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించటం భారత లా కమిషన్ ప్రారంభించటంతో దాని మంచి చెడులపై చర్చ ఊపు అందుకుంది. దీర్ఘకాలంగా ప్రాథమిక చర్చల్లో ఉన్న ఈ అంశం ప్రధాని నరేంద్ర మోడీ, నీతి ఆయోగ్ సమర్ధనతో బలం పుంజుకుంది. అయితే దీనిపై స్థూల ఏకాభిప్రాయ సాధన దుర్లభం. శని, ఆది వారాల్లో లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బి.ఎస్. చౌహాన్‌తో చర్చల్లో పాల్గొన్న పార్టీల్లో 4 అనుకూలత వ్యక్తం చేయగా, 10 వ్యతిరేకించటం ఈ అంశంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతకు అద్దం పట్టింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పదవీకాలాన్ని కుదించుకోవటానికి సిద్ధపడదు. అందువల్ల ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ వంటి ప్రధాన సమస్య ముందుకు వస్తుంది. స్థూల ఏకాభిప్రాయం కుదిరితే రాజ్యాంగ సవరణ, ఇతర లీగల్ సమస్యల పరిష్కా రం కష్టం కాదు. అందువల్ల ఆ సమస్యను ప్రస్తుతానికి పక్కనపెడితే, ఆచరణాత్మక సమస్యలకు సమాధానం కావాలి. గత అనుభవాలనుబట్టి లోక్‌సభలో ప్రభుత్వం ఏదొక కారణంతో అర్థాంతరంగా పడిపోతే తక్షణం ఎన్నికలకు వెళ్లక తప్పదు కదా? అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు జమిలి ఎన్నికల ఏర్పాటు భగ్నం కాదా? ప్రస్తుత మోడీ ప్రభుత్వం లాగా ఎల్లప్పుడూ ఏకపక్ష మెజారిటీ ప్రభుత్వాలను ఊహించటం సాధ్యం కాదు కదా? అలాగే ఏదైనా అసెంబ్లీలో ప్రభుత్వం ఓడిపోయినపుడు లేదా మంత్రివర్గం తీర్మానం ద్వారా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసినపుడు జమిలి ఎన్నికల లింక్ తెగిపోదా? ఇత్యాది సమస్యలన్నిటికీ ముందుగా రాజ్యాంగ, లీగల్ పరిష్కారాలు అన్వేషించగలిగినప్పుడే జమిలి ఎన్నికల ఆలోచన ముందుకు సాగుతుంది.ఈ విన్యాసం కొనసాగిస్తూనే, ఈలోపు 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుల ద్వారా, ఎన్నికల కమిషన్ అధికారం ద్వారా అసెంబ్లీ ఎన్నికలను జోడించటం ఉత్తమం. చట్టసభల పదవీకాలం ముగియటానికి ఆర్నెల్ల ముందు నుంచి ఎప్పుడైనా ఆ సభకు ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 14(2) ఎన్నికల కమిషన్‌కు ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది సమస్య కాదు. 1999 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగాయి. 1952 నుంచి 1967 వరకు సార్వత్రిక ఎన్నికలు ఒకే పర్యాయం జరిగాయి. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ గుత్తాధికారం బద్దలై పలు రాష్ట్రాల్లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఏర్పడినది మొద లు దేశ రాజకీయ వ్యవస్థ కుదుపులు, చీలికలు పీలికలు కావటంతో జమిలి ఎన్నికల లింక్ తెగిపోయింది. ఇప్పుడు ప్రధానిమోడీ జమిలి ఎన్నికలను ముందుకు తేవటం వెనుక బిజెపి దురాలోచనను, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే ఆలోచనను కొన్ని పార్టీలు శంకిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లా కమిషన్‌కు లేఖ ద్వారా స్పష్టంచేసినట్లుగా జమిలి ఎన్నికలు సాధ్యమైతే అవి ఎంతో ఉత్తమం. ఆయన చెప్పినట్లు ఇప్పుడు అత్యధికరాష్ట్రాలు ఐదేళ్లలో రెండుసార్లు (లోక్‌సభ, అసెంబ్లీకి వేర్వేరుగా) ఎన్నికలకు వెళ్లాల్సివస్తోంది. ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులు రెండుసార్లు ధనం వెచ్చించాల్సి వస్తోంది. అధికార యంత్రాంగం ఐదారు మాసాలపాటు ఎన్నికల పనిలో నిమగ్నం కావటంవల్ల పరిపాలన కుంటుపడుతోంది. అంతేగాక రెండుసార్లు ఎన్నికల నైతిక నియమావళి అమలులో ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రకటించే అవకాశం లేదు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్లపాటు పరిపాలనపై కేంద్రీకరించగలుగుతుంది. ఇదీ టిఆర్‌ఎస్ సూత్రబద్ధ వైఖరి. 2019లో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది.
కాగా పొరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జమిలి ఎన్నికల ఆలోచనను వ్యతిరేకిస్తున్నది. దీనిలో ప్రాంతీయ పార్టీలను అస్థిరీకరించే బిజెపి కుట్రను చూస్తున్నది. అయితే 2019లో లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎలాగూ జరుగుతాయి కాబట్టి అందుకు అభ్యంతరం లేదంది. డిసెంబర్ ఫిబ్రవరి మధ్య మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న బలమైన ఊహాగానాలు పరిస్థితిని గందరగోళపరుస్తున్నాయి.
లా కమిషన్‌కు తమ అభిప్రాయాలు తెలియజేయటానికి బిజెపి సమయం కోరటం, మిత్ర పక్షాలతో చర్చించిన అనంతరం తమ అభిప్రాయం వెల్లడిస్తామని కాంగ్రెస్ ప్రకటించటం కొసమెరుపు.