Home ఎడిటోరియల్ ప్రతిపక్షాలు ఇట్లానే ఉండాలి!

ప్రతిపక్షాలు ఇట్లానే ఉండాలి!

Will the Congress Follow Another Step

ప్రతిపక్షాలు ఇట్లానే ఉండాలి. అప్పడే అధికార పక్షానికి భరోసా మరింత కలుగుతుంది. ప్రతిపక్షాలతో పాటు కొందరు విమర్శకులు, కొందరు మేధావులు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుండాలి. అందువల్ల అధికారంలో గల వారికి ఇంకా నిశ్చింత ఏర్పడుతుంది. ప్రతిపక్షాలకు, విమర్శకులకు ప్రజల దృష్టిలో విశ్వసనీయత ఎంత తగ్గితే అధికారపక్షానికి అంత మేలు జరుగుతుంది. తెలంగాణలో సరిగా ఇదే కనిపిస్తున్నది. ప్రతిపక్షాలు తీరుపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పుడప్పుడు కించిత్ ఆగ్రహం చూపుతున్నారు గాని, వాస్తవానికి మనసులో ఎంతో సంతోషిస్తున్నారనుకోవాలి.

ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అవసరమైనవన్నీ, చెప్పినవన్నీ నూటకి నూరు శాతం అమలు పరచలేవు. ఇందుకు కాంగ్రెస్, బిజెపి నుంచి కమ్యూనిస్టుల వరకు ఎవరూ మినహాయింపు కాదు. ఈ మాటతో ఎవరైనా విభేదించదలచుకుంటే, అట్లా నూటికి నూరు శాతం అమలుపరచిన తమతమ పార్టీ దృష్టాంతాలను ముందుకు తెచ్చిచూపాలి. పోనీ ఇతర పార్టీల ప్రభుత్వాలను అయినా సరే. టిఆర్‌ఎస్ పాలిస్తున్నది కేవలం నాలుగేళ్లనుంచి కాగా వీరంతా పదులకొద్దీ సంవత్సరాలు పరిపాలించారు. కనుక వీరంతా కొద్దిపాటి నిజాయితీ అయినా చూపటం అవసరం . అది వీరు చూపకుండా కపటపు మాటలు మాట్లాడినా వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసు. అందువల్లనే ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల మాటలకు విలువ లేకుండా పోతున్నది.

దీని అర్థం కెసిఆర్ నాయకత్వాన గల ప్రభుత్వం పొరపాట్లు చేయటం లేదని కాదు. ఇచ్చిన హామీలన్నీ అమలైపోయాయని కాదు. వైఫల్యాలను ప్రతిపక్షాలు, విమర్శకులు ఎత్తిచూపవలసిందే. అది జరగనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. మరొక విషయం కూడా చెప్పాలి. వివిధ ప్రతిపక్షాలు తాము పాలించినపుడు, లేదా పాలించిన చోట్ల విఫలమైనట్లయితే, అంతమాత్రన టిఆర్‌ఎస్ వంటి ఇతర పార్టీ ప్రభుత్వాలను విమర్శించే నైతిక హక్కును కోల్పోతాయనలేము. ఆ విధమైన ఆంక్షలను విధించుకుంటూ పోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడూ, ఎక్కడా పనిచేయజాలవు. ఎందుకంటే, అన్ని విధాలా నిక్కమైన పార్టీలంటూ ఉండటం సాధ్యంకాదు. ప్రజారాజ్యం గాని, రాజకీయం గాని, పరిపాలన ఆయా క్రమాల వంటివి.

పార్టీలకు బయట ప్రజలు కూడా ఉంటారు. ఇదంతా అధికార పక్షం ప్రతిపక్షంతో పాటు విమర్శకులు ప్రజలు అనే ఒక ముక్కోణపు స్థితి. ఈ మూడు శక్తుల మధ్య సాగే కార్యకలాపపు క్రమంలోనే సమాజం వికసిస్తుంది. అందువల్ల ఆ క్రమంలో ముగ్గురి భాగస్వామ్యం తప్పనిసరి. ప్రతిపక్షాలు గతంలోనో, మరెక్కడనో విఫలమైనప్పటికీ వాటి విమర్శలు, ఆ రూపంలో భాగస్వామ్యాలు ప్రజాస్వామ్యంలో ఉండాలనటం అందువల్లనే.

సరిగా అదే కారణంగా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు ఎత్తి చూపటంలో ఆక్షేపించవలసింది ఏమీ ఉండదు. కాని ఇది స్థూలమైన మాట. అక్కడినుంచి ముందుకు వెళ్లి చెప్పుకోవలసినవి కొన్నున్నాయి. విమర్శించవలసింది వేటిని? అసలు విమర్శ అంటే ఏమిటి? ఏ విధంగా విమర్శించాలన్నవి ప్రశ్నలు. విమర్శ అన్నది మంచి చెడుల వివేచన. విమర్శ దేని గురించి అయినా చేయవచ్చు. విమర్శంచవలసింది ఆ వివేచనకు అనుగుణంగా ప్రస్తుతం తెలంగాణలో అటువంటి వివేచనతో విమర్శలు చేస్తున్నవారు కొందరున్నారు.

ఇంకా చెప్పాలంటే కొద్దిమందే ఉన్నారు. చాలా కొద్ది మంది . ముఖ్యంగా ప్రతిపక్షాలలో ఏ ఒక్కటి కూడా ఆ విధంగా కన్పించదు. అది వారి స్వేచ్ఛ అన్నది నిజమే. ఏ విమర్శ ఏ పద్ధతిలో చేయాలన్నది వారికి ఎవరూ చెప్పనక్కరలేదు. కాని స్వతంత్రంగా పరిశీలించినప్పుడు, అందువల్ల వారికి గాని, ప్రజలకు గాని కలిగే మేలు ఏమైనా ఉందా అనేది చూడవలసిన విషయం. అన్నింటికన్న ప్రధానంగా తమ విమర్శవలన సామాన్య ప్రజలకు పెరిగే అవగాహన, తమ పట్ల ప్రజలకు కలిగే విశ్వసనీయత ఏమిటన్నది చూడవలసిన విషయాలు.

ఇపుడు కొన్ని వివరాలలోకి పోదాము. కెసిఆర్ ప్రభుత్వం తాజాగా రైతులకోసం రైతుబంధు పథకం ప్రకటించింది. ఆగస్టు 15నుంచి వారికి జీవిత బీమాను అమలుకు తేగలమన్నది. రైతులకోసం, వ్యవసాయంకోసం గత నాలుగేళ్లలో చాలా చేసింది. అవి తర్వాత చూద్దాము.పైన పేర్కొన్నవి రెండు తాజావి అయినందున వాటి గురించి ప్రతిపక్షాల వైఖరిని గమనిద్దాము. రైతులకు పంటపెట్టుబడి కోసం ఉచితంగా పంట ఒక్కింటికి, ఎకరా ఒక్కింటికి నాలుగువేల రూపాయలు ఇవ్వటం ఎక్కడా విననిది. అందువల్ల తెలంగాణ వంటి ప్రాంతంలో రైతులకు కలిగే ఉపయోగం చాలా ఉంటుంది. కనీస ఇంగితజ్ఞానం కలవారు ఎవరైనా అర్థం చేసుకోగల విషయమిది. కాని ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రకటించినది మొదలు ఇపుడది దాదాపు ముగుస్తున్న దశ వరకు కూడా అన్ని ప్రతిపక్షాలు, కొందరు విమర్శకులు ఏదో ఒక వంకతో ఆ పథకాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. వీరు ఇంతమాత్రం ఇంగితజ్ఞానం లేనివారా, మంచిని మెచ్చగల కనీస సహృదయత వీరికి లేదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

వారి విమర్శలలో విలువ ఏమిటి? ఎకరానికి సాగు ఖర్చు చాలా ఉంటుందని, నాలుగు వేలు ఏం చాలుతుందని పెదవి విరిచారు కొందరు. ఇందులో కమ్యూనిస్టులు కూడా ఉండటం విచిత్రం. మద్దతు ధర పెంచకుండా రైతుబంధు ఏమిటన్నారు. వ్యవసాయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకన్నారు. అంతా ఎన్నికల కోసమన్నారు. ఇది ధనిక రైతులకు ఉపయోగపడేదే తప్ప మామూలు వారికి కాదన్నారు. అక్రమాలు అనేకం జరుగుతున్నాయన్నారు. చివరకు కొందరైతే తమ కవితాశక్తిని ప్రదర్శిస్తూ అది రైతుబంధు కాదు, రైతు రాబందు’ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల విశ్వసనీత ప్రజల దృష్టిలో మట్టిలో కలవటమని, వారి తీరు ఈ విధంగా ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇక కావలసింది లేదని అనటం అందువల్లనే .

ఇంతమంచి పథకం, ఈ మాత్రపు పథకం దేశంలోనే మరెక్కడా లేక స్వయంగా రైతాంగం చెప్పలేనంత సంతోషంగా ఉన్నప్పుడు, అందువల్ల కలిగే మేలును మామూలు మనిషి కూడా అర్థం చేసుకోగలుగుతున్నపుడు, ప్రతిపక్షాలు చేయవలసింది ఏమిటి? అందులోని మౌలికమైన మంచిని గుర్తిస్తూ, ఒకవేళ తమవద్ద ఏమైనా సూచనలు ఉంటే చేయవచ్చు. లోటుపాట్లు ఉంటే ఎత్తిచూపవచ్చు. అమలులో అక్రమాలు జరిగితే ప్రభుత్వదృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇటువంటి వైఖరి రైతులకు ఉపయోగపడుతుంది. తమ విమర్శక పాత్రను పోషించటం కూడా అవుతుంది. కాని వారు ఇటువంటిదేమీ చేయటం లేదు. అటువంటపుడు అపహాస్యం పాలు కావటం తప్పవారి విశ్వసనీయత ఎంత మాత్రం పెరగటంలేదు. పైగా ఇంకా దెబ్బ తింటున్నది.

ఈ సందర్భంలో కౌలురైతుల సమస్య నిరంతరం ప్రస్తావనకు వస్తున్నది. ఈ రైతుల సమస్య ఇప్పటిది కాదు. కాని దానిని ఇంతవరకు ఎవరూ పరిష్కరించలేకపోయారు. ఎందువల్లనో వారెవరైనా చెప్పగలరా? ఇప్పుడు రైతుబంధు పథకం వారికి వర్తించటం లేదు. అందులోని చిక్కులు ఏమిటో ప్రభుత్వం చెప్తున్నది. అందుకు నిర్దిష్టంగా పరిష్కారాలను ప్రతిపక్షాలు సూచించటం లేదు. పోనీ ‘కౌలు ఒప్పందం’ అనే దానితో నిమిత్తం లేకుండా వారికి ఇతరత్రా చేయగల సహాయం ఏమైనా ఉందేమో సూచనలు చేయటం లేదు. ప్రతిపక్షాలకు కావలసింది చిక్కులు తొలగి కౌలు రైతులకు మేలు జరగటమా, లేక ఈ విషయమై యాగీ చేస్తూ కౌలు రైతుల మిత్రులుగా నటించటమా? విషయమేమిటో అర్ధమవుతూనే ఉన్నది.

అటువంటపుడు వారి విశ్వసనీయత పెరుగుతుందా? ఈ ధోరణి చూసినపుడు రైతులు సరేసరిగాకా కౌలు రైతులైనా ప్రతిపక్షాలకు ఓటు వేస్తాయా? ఎందుకంటే, కౌలు రైతులలో ఎంతోమందికి ఒకమేరకు స్వంత భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వ్యవసాయంకోసం చేస్తున్న ఇతర మంచి పనులు అనేకం వారికి కూడా ఉపయోగపడుతున్నాయి. అదిగాక, తమ కోసం ఈ ప్రతిపక్షాలు లోగడ పాలించినపుడు చేసిందేమీలేదని వారికి తెలియదా?

రైతు బంధు తర్వాత బీమా పథకం అమలుకు రానున్నది. దీనితో మరొక రాయి గుండెల్లో పడిందా అన్నట్లు ప్రతిపక్షాలు మళ్లీ పాత పాట పాడుతున్నాయి. మద్దతు ధర పెంచే పని కేంద్రానిదని తెలిసినా, ఆ పని చేయటం లేదని రాష్ట్రాన్ని విమర్శిస్తున్నాయి. బీమా వల్ల వ్యవసాయ సమస్య ‘సమగ్రంగా’ పరిష్కారం కాబోదంటున్నాయి. దృష్టి మళ్లించటం, ఎన్నికల కోసమనటం వంటిది ఎప్పటివలెనే సాగుతున్నది. కెసిఆర్ తప్పక సంతోషిస్తుండి ఉంటారు.

టంకశాల అశోక్
9848191767