Home దునియా సేంద్రియ సేద్యంలో ఆదిలాబాద్ ఆడబిడ్డలు..!

సేంద్రియ సేద్యంలో ఆదిలాబాద్ ఆడబిడ్డలు..!

Organic Farming

ప్రపంచవ్యాప్తంగా సాగువిధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సురక్షిత ఆహారం దిశగా ప్రపంచం ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ ఉత్పత్తుల తయారీకి అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సైతం వ్యవసాయోత్పత్తుల విషయంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించేలా అన్ని దేశాలనూ కోరుతోంది.  ఈ నేపథ్యంలో సేంద్రియ సాగు చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ, భూసారాన్ని కాపాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన రైతులు. వారిని దునియా పలకరించింది.

మాది ఇంద్రవెల్లి మండలం, మామిడిగూడ. మా పేర్లు సాబ్లె భురిజబాయి, నారాయణ్. మాకు వాటర్‌షెడ్ పరిధిలో రెండెకరాలుంది. ఈ భూమిలో పంట పండించడానికై శిక్షణ తీసుకున్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతిలో పచ్చిమిర్చి, టొమేటో, వంకాయ, చిక్కుడు, బీరకాయ, బెండకాయ, కొత్తిమీర, మెంతి, పాలకూర వంటి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ, ప్రతీ వారం సమీప మార్కెట్‌కి తరలించి నెలకు కనీసం రూ.12వేల వరకు ఆదాయం పొందుతున్నాం. నాబార్డు ఆర్థిక సహకారంతో శ్యాంప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ సర్వీస్ అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధి పథకం మా జీవితాలలో వెలుగును తెస్తోంది. ఈ పథకం ద్వారా 96 కుటుంబాలు లబ్ధి పొందాయి. ఒక యూనిట్‌కి మేము వెయ్యి రూపాయలు ఖర్చు చేసుకుంటే, నాబార్డ్ నాలుగు వేల రూపాయల సహకారం అందిస్తోంది. మొత్తం ఐదు వేల రూపాయలతో మా రైతు కుటుంబాలు మంచి ఫలితాలను పొందుతున్నాయి.
ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది…
ఇంద్రవెల్లి మండలం, జెండాగూడ గ్రామంలో జుగ్నాక భాగుబాయిను పలకరిస్తే… సేంద్రియ పద్ధతిలో మినుము పంటను సాగు చేస్తున్నాం. ఈ సాగు వల్ల క్రిమిసంహారక ఎరువుల ఖర్చు బాగా తగ్గింది. సొంతంగా పండించుకున్న ఆరోగ్యకరమైన మినపపప్పుని ఇంట్లో వాడుకుంటూ, మిగిలింది సంతలో అమ్ముకుంటున్నాం. మాకు బయట నుంచి మినపప్పు కొనే అవసరం తగ్గడంతో పాటు సంవత్సరానికి పది వేల రూపాయల ఆదాయం వస్తోంది. మేము పండించుకున్న మినపప్పు రుచిగా ఉంటుంది. నాబార్డు మాకు వాతావరణ మార్పు అనుసరణ (కె.ఎఫ్.డబ్ల్యు. సోయిల్ ప్రాజెక్ట్) పథకం ద్వారా సేంద్రియ సాగులో అవగాహన కలిగించింది.
మట్టిని ఇలా కాపాడుకుంటున్నాం..
వాతావరణ మార్పు అనుసరణ పథకం సహకారంతో శ్యాం ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ వారు భూమి సారవంతం చేసేందుకు సలహాలిస్తున్నారు. బండ రాళ్ళ కట్టలు కట్టడం ద్వారా సారవంతమైన మట్టి పొలంలోనే ఆగి భూమి సారం పెరిగింది. తద్వారా పంట దిగుబడి పెరిగింది. రైతులు విత్తనాలు వేసే సమయంలో అత్యధిక వర్షపాతం కారణంగా సారవంతమైన మట్టి వర్షంలో కలసి వెళ్ళిపోతూ వుంటుంది. దాన్ని మార్చడానికే నాబార్డ్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. బండరాళ్ళ కట్టలు పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించాం. దాంతో వర్షాకాలంలో సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఆగింది. భూమి సారం పెరగడంతో భూమిలో తేమశాతం ఎక్కువకాలం నిలువ ఉంటుంది. ఈ పథకం ద్వారా చాలా లాభం పొందాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది పత్తి పంటకు అధిక దిగుబడి వచ్చింది. ఎకరాకు ఎనిమిదివేల రూపాయలు సంపాదిస్తున్నాం.
భూసారం పెరిగింది..
రైతు లక్ష్మింబాయి మాట్లాడుతూ…గతంలో మా భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా మొరంతో గట్టిగా వుండేది. పొలంలో చెరువు మట్టి వేయడం వల్ల పంట దిగుబడి పెరిగింది. ఈ పథకం ద్వారా మేము లబ్ధి పొందాం. ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉంటే వాటిని సాగుకి చక్కగా వినియోగించుకోవచ్చు. బిందుసేద్యం, సోలార్ పంపుసెట్లు, పందిళ్ల నిర్మాణం వంటివాటికి ప్రభుత్వ సబ్సిడీనే వాడుకుంటున్నాం.

పంచగవ్య, ఘన జీవామృతం

పాటగూడ గ్రామంలో గిరిజన మహిళల మంతా పశుపోషణ చేస్తూ, ప్రతిరోజూ 15 నుంచి 20 లీటర్ల ఆవు మూత్రం, ఆవు పేడ సేకరిస్తున్నాం. ఆ మూత్రంతో జీవామృతం, పంచగవ్య, ఘన జీవామృతం తయారు చేసి మా పొలాల్లో వేసుకుంటున్నాం. అంతే కాకుండా ఇతర రైతులకు కూడా అందిస్తాం. ఇలా చేయడం వల్ల ఎరువులు, పురుగు మందుల ఖర్చు దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింది.
మట్టి పరీక్షలో 50మందికి శిక్షణ..
రైతులు అధిక దిగుబడులు సాధించలేకపోవడానికి కారణం, తమ భూములతత్వం ఎలా వుందో రైతులు తెలుసుకోకపోవడం కూడా ఒకటి. మట్టి పరీక్ష జరపడం ద్వారా భూమిలో పోషకాల లోపాలను అర్థం చేసుకుని, నివారణ చర్యలు చేపట్టవచ్చు. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించడానికి నాబార్డ్ పూనుకుంది. ఇంద్రవెల్లిలో 50 మంది రైతులకు మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 1. జెండాగూడ, 2. బండి పాటగూడ, 3. రాంజీ గూడ, 4. మోడీ గూడ, 5. పాక్డి గూడ, 6. లాంగాపూర్, 7. వాడగం, 8. డొంగార్గవ్, 9. శివగూడ, 10. పాట గూడ గ్రామాలకు చెందిన రైతులు ఒక్కో గ్రామం నుంచి ఐదుగురు రైతుల చొప్పున ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో మహిళా రైతులు కూడా ఉన్నారు. భూమిలో పోషకాలు ఏ నిష్పత్తిలో వున్నాయో ఎలా గ్రహించాలనేది ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్నారు.
సేంద్రియ సాగు ఫలితాలు ..
-గతంలో ఇక్కడ మమ్మల్ని రక్తహీనత వేధించేది. ఇప్పుడు ఆ సమస్య దూరమైంది.- గతంలో కూరగాయలు కొనుగోలు చేయడానికి వారానికి, 5 నుంచి 6 వందల రూపాయల వరకు వెచ్చించాల్సి వచ్చేది.ఇప్పుడు కూరగాయలు బయట కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. మేము పండిస్తున్న కూరగాయల ద్వారా నెలకు పది నుంచి 15 వేల రూపాయల వరకు లబ్ధి పొందుతున్నాం. – గతంలో పత్తి సాగు చేయడం వల్ల ఎకరానికి ఖర్చులన్నీ పోను 8 వేలు మాత్రమే మిగిలేది. ఇప్పుడు నీటి వసతితో మిశ్రమ పంటలు సాగు చేయడం వల్ల ఎకరానికి రూ.12 వేల
ఆదాయం వస్తుంది. -చెరువు మట్టి పొలంలో చల్లడం వల్ల భూమిలో తేమ శాతం పెరగడమే కాక, భూసారం పెరుగుతోందని మేము గ్రహించాం.

Organic Farming in Adilabad
                                                                     

శ్యాంమోహన్, మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి