Home వార్తలు అవుసుల బ్రహ్మయ్య తాత తెచ్చినవే అసలైన గణపతి విగ్రహాలు

అవుసుల బ్రహ్మయ్య తాత తెచ్చినవే అసలైన గణపతి విగ్రహాలు

ఊరి దస్తూరి: ఎన్కట వినాయకున్ని అవుసులోల్లు తయారుచేసికొని తాంబాలంల పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చుకుంట పోయేది. అందుకుగాను వాల్లకు బియ్యం పప్పు ఇన్ని పైసలు ఇచ్చేది. అది చెర్ల బంక మన్నుతోని తయారుచేసిన వినాయకుడు. ముందురోజే చెర్లకుపోయి మన్ను తెచ్చి ఎండపోసి తర్వాత నీళ్ళల్ల నానపెట్టి మెత్తగ చేసే కళ విశ్వబ్రాహ్మణులకే వస్తది. 

Ganapathi-of-clayగణపతి పండుగ వచ్చిందంటే ఇంటింటికీ పండుగనే. పోరగాండ్ల నుంచి పెద్దోల్ల దాకా పండుగ లెక్కనే సందడి ఉంటది. గణపతి పండుగ నాడు ఎగిలి వారంగ నుంచి ఇల్లు అలుకుడు వాకిలి సల్లుడు తోని మొదలైతది పండుగ. అదేరోజు మామిడి ఆకులు తెచ్చి దర్వాజలకు కట్టుకునుడు. ఇంటి ముందు వాకిట్ల జాజు సున్నం రంగులతోని గుండ్రంగ ఎంకన్న అడుగులు అని వేస్తుండేవాల్లు. ఆ అడుగల్లనే వినాయకుడు అడుగుపెట్టి ఇంట్లకు వస్తడని నమ్మిక.
అసలు వినాయకుని రూపమే అందరికి ఇష్టమైతది. ఎన్కట వినాయకున్ని అవుసులోల్లు తయారుచేసికొని తాంబాలంల పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చుకుంట పోయేది. అందుకుగాను వాల్లకు బియ్యం పప్పు ఇన్ని పైసలు ఇచ్చేది. అది చెర్ల బంక మన్నుతోని తయారుచేసిన వినాయకుడు. ముందురోజే చెర్లకుపోయి మన్ను తెచ్చి ఎండపోసి తర్వాత నీళ్ళల్ల నానపెట్టి మెత్తగ చేసే కళ విశ్వబ్రాహ్మణులకే వస్తది. వాళ్ళ చేతుల్లనే కళ ఇమిడి ఉన్నది. అందుకే చెవులకు ముక్కులకు రామ సక్కదనం అసొంటి బంగారి పోగులు తయారుచేస్తరు. చిన్నగుండె ఎత్తు బంగారంను సుత ఎటు అంటే వేడిచేసి తీగ చేసి సాగకొట్ట మలుస్తరు. కళ శ్రమ దాగి ఉన్న మనుషులు వాల్లు. ఎన్కట వాల్లు మాత్రమే వినాయకున్ని చేయాలనే ఆచారం ఉన్నది. వాల్ల ఇంట్ల వినాయకున్ని చేసేందుకు సాంచ ఉంటది. దానితోని ఇంట్ల ముందురోజు రాత్రి కూసోసి అవసరం ఉన్న విగ్రహాలను తయారుచేస్తుంటరి. అవన్ని మన్నుతోనే చేస్తరు. ఆ తర్వాత ఊరంత కల్సి ఒక దగ్గర సుత చేస్తుంటిరి. అది కూడా మన్నుతోనే చేస్తరు. ఆ తర్వాత అక్కనే భజనలు, కీర్తనలు, పాటలు ఉంటయిగని గీ చెవులు కరాబు చేసే డీజె సౌండ్‌లు ఉంటయి. ఎవల పని వాల్లు చేసికునేది.
ఇప్పటి లెక్క చూస్తే పరేశాన్ అన్పిస్తది. ఎందుకంటే మన్ను ప్రకృతి వినాయకుడు ఆఖరుకు ప్రకృతిల అంటే నీళ్ళల కలువాలె. అంటే మన్నుతోని తయారుచేస్తే ఎవలకు ఏం ఇబ్బందిలేదు. అయ్యే మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తోని వినాయకుని విగ్రహాలు తయారుచేసి నీళ్ళల్ల వేస్తుండ్రు దాంతోని నీళ్లు కాలుష్యం నీళ్ళల పెరిగే జీవరాశులకు నష్టం వస్తంది. ఇది ఎవలు పట్టించుకుంట లేరు. ఆఖరుకు సర్కారు సుత మట్టి వినాయకున్నే పూజిస్తాం అని ప్రచారం నిర్వహిస్తంది. ఎన్కటకెల్లి చేసినదాన్ని కాదని వద్దని ఇప్పుడు పాత పద్ధతికి రావాలంటే ఎంత కష్టమో సూడుండ్రి. ఎవలు మారుతలేరు. ఏడసూడు వాడవాడల గవే ప్లాస్టర్ ప్యారీస్ రసాయన వినాయకులు కన్పిస్తున్నయి. చెవులు గెల్లుమనే డి.జె.సౌండ్‌లు వినబడుతున్నాయి.
ఊర్లల చవితి పండుగ వచ్చిందంటే నీళ్ళు నిండిన చెర్లు దేవుల్లు ఎవల ఇంట్లవాల్లకే ఉండేటియి తొమ్మిదిరోజులు పూజలు అయినంక చెర్ల ఏసి వచ్చేది. ఇప్పుడు పద్ధతి అదే అయినా మన్ను విగ్రహాల స్థానంల రసాయన మిశ్రమల విగ్రహాలు తప్పున్నది. దీన్నుంచి ఎవలకువాల్లం వేరై స్వతంత్రంగా ఉండాలంటే ఎల్ల అన్నదే ప్రశ్న.ఎవల వినాయకుడు పెద్దగుంటే అదే పెద్దిర్కం అన్నట్టుగ ప్రచారం జరుగుతుంది.
ఏవైతేవాడద్దో అవే తక్కువగ వాడే కాలం వస్తుంది. పూర్వకాలంలో ఇంటింటికి చెయ్యి సంచులు ఉండేది. ఇంట్ల సంచులన్నీ ఒక చిలక్కొయ్యకు ఏసుకొనేది. ఏమన్న సామానుకు పోదామంటే చెయ్యి సంచి తీసికొని సామాను తెచ్చేది. ఇప్పుడు సంచి లేదు గించి లేదు. చేతులు ఊపుకుంట పోవుడు రాంగ ప్లాస్టిక్ సంచిల సామాను తెచ్చుడు. ఆ ప్లాస్టిక్ సంచులల్ల ఏమన్న తినంగ మిగిలినయి ఏసి అవుతల ఇసిరేస్తే ఆవు, మ్యాక ఏదైనా ప్లాస్టిక్ కాయిదంతో తింటయి. దాని కడుపులకు పోయి పొట్ట ఉబ్బిసస్తన్నయి. ఇది అర్థం అయితలేదు.
ప్రకృతికి విరుద్ధంగా సహజానికి వ్యతిరేకంగా మనుషుల ఇట్లా చేసుకుంట పోతనే ఉన్నరు. అయినా చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లుగ అయితంది కత. ఎట్ల నడవాలనో అట్ల నడుస్తలేరు వ్యాపారంపైన పెట్టుబడి ప్రచారం మనిషిని మనిషి కాకుంట చేస్తన్నయి. చేసినంక కొన్నింటికి మనిషి బానిస అయి ఇలా ప్రకృతిని చెరపడుతున్నడు అయితె ఇవన్ని ముందుగ చేసేవి సదువుకున్నవాల్లే పట్నంల ఉన్న తెల్లబట్టలు కట్టుకున్నవాల్లే చేస్తున్నరు. తర్వాత ఇవన్ని గందరగోళాలు అవలక్షణాలన్ని పల్లెలకు వ్యాపిస్తన్నయి పట్నంను చూసి పల్లె కరబు అయితంది. అసలు ప్రకృతి లంటి పల్లెను సూసి వికృతిలాంటి పల్లె నేర్చుకోవాలిగని అంత ఉల్టా అయితంది. ఏదీ ఏమైన ఎన్కట మా ఇంటికి అవుసల బ్రహ్మయ్య తాత చేస్కిచ్చిన వినాయకుని విగ్రహామే అసలైనది. ఇప్పుడన్ని రసాయన రంగుల మయం అయితన్నయి.

Annavaram-Devendar

అన్నవరం దేవేందర్,
సెల్ :9440763479