Home హైదరాబాద్ కొత్త భవనం కోసం హెల్మెట్లు ధరించి వైద్యం

కొత్త భవనం కోసం హెల్మెట్లు ధరించి వైద్యం

Doctors

మన తెలంగాణ/గోషామహల్ : శిథిలావస్థకు చేరిన పాత భవనానికి ప్రత్యామ్నాయంగా కొత్త భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది చేపడుతున్న ఆందోళన ఉధృతరూపం దాలుస్తుంది. గత 68 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఉస్మానియా వైద్యులు బుధవారం వినూత్నరీతిలో ఆందోళన చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం స్థానంలో వెంటనే కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ఉస్మానియా మెడికల్ జెఎసి ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది పాత భవనంలో హెల్మెట్లు ధరించి రోగులకు వైద్యసేవలు అందించారు. శిథిలావస్థకు చేరి తరచుగా పెచ్చులూడిపడుతూ ప్రమాదకరంగా మారిన ఉస్మానియా పాత భవనంలో విధులు నిర్వహించాలంటే వైద్యసిబ్బంది జంకుతున్నారని, పాత భవనంలో చికిత్సలు అంటే రోగులు భయాందోళనలను గురవుతున్నారని అర్థం వచ్చే విధంగా రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది తలపై హెల్మెట్‌లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. హెల్మెట్లు ధరించి రోగులకు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వారు పాత భవనంలో ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. వెంటనే కొత్త భవనం నిర్మించాలని, గతంలో సిఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ జెఎసి ఛైర్మన్ ఆర్ పాం డునాయక్, ప్రతినిధులు డాక్టర్ రాంసింగ్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీధర్, కె రాములు, శ్యామ్‌సుందర్, గడ్డం భాస్కర్, రవిగౌడ్, శ్రీనివాస్, మోహన్, హేమలత, జయమ్మలతో పాటు ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.