Home తాజా వార్తలు త్వరలో ఓయూ టీచింగ్ పోస్టుల భర్తీ

త్వరలో ఓయూ టీచింగ్ పోస్టుల భర్తీ

OU Campus

294 అసిస్టెంట్ ప్రొఫెసర్, 121 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
మనతెలంగాణ / ఉస్మానియా యూనివర్సిటీః త్వరలోనే ఓ.యూ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం తెలిపారు. ఓయూలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండేళ్ళ క్రితం ఓ.యూకు రాష్ట్ర ప్రభుత్వం 294 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, 121 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. రోస్టర్ వివాదం వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీ ఆగిపోయిందన్నారు.

తాజాగా పాత రోస్టర్ విధానానికే కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం, యూజిసి కూడా ఇటీవలే రిక్రూట్‌మెంట్ చేయాలని సర్కులర్ జారీ చేసిన దృష్ణా తాము నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని వివరించారు. ఓ.యూ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఆయా డిపార్టుమెంటుల మధ్య పోస్టుల సంఖ్యను రేషనలైజేషన్ ద్వారా సర్దుబాటు చేయడం జరిగిందని, రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్‌ను కూడా పూర్తి చేయడం జరిగిందని వి.సి తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదిహేను రోజుల్లో ఓ.యూ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో ఓ.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఓఎస్‌డి ప్రొఫెసర్ టి.కృష్ణారావు, ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌లు పాల్గొన్నారు.

OU Teaching posts Notification 2019 Soon