Home రాష్ట్ర వార్తలు నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా

నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా

ktr-and-kadiyamతెలంగాణలో తుపాకి మోతలు వద్దు : కెటిఆర్

మన తెలంగాణ/ వరంగల్: నక్సలైట్ల సామాజిక, ఆర్థిక ఎజెండాయే తమ ఎజెండా…. తెలంగాణలో నెత్తురు చిందాలని ఇటు పోలీసులు గానీ, అటు నక్సలైట్లుగానీ కోరుకోవడంలేదు. రాష్ట్రంలో తుపాకీ మోతలు వినిపించ వద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటి శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా శనివారం హన్మ కొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్సలైట్ల సామాజిక, ఆర్థిక ఎజెండాను తాము అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రూ.30 వేలకోట్ల పైచిలుకు నిధులను సంక్షేమ పథకాల అమలుకు విని యోగిస్తున్నామని పునరుద్ఘాటించారు. వందశాతం మంది ప్రజలు తుపాకీ మోతలులేని తెలంగాణను కోరు కుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని కెటిఆర్ పేర్కొన్నారు. గల్లీ నాయుడు, ఢిల్లీ నాయుడు కలిసి తెలంగాణకు అన్యా యం చేశారని విమర్శించారు.

తెలంగాణ విషయంలో కేంద్రప్రభుత్వం, బిజెపి సున్నకు సున్న అల్లికి అల్లి అనే రీతిలో వ్యవహరిస్తుందన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో గంటసేపు కూడా గడిపే తీరిక మోడీ లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పలురకాల పథకాల నిధులు నిలిచిపోయాయని చెప్పారు. బిఆర్‌జిఎఫ్, ఐసిడిఎస్, మోడల్ స్కూళ్లు, అంగన్‌వాడీలకు కేంద్రనిధులు తగ్గించా రన్నారు. తొమ్మిది గంటల్లో ఐపిఎస్, ఐఎఎస్ ఉద్యోగు లను విభజించే అవకాశం ఉన్నప్పటికీ తొమ్మిది నెలలు గా జాప్యం చేశారని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికీ హైకోర్టు విభజన చేయ లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ ఇచ్చిన హామీ అమలుకు నోచు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిలు పార్లమెంట్‌లో నిరసన తెలియజేసినా చర్యలు లేవని చెప్పారు.

గతంలో వాటర్‌గ్రిడ్‌కు వైఎస్‌ఆర్ అడ్డంకి
కెసిఆర్ కరీంనగర్ ఎంపిగా ఉన్నప్పుడే వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేశారని, కేంద్రం 80శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధమైనా నాడు సిఎంగా ఉన్న వైఎస్‌ఆర్ రాష్ట్ర వాటాగా 20 శాతం నిధులు ఇచ్చేందుకు అంగీకరించ లేదన్నారు. దానిని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. వాటర్ గ్రిడ్ కోసం 1.50 లక్షల కిలోమీటర్లు పైప్‌లైన్, 19వేల వాటర్ ట్యాంకులు, 12 వేల చోట్ల రోడ్లను, రైల్వే ట్రాక్‌ల ను దాటి పనులు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మూడేళ్ళలో పూర్తి చేసే లక్షంతో ఉన్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతం గా రూ. 35వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో జనగామ, ఘన్‌పూర్, పాలకుర్తిలో కొన్ని ప్రాంతాలకు సంవత్సరంలోపే నీళ్ళు అందే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఎంపిలు సీతారాం నాయక్, బాల్క సుమన్, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, రెడ్యానాయక్, డాక్టర్ రాజయ్య,టిఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.