Home ఖమ్మం కాసులుంటే అక్రమం ఆమోదమే

కాసులుంటే అక్రమం ఆమోదమే

Outline of officers Enigma

ప్రక్షాళన మాటున భారీ వసూళ్లు
అంతుపట్టని అధికారుల తీరు
అడ్డగోలుగా పట్టాదారు పాస్‌పుస్తకాలు
కాళ్లరిగేలా తిరగడం తప్ప పనులు మాత్రం జరగట్లే
తప్పు సరిచేసుకోవాలంటే భారీ మొత్తంలో ముట్టజెప్పాలి మరి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. కాసులుంటే అక్రమం ఆమోదం పొందుతుంది. తమను సంతృప్తి పరిస్తే ఏ ఆధారం లేకున్నా పట్టాదారు పాస్‌పుస్తకం వస్తుంది. క్షేత్రస్థాయి అధికారులు తృప్తిపడకపోతే అన్ని ఉన్నా ఏదీ కాదు, రాదు. ఇప్పటి వరకు ఇచ్చిన పాస్‌పుస్తకాల్లో వచ్చిన తప్పులు రెవిన్యూ అధికారులకు వరంగా మారి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. రైతులకు ఉన్నతాధికారుల తీరు అంతుపట్టడం లేదు. మండలాధికారులు తప్పు చేశారని ఉన్నతాధికారుల వద్దకు వస్తే తిరిగి తహశీల్దార్‌ల వద్దకే పంపిస్తున్నారు. అక్కడికి ఇక్కడికి కాళ్లు అరిగేలా తిరగడం తప్ప అసలు పని కావడం లేదు. అధికారుల తీరు అసలు అంతుపట్టడం లేదు.

మన తెలంగాణ/ఖమ్మం :  పట్టాపాస్‌పుస్తకాల పంపిణీ రెవెన్యూ శాఖలో భారీ వసూళ్ల పర్వానికి తెరలేపింది. భూ రికార్డులలో చిన్న తప్పిదం ఉన్నా భారీ మొత్తంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. గతం కంటే కొందరు రైతులకు ఇప్పుడు ఇబ్బందులు మరింత పెరిగాయి. భూ రికార్డుల ప్రక్షాళన నేపథ్యంలో రెవిన్యూ శాఖలో భారీ దందానే తయారైంది. గ్రామాల్లో భూ రికార్డులలో తప్పులు ఉన్నా, పాసుపుస్తకాల్లో తప్పిదాలు ఉన్నా మేము చూసుకుంటాం అంటూ ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అన్ని ఆధారాలు ఉన్నా పట్టాదారులు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నానా కొర్రిలు పెడుతున్నారు. కొంత మందికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా పాసుపుస్తకాలు ఇచ్చేస్తున్నారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన కోయ ఝాన్సీలక్ష్మికి సర్వే నెంబరు 148/3లో  1.02 ఎకరాల భూమి ఉంది. 2014 వరకు వీరి పేరునే పట్టాదారు పాసుపుస్తకాలు ఉండగా ప్రస్తుతం ఈ వ్యవసాయ భూమి వీరి ఆధీనంలోనే ఉంది. ఏం జరిగిందో కానీ 2015లో ఈ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డుల్లో నమోదు చేసి ఆన్‌లైన్ చేశారు. అనేక దశాబ్దాలుగా తమ పేరున ఉంటూ తమ స్వాధీనంలో ఉన్న భూమిపై వేరే వారికి హక్కులు కల్పించడం పై అధికారులను ఆశ్రయించారు. విఆర్‌వో తప్పిదమన్నారు. రికార్డుల్లో మాత్రం సరి చేయలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన వారు రెవిన్యూ కోర్టును ఆశ్రయించారు. భూమి ఝాన్సీలక్ష్మిదే అని తీర్పు వచ్చింది. అయినా రెవిన్యూ అధికారులలో చలనం లేదు. మూడుసార్లు ఖమ్మం కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ప్రతిసారి కలెక్టర్ ముదిగొండ తహశీల్దార్‌ను సమస్య పరిష్కరించమని వినతిపత్రం పై రాయడం తహశీల్దార్ చేయకపోవడం జరుగుతూనే ఉంది. ఝాన్సీలక్ష్మికి భూమిపై హక్కు కల్పించకపోగా ఏ ఆధారం లేని వ్యక్తికి పట్టాదారు పాసుపుస్తకం, రైతుబంధు చెక్కును అందజేశారు. ఈనెల 11న ఖమ్మం కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ ఝాన్సీలక్ష్మి భూ సమస్యను పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం లేదు. సోమవారం కూడా గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. ఎటువంటి ఆధారం లేని వారికి ఎలా పాసుపుస్తకం ఇచ్చారంటే సమాధానం లేని పరిస్థితి. చింతకానిలోనూ అదే పరిస్థితి. మామిళ్లపల్లి సరోజిని అనే మహిళా రైతు పొద్దుటూరు గ్రామంలో సర్వే నెం.239/అ, 239/ఆ లో ఉన్న ఎకరం భూమి ఇతరులు పట్టా చేయించుకున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఇతరులకు తన భూమికి సంబంధించిన పాసుపుస్తకం ఇచ్చారని సరోజిని వాపోతుంది. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించడంతో పాటు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది. ఉన్నతాధికారులు వినతి పత్రంపై సంతకం చేసి తిరిగి తహశీల్దార్లకు పంపడం తప్ప ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించడం లేదు. మండలాధికారులు తప్పు చేశారని ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోకుండా తిరిగి వారి దగ్గరకే పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. కాసులు ముట్టజేప్పకపోతే రకరకాల కొర్రిలు పెడుతున్నారని మరి కొంత మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆధారిత ఆరోపణలు వచ్చినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక భూ వివరాలు తప్పు నమోదైన వ్యవహారంలో ఇదే పరిస్థితి. కొంత మంది సిబ్బంది కావాలని తప్పులు చేసినా చర్యలు కరువయ్యాయి. ఇప్పటికైనా అక్రమ మార్గాలలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.