Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

టీచర్ల ఖాళీలపై అయోమయం

Over 10 lakh teachers jobs in the country are vacant

దేశంలో విద్యావ్యవస్థలో ఎంత అయోమయం ఉందో తెలియజెప్పే విషయాలు బయటపడుతున్నాయి. దేశంలో మొత్తం పది లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి స్కూలు స్థాయిలో ఉన్న ఖాళీలు ఈ విషయాన్ని స్వయంగా మానవవనరుల శాఖ పార్లమెంటులో తెలియజేసింది.

విచిత్రమేమంటే, స్కూలు స్థాయిలోనే దేశంలో 4 లక్షల మంది టీచర్లు అదనంగా ఉన్నారట. ఆ మంత్రిత్వశాఖ జరిపిన ఇంటర్నల్ సర్వేలో ఈ వాస్తవం కూడా తెలిసింది. ఇది అయోమయంగా లేదా? ఒకవైపు ఖాళీలున్నాయంటారు? మరోవైపు అదనంగా టీచర్లున్నారంటారు? ఏది సత్యం? ఏదసత్యం?? ఓ పరమాత్మా అని దేవుడినే ప్రశ్నించాలిక.

అయోమయం అందరిలోను ఉంది. ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అయోమయం ఉంది. మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారులు ఈ లెక్కలేమిటో అర్థం కాక బుర్రగోక్కుంటున్నారు. ఈ లెక్కల్లో దాగి ఉన్న పజిల్ విప్పలేక వెర్రిచూపులు చూస్తున్నారు. ఈ రెండు లెక్కలు ఒక వారం తేడాలోనే వచ్చాయి. అదనంగా టీచర్లున్నారని ఒకవైపు చెబుతూ మరోవైపు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరోవైపు చెబుతూ, అసలు తాము చెప్పిందేమిటో అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అసలీ అయోమయానికి కారణం బ్యూరోక్రాటిక్ తప్పులని, అసలు అయోమయం ఏదీ లేదని అర్ధం కాని వివరణలేవో వస్తున్నాయి కాని అసలు సత్యమేమిటో తేలలేదు.

జులై 30, 2018వ తేదీన లోక్ సభలో మానవవనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఇచ్చిన వివరాల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 9,00,316 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. సెకండరీ స్కూళ్ళలో 1,07,689 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఖాళీలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో బీహారు ఉంది. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా టీచర్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం కొన్ని స్కూళ్ళలో ఒక్క టీచరు లేదా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. విచిత్రమేమంటే, కొన్ని స్కూళ్ళలో టీచర్ల సంఖ్య తక్కువుంటే కొన్ని స్కూళ్ళలో అవసరం కన్నా ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు.

ఈ వైరుధ్యానికి దారితీసిన కారణాలు అనేకం ఉన్నాయి. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్ళను మూసేయడం, విద్యార్థులను మరో స్కూలుకు తరలించడం కూడా జరిగింది. ఇలా తక్కువ విద్యార్థులున్న స్కూళ్ళను కలిపేయడం వల్ల టీచర్ల పోస్టింగులపై ప్రభావం పడింది. ఇలా కలిపేసిన స్కూళ్ళ లెక్క కేంద్రం వద్ద లేదు. టీచర్ పోస్టుల ఖాళీలు లెక్కించడంలో కూడా దీనివల్ల సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణం వల్లనే టీచర్ పోస్టుల ఖాళీల విషయంలో అయోమయం ఏర్పడింది.

కొన్ని ప్రాంతాల్లో టీచర్లకు స్కూళ్ళలో అపాయింట్ మెంట్ ఇవ్వడం జరగదు. రాష్ట్ర ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నియామకాలు జరుపుతుంది. లేదా మరో నియామక సంస్థ ఈ అప్పాయింట్ మెంట్లు చేస్తుంది. పలుకుబడి ఉన్న అభ్యర్థులు తమ పరపతి ఉపయోగించి డైరెక్టరేట్ లోనే పోస్టింగ్ సంపాదించుకుంటారు. దూరప్రాంతాల్లో, ఊళ్ళల్లో ఉన్న స్కూలుకు వెళ్ళి బోధించే శ్రమ లేకుండా తప్పించుకుంటారు.

ఈ పలుకుబడి, పరపతి, సిఫారసుల వ్యవహారం ఎలాంటిదంటే, టీచరు బోధించవలసిన అవసరం లేని చోట్ల టీచర్లు పోస్టింగ్ సంపాదిస్తారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బోధనా కార్యక్రమాలు, క్లాసులు ఉండవు. కాని 2000 మంది టీచర్లు డైరెక్టరేట్‌లో పోస్టింగ్ సంపాదించుకున్నారు. ప్రభుత్వం నుంచి టీచర్ పొందవలసిన జీతం పొందుతున్నారు. కాని డైరెక్టరేట్ లో బోధనేతర పనులు చేస్తూ కాలం గడిపేస్తారు. దీనివల్ల స్కూల్లో టీచర్లుండరు. స్కూళ్ళలో టీచర్ స్థానాలు ఖాళీగా ఉంటున్నాయి. కాని నియమాకాల్లో మాత్రం టీచర్ల సంఖ్య కనిపిస్తుంది.

సరే టీచర్ల ఖాళీలు ఇలా కనిపిస్తున్నాయనుకుందాం. మరి టీచర్లు అదనంగా ఉన్నట్లు లెక్కల్లో ఎలా వచ్చింది? మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్గత సర్వేలో 4 లక్షల మంది టీచర్లు అదనంగా ఎలా కనిపిస్తున్నారు? ఈ ప్రశ్నకు కూడా జవాబుంది. అధికారుల వివరణ ప్రకారం దేశంలో ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నట్లు లెక్కలను విశ్లేషిస్తే తెలిసింది. కాని ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలన్నది నిర్ధారిత నిష్పత్తి. కాబట్టి ఈ నిష్పత్తి ప్రకారం చూస్తే నాలుగు లక్షల మంది టీచర్లు అదనంగా ఉన్నారని లెక్కించారు. దీనిక్కారణమేమంటే, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి చోట్ల బోధనేతర పనులు చేస్తున్న టీచర్లు కూడా నియామకం టీచరుగా జరిగింది కాబట్టి స్కూళ్ళలో బోధిస్తున్న టీచర్లుగానే లెక్కలోకి వచ్చారు. అందువల్ల టీచర్లు అదనంగా కనిపిస్తున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ఈ అయోమయాన్ని తొలగించే పనిలో పడింది. టీచర్లు, విద్యార్థులు, స్కూళ్ళకు సంబంధించి మరింత డాటా సేకరించడం ద్వారా వాస్తవాలేమిటో కనిపెట్టే ప్రయత్నం మొదలు పెట్టింది. ప్రతి రాష్ట్రంలోను ఎన్ని స్కూళ్ళున్నాయి? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది టీచర్లున్నారు? ఎంతమంది టీచర్లు బోధనేతర పనుల్లో నియమించబడ్డారు? వారెందుకు బోధనేతర పనుల్లో ఉన్నారు? బోధనేతర సిబ్బంది నియామకాలు ప్రత్యేకంగా జరగడం లేదా? వంటి అనేక ప్రశ్నలకు జవాబులు అవసరముంది.

ప్రతిరాష్ట్రానికి ఎంతమంది టీచర్లు అవసరం, ఎంతమంది అందుబాటులో ఉన్నారన్న వివరాలు కేంద్రానికి పంపించాలని, ఈ వివరాలు ప్రతి సంవత్సరం పంపించాలని ఇప్పుడు మానవవనరుల శాఖ గట్టిగా చెప్పింది. ఇంతవరకు ఈ విషయంలో రాష్ట్రాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పటికైనా ఈ వివరాలు పంపిస్తే టీచర్లు ఎంతమంది అవసరమన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. డిమాండ్ సప్లయ్ వివరాలు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం కేంద్రానికి పంపించడంలో అడ్డంకులేమున్నాయో కూడా పరిశీలించాలి. పలుకుబడి, పరపతి ఉపయోగించి బోధనేతర పోస్టుల్లో కొనసాగుతున్న వారి పలుకుబడి కూడా అడ్డంకి అవుతుందా అన్నది కూడా ఆలోచించాలి.

మంత్రిత్వ శాఖ ఇంటర్నల్ సర్వేలో టీచర్, స్టూడెంట్ నిష్పత్తిని విశ్లేషించి నాలుగు లక్షల మంది టీచర్లు అదనంగా ఉన్నారని చెప్పినా నిజానికి పదిలక్షల మంది టీచర్లు అవసరమని లోక్‌సభలో మానవవనరుల శాఖ మంత్రి చేసిన ప్రకటనను గమనిస్తే విద్యావ్యవస్థ పట్ల, ప్రాథమికస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళ పట్ల ఎంతటి అశ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

Comments

comments