Home దునియా సుస్వరాల సుశీల

సుస్వరాల సుశీల

Gana-kokila-Susha-image

పాటను అర్థం చేసుకుని భావంలో లీనమై పరవశం చెందుతూ పాడటం పి. సుశీల ప్రత్యేకత. అందుకే ఏ భాషలో పాడినా ప్రశంసలే. పాట వింటుంటే ఆ పాట సుశీల పాడుతున్నదనే కాకుండా ఏ కథానాయికకు పాడుతోందో కూడా అభిమానులు గుర్తించేలా చేసే మ్యాజిక్ కూడా ఆ స్వరంలో ఉంది. అందుకే ఆమెను గాన కోకిల అన్నారు. సంగీత సరస్వతి గా గుర్తించారు. తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని చేయాలని విజయనగరంలో ప్రయత్నిస్తే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నా లలిత గీతాల ఆలాపన పైనే మక్కువ చూపేవారు. తర్వాత సినీరంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.

విజయనగరంలోని సంపన్న కుటుంబానికి చెందిన పులపాక శేషావతారం , ముకుందరావు బ్రాహ్మణ దంపతులకు 1935 నవంబర్ 13న జన్మించింది. తండ్రి న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు ఆర్జిస్తూ కళల మీద కూడా ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి వీణ వాయించడంలో నిష్ణాతుడైతే తల్లికి సంగీతంలో మక్కువ. అందుకే శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని చేయాలని విజయనగరంలోని ద్వారం వెంకట స్వామినాయుడు వద్ద అయిదేళ్లకు పైగా శిక్షణ ఇప్పించారు. విజయనగరం మహారాజ కళాశాలలో సంగీతంలో డిప్లొమో కూడా అందుకున్నారు. ఆంధ్రదేశమంతటా కచేరీలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోసాగారు. అప్పుడే మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో కోర్సు చేయాలని తలచి తండ్రి అనుమతితో మద్రాసు చేరారు 1949ప్రాంతంలో . రేడియోలో పాటలు పాడే అవకాశం కూడా దక్కింది.

కె.ఎస్. ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో కన్నతల్లి చిత్రాన్ని నిర్మిస్తూ పెండ్యాల నాగేశ్వరరావుని సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. జి. వరలక్ష్మి, ఆర్. నాగేశ్వరరావు జంటకు అక్కినేని నాగేశ్వరరావు, నంబియార్ ఆచిత్రంతో కుమారులు. ఈ చిత్రంలోని పాటలకు గ్రూప్ సింగర్స్‌గా పదిమందిని పంపమని పెండ్యాల కోరితే పిల్లల ప్రోగ్రాం చేసే న్యాపతి రాఘవరావు (ఈయనకు రేడియో అన్నయ్యగా గుర్తింపు చాలా వుండేది) పంపిన పదిమందిలో సుశీల కూడా ఉన్నారు. సుశీల స్వరం విన్న పెండ్యాల తొలుత భాగవతంలోని రెండు పద్యాలు పాడించారు.

యక్షగానంచ గ్రూప్ సాంగ్‌లో కూడా పాడించి సుశీల గాన మాధుర్యానికి పులకించి శ్రీశ్రీ, ఆరుద్ర కలిసి రాసిన ఎందుకు పిలిచావెందుకు…..అనే పాటను ఎ.ఎం. రాజాతో కలిపి పాడించి యుగళగీతంగా రికార్డ్ చేశారు. సౌండ్ ఇంజినీర్ నాగరాజ్ ద్వారా సుశీల గురించి తెలుసుకున్న ఎ.వి.ఎం సంస్థ అధినేత చెట్టియార్ సుశీలను పిలిపించి ఎ.వి.ఎం కి మాత్రమే పాటలు పాడేలా మూడేళ్ల అగ్రిమెంట్‌ని జీతం ప్రాతిపదికన రాయించుకున్నారు. ఎ.వి.ఎం తో పాటరికార్డింగ్ జరుగుతూంటే విన్న దుక్కిపాటి మధుసూధన్‌రావు, కె.వి.రెడ్డి తాము రూపొందించే దొంగరాముడు చిత్రానికి పాటలు పాడించాలని నిర్ణయించుకుని అగ్రిమెంట్ అడ్డువస్తుందని తెలిసి చెట్టియార్‌తో సంప్రదింపులు జరిపి రద్దు చేసి స్వతంత్ర గాయనిగా చేశారు. దొంగరాముడు చిత్రం కోసం భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ….అనురాగం విరిసేనా ఓ రే రాజా…. తెలిసిందా బాబూ…గీతాలను సుశీలతో 1954లో పాడించారు. దొంగరాముడికి పాడిన పాట రికార్డింగ్ థియేటర్‌లో విన్న చక్రపాణి లతామంగేష్కర్ పాడిందని అనుకుని వివరాలు తెలుసుకుని మిస్సమ్మలో పాడించేశారు. బృందావనమది అందరిదీ….బాలనురా మదనా…అని సుశీల పాడిన మిస్సమ్మలోని పాటలు ఆదరణ పొందాయి. మిస్సమ్మ ముందు అంటే 1955 జనవరిలో, దొంగరాముడు అక్టోబర్ 1955లో విడుదలయ్యాయి. పాటలు హిట్ కావడంతో సుశీలతో పాడించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించేవారు.

ఎ.ఎం.రాజాతో పాటలు పాడటం ప్రారంభించిన సుశీల క్రమక్రమంగా ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ , ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , రామకృష్ణ, ఆనంద్ ఇలా పలువురి గాయకులతో కలిసి పాడుతూ అలరించసాగారు. తెలుగులో ఇప్పటివరకు 12000కి పైగా , తమిళంలో ఏడువేల పాటలు, కన్నడం, మలయాళ భాషల్లో అయిదువేల పాటలు వంతున, హిందీలో అయిదు వందలకు పైగా పాటలు పాడారు. సంస్కృతం, సింహళీస్ భాషల్లోనూ పాడారు. ఏభాషలో పాడితే ఆ భాష తన మాతృభాష అయినట్లుగా గళం సరిచేసుకునేవారు. వివిధ భాషా చిత్రాల్లో బిజీ అయిపోతున్న సుశీలకు ఘంటసాల ఆ రోజుల్లో ఎంతో స్వేచ్ఛ ఇచ్చి, ఆమె చోట్ల పాడే అవకాశం కల్పించేవారు. సినిమా పాటలే కాకుండా వివిధ భాషల్లో భక్తి గీతాలను ఆలపించి అలరించారు. మొత్తం మీద 40 వేలకు పైగా గీలాలు ఆలపించారు వివిధ భాషల్లో.

బాలసుబ్రహ్మణ్యంతో తొలిసారి శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో 1966వ సంవత్సరం చివర్లో ఎస్.పి. కోదండపాణి సంగీత సారధ్యంలో ఓ ఏమి ఈ వింత మోహము ఆహా ఏమి కలవరము..పాడిన సుశీల ఆయనతోనే మూడు వేల యుగళ గీతాలు వివిధ భాషల్లో పాడారు. అలా సినిమాలకు సంబంధించి యుగళగీతాల చరిత్రలో ఈ ఇద్దరూ రికార్డు నెలకొల్పారు.

పన్నెండు భాషల్లో 17695 పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానాన్ని నెలకొల్పారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో మార్చి 2016లో గాయనిగా రికార్డ్ నెలకొల్పారు. భావాన్ని దృష్టిలో పెట్టుకొని రక్తి కట్టించేలా ఎలా పాడలో ఘంటసాల నేర్పించారని, క్లిష్టమైన సంగతులు జొప్పిస్తే ఎలా పాడి మెప్పించాలో సాలూరి రాజేశ్వరరావు పాడితే విని నేర్చుకుని అభివృద్ధి చెందానని అంటారామె. అన్ని భాషల్లో అందరు సంగీత దర్శకుల అభిమానం పొందటమే కాక, వారి నుంచి ప్రశంసలు పొందారు. గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సుశీల గాయనీ గాయకులను ప్రతి యేడూ సత్కరించాలని పి. సుశీల ట్రస్ట్‌ని 2008లో ఏర్పాటుచేశారు. జాతీయ అవార్డు నెలకొల్పి అక్కినేనితో. స్ఫూర్తి చెందే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి జాతీయ అవార్డుగా నెలకొల్పి తొలి అవార్డుని సహచర గాయని ఎస్. జానకికి హైదరాబాద్ రవీంద్రభారతిలో బాలమురళీకృష్ణ, కె. రోశయ్య చేతుల మీదుగా 2008, నవంబర్ 13 అందజేశారు. లక్ష రూపాయల చెక్కు జ్ఞాపిక ఈ అవార్డుగా నెలకొల్పారు.

విజయనగరం వాసి అయిన మోహనరావు మద్రాసులో డాక్టర్ కోర్స్ చదువుతూంటే పరిచయమై ఆమె పాటల అభిమాని కూడా కావడంతో ప్రేమించి 1957 లో పెళ్లి చేసుకున్నారు. గుండె జబ్బు కారణంగా అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయించిన కొద్ది రోజులకే 1990 ఏప్రిల్ 29 న ఆయన అమెరికాలో మృతి చెందాడు. సంగీతంలో సూచనలిచ్చే భర్త ఎడబాటుతో కొంతకాలం పాటలకు దూరం అయ్యారు.

సమగ్ర ఆంధ్ర సాహిత్య రచన కోసం సినిమా గీతాలు మానేసి, అది 1991లో పూర్తి చేసి , కిడ్నీ వ్యాధి వచ్చి కోలుకున్న ఆ మధ్య మళ్లీ పెళ్లి పుస్తకం కోసం శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఒక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం …అని రాశారు. అలా ఈ పాట పాడటంతో రెండోసారి గాయినిగా మళ్లీ కొత్త జీవితం ప్రారంభించి, తనను దృష్టిలో పెట్టుకుని ఆ పాట రాసారని భావించారు. చక్రవాకంలో తను పాడిన వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నదీ రాగం తనకు చాలా ఇష్టమైన పాట అని చెప్పే సుశీల తను పాడిన ప్రతి పాట తనకు ఇష్టమే అంటారు.

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె… హృదయపు కోవెలలో..చీరలెత్తుకెళ్లాడే చిన్ని కృష్ణుడు..సోగ్గాడే చిన్నినాయనా.,..పాడనా తెలుగుపాట పరవశమై…అన్నయ్య కలలే పండెను…అందలం ఎక్కాడమ్మా…పిలువకురా అలుగకురా…చందన చర్చిత… తనువా హరిచందనమా…నాపాటనీ నోట పలకాల సిలకా…వస్తాడమ్మా నీదైవమూ…రివ్వున సాగే రెపరెపలాడే…హల్లో ఇంజినీర్…సంతోషం చేసుకుందాం…ఇలా ఎన్నో పాటలతో మురిపించారు.

                                                                                                                              వి.ఎస్. కేశవరావు 9989235320