Home జగిత్యాల రైతుకు కష్టకాలం

రైతుకు కష్టకాలం

Paddy-fields

నీళ్లు లేక ఎండుతున్న పంట పొలాలు
ఎండిన పొలాలను పశు మేతకు వదిలివేత
రైతన్న కంట కన్నీళ్లు

జగిత్యాల: వరి రైతుకు కష్టకాలమొచ్చింది. గత ఖరీఫ్ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక అంతంత మాత్రంగానే దిగుబడి రాగా, రబీ సీజన్‌లో వరి సాగు చేసిన అన్నదాతలకు నిరాశే మిగలనుంది. రోజు రోజుకు మండుతున్న ఎండలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దాంతో జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల తదితర మండలాల్లో చేతికందే సమయంలో వరి పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలను కాపాడుకునేందుకు రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతుండడంతో పంటలకు చాలినంత నీరందక ఎండిపోతుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత రెండుమూడేళ్ళుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూములన్నీ బీళ్లుగా మారగా ఈ యేడు వర్షాలు సమృద్దిగా కురవడంతో బావుల్లో భూగర్భ జలాలు చాలా వరకు పెరిగాయి.

దాంతో రబీ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం చాలా వరకు పెరిగింది. అయితే గత రెండు నెలల నుంచి భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి. దీనికి తోడు ఎండలు మండుతుండడంతో చేతికందే సమయంలో వరి పంట ఎండిపోతోంది. పంటలను కాపాడుకునేందుకు ఎక్కడ నీటి సౌకర్యం ఉంటే అక్కడి నుంచి పైపులతో నీటిని సరఫరా చేసేందుకు రైతన్నలు యత్నిస్తున్నా సకాలంలో నీరందక చాలా వరకు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతుండడంతో చేసేదేమి లేక ఎండిపంట పొలాల్లో పశువులను మేపుతున్నారు. “మూలిగే నక్కపై తాటిపండు” పడ్డ చందంగా గత రెండు, మూడేళ్ళుగా పంటలు లేక తీవ్ర కరువును ఎదుర్కొన్న తాము ఈ యేడు పెట్టుబడి పెట్టి నిండా మునిగామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతాంగం ధీనంగా వేడుకుంటున్నారు.