Saturday, April 20, 2024

పద్మ పురస్కారాల బహుకరణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు. 2020 సంవత్సరం పద్మపురస్కారాలలో భాగంగా నలుగురికి పద్మ విభూషణ్, ఎనమిది మందికి పద్మ భూషణ్, 61 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందినవారిలో కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసులు పండిట్ ఛన్నూలాల్ మిశ్రా ఉన్నారు. వీరి తరఫున వీరి ఆత్మీయులు పురస్కారాలు తీసుకున్నారు. జైట్లీ తరఫున ఆయన భార్య, స్వరాజ్ తరఫున ఆమె కూతురు వీటిని అందుకోవడానికి వచ్చారు.

ఈ దశలో రాష్ట్రపతి అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌ల విశిష్టతను కొనియాడారు. వారు ప్రతిభావంతులైన పార్లమెంటేరియన్లుగా సేవలు అందించారని తెలిపారు. అరుణ్ జైట్లీ బహుముఖ ప్రతిభను ప్రస్తావించారు. పార్లమెంటేరియన్‌గా, లాయర్‌గా ఆర్థిక వేత్తగా కూడా దేశానికి సరైన దిశానిర్థేశనం చేశారని తెలిపారు. శ్రీమతి సుష్మా స్వరాజ్ భారతీయ సంప్రదాయాలకు విలువ ఇస్తూ, దూరదృష్టిగల నాయకురాలిగి పేరుతెచ్చుకున్నారు. మహిళా సాధికారతకు కృషి చేసిన మేటి మహిళగా నిలిచారని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, సామాజిక సేవలో డాక్టర్ అనిల్ ప్రకాశ్ జోషి, ప్రజా వ్యవహారాల రంగంలో డాక్టర్ ఎస్‌సి జమీర్, ఆధ్యాత్మికవాదంలో ముంతాజ్ అలీలకు పద్మ భూషణ్‌లు అందాయి. పద్మ పురస్కారాల ప్రదాన ఘట్టానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇతర ప్రముఖులు హాజరయ్యారని అధికారిక ప్రకటనలో తెలిపారు.

Padma Awards 2020 felicitation at Rashtrapati Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News