Home మెదక్ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు?

ఇంకా ఎన్ని రోజులు చేస్తారు?

Padma Devender Reddy Talking About R&B Works

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : జిల్లా కేంద్ర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా నిర్ధేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే ఎలా అని ఆర్ అండ్ బి శాఖ అధికారులపై ఉప సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహంలో ఆ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన పనులు, జరుగుతున్న నిర్మాణాలపై అధికారులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… పట్టణ రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరైనా పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరుగడం లేదన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతుందని, పనుల్లో వేగం పెంచాలని ఎన్నిసార్లు ఆదేశించినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక గంగినేని థియేటర్ నుండి ఎల్లమ్మగుడి వరకు జరుగుతున్న పనులపై ఉపసభాపతి అసంతృప్తి వ్యక్తం చేశారు.

పూర్తిస్థాయి నిర్మాణం కావడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందని అధికారులను ప్రశ్నించారు. వాటర్‌వర్క్ పనులు నెమ్మదిగా జరుగుతుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ఉపసభాపతికి వివరించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కల్వర్టులు, రోడ్డు నిర్మాణం జరుగాలని నిధులు సరిపోవేమో అనే అపోహలు వద్దని నిధులు మంజూరుకు కృషి చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో పనుల నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. జెయంసి గ్రూప్‌ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న డివైడర్ నిర్మాణం వేగంగా జరుగడం లేదని సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడితే వేగం పెంచాలని ఆదేశించారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులను నెమ్మదిగా చేస్తున్నట్లు కాంట్రాక్టర్ ఉపసభాపతి దృష్టికి తేగా బిల్లుల చెల్లుంపులో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కానీ పనుల్లో వేగం తగ్గిస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విధంగా చేస్తే ఏలా అని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వక్తం చేశారు. 15 రోజుల్లో డివైడర్ నిర్మాణం పూర్తికావాలని, లేనిచో కాంట్రాక్టు పనులను ఇతర సంస్థలకు అప్పగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ధ్యాన్ చందర్ చౌరస్తా నుండి కొత్త కలెక్టరేటు వైపు రెండు కిలోమీటర్ల దూరంలో డివైడర్, లైటింగ్ సిస్టం ఏర్పాటుకు 2 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఉపసభాపతి ఆదేశించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డ్రైన్ టూ డ్రైన్ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలుకు మంజూరు చేయాలని ఇంజనీర్ ఇన్ ఛీఫ్ ఆర్ అండ్ బి రవీందర్‌ను ఫోన్ ద్వారా కోరారు.

పట్టణంలోని నర్స్‌ఖేడ్ రహదారిని మున్సిపాలిటీ నుండి ఆర్ అండ్ బి శాఖకు అప్పగిస్తూ మున్సిపల్ పాలకవర్గం తీర్మాణం చేసి అందించాలన్నారు. జిల్లా కేంద్రంలో కొత్త మున్సిపాలిటి, ఆర్ అండ్ బి గెస్ట్ హోజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 13న మాయ గార్డెన్ వద్దగల బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలన్నారు. పట్టణంలో వాటర్‌వర్క్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నీటి సరఫరా పనులను త్వరితగతిన  పూర్తి చేసి రోడ్డు వేయడానికి అనువుగా సిద్దం చేయాలన్నారు. ఇంకా 36 భవనాలు అక్రమనలో ఉన్నాయని వాటిని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్నా విద్యుత్ పోల్స్ తొలగించాలని ఎన్నిసార్లు అడిగా ఎల్‌సీ ఎందుకు ఇవ్వడం లేదని పట్టణ ట్రాన్స్‌కో ఏఇ రాజేశ్వర్‌ను ప్రశ్నించారు. స్థంబాలను తొలగించకుండా అభివృద్ధి పనులు ఎలా ముందుకు సాగుతాయని, అభివృద్ధికి అడ్డుగా మారారంటూ ట్రాన్స్‌కో ఏఇపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్ అండ్ బిశాఖ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, ఇఇ చంద్రయ్య, మున్సిపల్ చైర్మేన్ మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ కమీషన్ సమ్మయ్యతో పాటు ఇతర అధఇకారులు పాల్గొన్నారు.