Home ఆఫ్ బీట్ ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

 

పద్మశాలీల ఆశ్రితులు ఇంద్రజాల కళాకారులు సాధనా శూరులు

తెలంగాణలోని అరుదైన ఆశ్రిత కళారూపాల్లో సాధన శూరులు ఒకటి. వీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్న కళాకారుల నాల్గవ తరం వారు వచ్చి స్థిరపడ్డారు. అప్పటినుండి ఈ గ్రామంలోనే ఉంటూ, తమ తమ కట్టడి గ్రామాలకు ప్రదర్శన నిమిత్తం వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ 100 కుటుంబాలు, ఆరు ప్రదర్శనా బృందాలు ఉన్నాయి. ఇదే జిల్లాలోని ఎల్కతుర్తి మండలం, వల్లభాపూర్ గ్రామంలో కూడా ఒక బృందం ఉంది. అయితే వీరు కూడా పూర్వం చల్లూరు గ్రామంలోనే ఉండేవారని చెప్తారు. పూర్వం వీరు రాజమండ్రి లోని గుంటుపల్లి భాస్కర బ్రాహ్మణుని వద్ద తమ ముత్తాత చింతకింది లచ్చయ్య ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నాడని,అప్పటినుండి ఈ విద్యనే వృత్తి గా స్వీకరించి పద్మశాలీలను ఆశ్రయించి ప్రదర్శిస్తున్నామంటారు. ఆశ్రిత కళారూపాలలో ఒకే కులాన్ని మాత్రమే హక్కుగా ఆశ్రయించి, ప్రదర్శించే కళారూపాలు బీరప్పలు, విప్రవినోదులు, సాధనా శూరులు. సాధనా శూరులు ప్రదర్శించే విద్యలను ఇంద్రజాల విద్యలని, కనికట్టు విద్యలని అంటారు. ప్రదర్శనలో కళాకారులు కంటికి కనిపించే వస్తువును మాయం చేయడం దాని స్థానంలో మరొక వస్తువును సృష్టించడం, ప్రేక్షకులను ప్రదర్శనలో భాగం చేసి, వారితోనే ఆశ్చర్యం గొలిపే పనులు చేయిస్తూ, మాయలు మంత్రాలు ఉన్నట్టు భ్రమింప చేయడం వీరి ప్రత్యేకత. వీరి ప్రస్తావన శ్రీ హర్షిని రత్నావళి నాటకం, పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక వంటి ప్రాచీన కావ్యాల్లో కనిపిస్తుంది.
సాధనా శూరులు అనే పదానికి సాధన అంటే మల్ల విద్య అని, శూరుడు అనే పదానికి ధైర్యం కలవాడు, బలం కలవాడు, పరాక్రమము కలవాడు అని అర్థాలు ఉన్నాయి. నిజానికి వీరు ధైర్యం కలవారు. ఎందుకంటే పద్మశాలి కులాన్ని రక్షించడం కోసం ధైర్యంతో సాహసం చేసి వారిని హింసించిన రాజును సంహరించడంతో సాధన శూరులుగా పద్మశాలి వారితో పిలువ పడ్డారు. వీరు సాధనా శూరులు గా ఎట్లా అయ్యారనడానికి ఒక మౌఖిక కథను వినిపిస్తారు. పూర్వం శ్రీకృష్ణ గంధర్వ రాజు పొట్ల చెరువు ప్రాంతంలో 56 రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంటాడు. ఆ రాజు ఎవరి చేత మరణం లేకుండా ఉండేందుకు కాళికా దేవిని పూజించగా, ఆమె అందుకు ప్రతిఫలంగా ప్రతిరోజు ఒక మనిషికి కొత్త బట్ట కట్టించి అతని తల నరికి దానిపై కూర్చుండి 12 సంవత్సరాలు పూజ చేయాలనికోరుతుంది. రాజు అందుకు సమ్మతించి ,ప్రజలకు చెప్పకుండా రాజ్యంలోని పద్మశాలీలు ప్రతిరోజు కొత్తబట్టలు ఇవ్వాలని, మిగతా కులాల వారు ఇంటికి ఒకరిని చొప్పున ప్రతిరోజు కొలువు కు పంపియ్యాలని,చాటింపు వేయించి, ఆ ప్రకారంగా కొన్ని సంవత్సరాలు రాజు కాళికాదేవిని పూజిస్తాడు. ఇట్లా కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యంలో పద్మశాలి కులం తప్ప మిగతా కులాల వారు ఇంటికి ఒకరు చొప్పున రాజు కొలువుకు వెళ్ళటం జరుగుతుంది. రాజు తిరిగి మళ్ళీ ఇంటికి ఒకరిని పంపియ్యమని చాటింపు వేయడంతో మిగతా కులాల వారంతా ఏకమై ఈసారి మేమే కొత్తబట్టలు ఇస్తామని పద్మశాలి వారిని ఇంటికి ఒకరిని పంపమని కోరుతారు.ఆ రాజు అందుకు సమ్మతించి ఆ విధంగా చాటింపు వేయించగా, దానికి పద్మశాలీలు వ్యతిరేకించి ముందు మీరు తీసుకువెళ్లిన మనుషుల్ని ఏం చేస్తున్నారో చెప్పండని నిలదీయగా, వారందరినీ చెరసాలలో బంధిస్తాడు. అయితే పద్మశాలీలు 5 రోజులు చెరసాలలో స్నాన సంధ్యలు లేకుండాచెర శాలలో ఉన్నామని, పూజ చేసుకొని తిరిగి వస్తామని కాపలాదారున్ని నమ్మించి బయటకు వస్తారు. పద్మశాలీలు ప్రతి రోజు పూజ చేసుకునే మార్కండేయ గుడిలో ఏకమై, రాజు మన వంశాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నాడని,ఎలాగైనా రాజును సంహరించాలని నిర్ణయించుకుంటారు. ఆరాజు ఉండేది ఉక్కుకోట, మధ్యలో ఒంటి స్తంభం మేడ, ఆ మేడ చుట్టూ ముస్సానది. కాపలాగా కోట ముందు కాళికాదేవి ఉంటుందని,ఆ రాజు అర చేతిలో వుండే కత్తితో చంపితేనే చస్తాడని , అప్పుడే మన వంశం నిలుస్తుందని తీర్మానించుకుంటారు.
ఒక బంగారు పళ్లెంలో కత్తి పెట్టి ఆ రాజును సంహరించడానికి వచ్చేవారు ఆ కత్తిని ముట్టుకోవాలని కోరగా, పద్మశాలీల లోని గంజి, బండారి ,ఆడెపు, భీమనపల్లి , వంగరి ,చింతకింది ఇంటి పేరు గల వారు ముందుకు వస్తారు. వీరికి పెళ్లి లో మొదటి బొట్టు అని ,అంతేకాకుండా విజయం సాధించిన వారిని ప్రతి సంవత్సరం ఆయా గ్రామాలకు పిలిచి ఇంటింటికి రూపాయిపావల ,1016 ఇవ్వాలని ,56 దేశాల పద్మశాలీల ముందర తీర్మానం చేసుకుంటారు. వీరంతా కర్ర సాము కత్తి సాము సాధన చేయడమే గాక రాజు కోట చుట్టూ భూతాలు ప్రేతాలు కాళికాదేవి కాపలా ఉంటుంది కాబట్టి ,మంత్ర తంత్ర విద్యలు కూడా నేర్చుకోవాలని గొల్ల కేతమ్మ దగ్గర ఆ విద్యలన్నింటినీ నేర్చుకొని ఆమె మంత్రదండం కూడా తీసుకొని రాజును సంహరించడానికి బయలుదేరుతారు.ఆమె మంత్రదండంతో ముస్సా నది దాటి కోట చేరుకోగానే, కాళికాదేవి వీరిని అడ్డగించి నన్ను ప్రసన్నం చేసుకోవాలంటే మీరు మందు మాంసంముట్టాలని కోరుతుంది .ఆ ప్రకారంగా పద్మశాలీలు కాళికాదేవి చెప్పినట్టుగా నడుచుకొని ఒంటి స్తంభం మేడ మీద ఉన్న రాజును సంహరించి, వీరులుగా తిరిగి వస్తారు .పద్మశాలీలు ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం వీరిని గౌరవించాలి కాబట్టి మామూలుగా వెళ్లకుండా సాధన చేసిన విద్యలు గొల్ల కేతమ్మ కాళికాదేవి దగ్గర నేర్చుకున్న మంత్ర తంత్ర విద్యలను ప్రదర్శించి ప్రతిఫలం పొందటం మొదలుపెట్టారు.
ప్రదర్శనలో సాధనా శూరులు జలస్తంభన, వాయు స్తంభన, అగ్నిస్తంభన తో పాటుగా మరి కొన్ని విద్యలు ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల ముందు ప్రదర్శించేటప్పుడు కళాకారులు నాటకీయ ఫక్కీలో హాస్యం భయానకం వంటి అంశాలతో ప్రేక్షకులను ప్రదర్శనాద్యంతం రంజింప చేయడం వీరి ప్రత్యేకత. ప్రదర్శన ప్రారంభంలో కాళికాదేవి పూజచేసిన గురువు బృందం లోని సభ్యులందరికీ మంత్రించిన తావిత్తులు కడతాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకులను బంధించి ప్రదర్శన మొదలు పెడతారు. ప్రారంభంలో నగారాలు వాయిస్తుండగా మొదట బృందం సభ్యులు ఒక్కొక్కరుగా గురువు ఆదేశాన్ని బట్టి కర్రసాము ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో కళాకారులు నీటిని స్తంభింపచేసి తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఆ తర్వాత నియంత్రించుకుని ప్రదర్శనాంశానికి అనుకూలంగా మార్చుకుంటారు. దీనినే జలస్తంభన అంటారు. ఇందులో భాగంగా ముక్కు రంధ్రాలలోని ఒక రంధ్రం నుండి నీటిని పంపి మరొకరు రంధ్రం నుండి నీటిని బయటికి తీయడం, అలాగే నీటిలో పసుపు కుంకుమ కలిపి వాటిని యధావిధిగా బయటికి తీసి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తారు. అలాగే ప్రదర్శనలో కళాకారులు అగ్నిని స్తంభింపజేసి ప్రదర్శించే అంశాలు ప్రత్యేకమైనవి. ఇటు వంటి అంశాలలో కాగితం మరియు దారాన్ని కాల్చి మళ్లీ సృష్టించడం, మనిషి తల పై పొయ్యిపెట్టి పూరీలు చేయడం, అగ్గి లో కాల్చిన పారని చేతితో పట్టుకోవడం ప్రధానమైనవి.వీరు ప్రదర్శించే కీలకాంశాల్లో తల మీద పొయ్యిపెట్టి పూరీలు చేయడం, ఇందుకోసం ప్రేక్షకుల నుండి ఒక వ్యక్తిని పిలిచి అతని తలపై మట్టితో చేసిన పోయిన ఉంచి దాని మీద మూకుడు పెట్టి పూరీలు కాలుస్తారు. ఈ ప్రదర్శనాంలో ప్రేక్షకులకు కలిగే సందేహాలను గురువును అడుగుతూ నేను చేస్తానని, ప్రగల్భాలు పలుకుతూ హాస్యాన్ని పండిస్తూ రక్తి కట్టిస్తాడు.
సాధనా శూరులు నీటిని, అగ్నిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రదర్శించినట్లు గానే, గాలిని కూడా స్తంభింపచేసి, చిలక కట్టడం చొప్పల పల్లకిలో కూర్చుని ఊరేగడం వంటి అంశాలు ప్రదర్శిస్తారు. ఇందులో చిలుక కట్టుట ప్రదర్శనా ంశంలోమొదట గురువు ప్రదర్శించే అంశాన్ని ప్రేక్షకులకు వివరించిన తర్వాత బృందంలోని వ్యక్తి ఒకరు వెదురు కర్రను తీసుకువచ్చి భూమిపై నిలబెట్టి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఒకరు చెక్కతో చేసిన చిలుక బొమ్మను తీసుకువచ్చి దాని నడుము భాగాన్ని కర్రపై ఉంచి కదలకుండా పట్టుకుంటాడు. అప్పుడు ఒక కావిడి బద్ద ను తీసుకువచ్చి దానికి రెండు వైపులా బరువులు వేసి ఆ కావడిని చిలక పై భాగంలో ఉంచుతారు. గురువు చిలుక పై మంత్రించిన నీళ్లు చల్లి వేదం తో మూడు సార్లు మంత్రించి కర్రపై చిలుకను పట్టుకున్న వ్యక్తిని వదిలి వేయ మంటాడు. అప్పుడు ఏ ఆధారం లేకుండా చిలుక ఒక కర్రను ఆధారం చేసుకొని ,బరువుగల కావడిని మోస్తుంది. ఈ రకంగా గురువు చిలక ముక్కు మీద అట్లాగే చిలక తోకను మాత్రమే కర్రకు ఆనించి కావడిని మోపించటం ప్రేక్షకులు మంత్రమో తంత్రమో తెలియక సాధనా శూరుల మాయ అంటూ ఆశ్చర్యానికి లోనవుతారు. వీరు ప్రదర్శించే విద్యల్లో చొప్పల పల్ల కి చాలా ప్రత్యేకమైంది. చాలా సున్నితంగా ఉండే చొెప్పబెండ్లతోకూర్చునేలా పల్లకి తయారు చేసుకొని, దాని మీద గురువు కూర్చుండగా బృందం సభ్యులు ప్రేక్షకుల మధ్యలో తిప్పుతారు. అలా తిరుగుతున్నపుడు హాస్యగాడు తనదైన శైలిలో హాస్యం పండిస్తూ ఉంటాడు. అలాగే ప్రదర్శనలో భాగంగా ఛాతీపై బండను పెట్టుకొని పగలగొట్టించుకోవడం, కరెంటు బుగ్గల ను నోట్లో వేసుకొని నమలడం, మాయ బొమ్మకు చేసిన అలంకరణ గుడారంలో కట్టేసిన వ్యక్తి కి కనిపించడం వంటి విద్యలను అదృశ్యకరణ విద్యలని ప్రదర్శిస్తారు. అంతేకాకుండా వీరు ప్రదర్శించే విద్యలో అద్భుతం గా చెప్పుకునే ది గుడారంలో ఒక స్తంభానికి కట్టేసిన వ్యక్తి మిగతా స్తంభాలకు మారటం, ఈ అంశాన్ని ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకులే వ్యక్తికి బేడీలు వేసి చేతులకు కాళ్ళకు కట్లుకట్టి ఆ తర్వాత అతన్ని గుడారంలో గుంజకు కూడా విప్పు కోవడానికి వీలు లేకుండా కడతారు. అయినప్పటికీ వ్యక్తి గుడారంలో ఏ గుంజకు మారమంటే ఆ గుంజకు మారటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మరొక అద్భుతమైన అంశం గుడారంలోకి వెళ్లిన వ్యక్తి వికృత రూపంలో బయటికి రావడం, గురువు బృందంలోని సభ్యులు ప్రేక్షకులు చూస్తుండగానే గుడారంలోకి మామూలుగా పంపించి పరదాకప్పేస్తాడు .ఆ తర్వాత తన చేతిలో ఉన్న వేదం చే మంత్రించి కాళికాదేవి ని తలచుకొని వేపాకు గుడారం పై చల్లి గుడారం మీది పరదా తీయ మంటాడు. అప్పుడు గుడారంలోకి వెళ్లిన వ్యక్తి మాయమై ప్రేక్షకుల మధ్యలో వికృత రూపంలో ప్రత్యక్ష మై, అందర్నీ చెల్లా చెదురు చేస్తూ భయాన్ని కలిగిస్తాడు. అలాగే మరొక అద్భుత అంశం లో దేవతల విగ్రహాలను సృష్టించడం, గురువు ముందుగా ఒక వ్యక్తిని గుడారంలోకి పంపి గుడారం పరదా కప్పేస్తాడు. ఆ తరువాత గురువు బయటనుండి రాళ్లను పసుపు బియ్యాన్ని మంత్రించి గుడారంలోకి పంపగా, రాళ్లన్నీ దేవతల విగ్రహాలు గాను, పసుపు బియ్యం పులిహోర గాను మారుతుంది. ఇవే కాకుండా గాలిలో నిమ్మకాయలు ఎగురవేసి కత్తితో ముక్కలు చేయడం, కడుపు మీద జిల్లేడు ఆకులు వేసుకుని ముక్కలు చేయడం, బండికి కత్తి కట్టి తలతో నెట్టటం, రేకుపళ్ళాలు గాల్లో ఎగిరి కొట్టుకోవడం మొదలైన అంశాలను ప్రేక్షకులను అలరిస్తూ, హాస్యాన్ని జోడించి ప్రదర్శిస్తారు. ఈ కళారూపంలో ని కనికట్టు విద్యలు ప్రదర్శించడానికి కళాకారులు 10 నుండి 12 మంది వరకు ఉంటారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కనికట్టు విద్యలో నైపుణ్యం కలిగినవారు. ప్రదర్శన మొత్తం రక్తికట్టించడానికి ఒకరు గురువు మరొకరు హాస్యగాడు ప్రముఖ పాత్ర వహిస్తారు. ప్రదర్శనమొత్తం గురువు ఆధీనంలోనే జరుగుతుంది. ఇతనికి ప్రదర్శన అనుభవంతో పాటు కనికట్టు విద్యలు సంపూర్ణంగా తెలిసి ఉంటాయి. బృందంలోని ఇతర సభ్యులు ప్రదర్శనలో తప్పు చేస్తే రహస్య భాషా పదాలను ఉపయోగిస్తూ ప్రదర్శన కు అంతరాయం కలగకుండా ప్రయత్నిస్తాడు. వీరు ఉపయోగించే రహస్య భాషా పదాలలో ఉదాహరణకు పచ్చ-పసుపు, ‘మిల్క్ పెట్టె-’ అగ్గిపెట్టె, పాండ్యాలు-నీళ్లు, మస్కాలు- విగ్రహాలు, పొల్లు-ఇటుక పొడి, దారుకం-దారం, పత్రులు-రాళ్లు, మొకిరలు పూరీలు తైరు- నూనె, సోర్ -అన్నం, పచ్చ-తావిత్తు, పొంత- పొయ్యి,మీటకం-సంభావన, తెల్లోడు -సుద్ధ మొదలైన పదాలను ఉపయోగిస్తూ ఒకరికొకరు ప్రదర్శనలో సహక రించుచుకుంటూ ప్రదర్శిస్తారు.
ప్రదర్శనలో గురువు తర్వాత ప్రదర్శనను రక్తికట్టించడంలో, ప్రేక్షకులను ఆనందింప చేయడంలో, సిద్ధహస్తుడు హాస్యగాడు. ఇతని వేషధారణ హావభావాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేగాకుండా ప్రేక్షకులకు కలిగే సందేహాలను తీరుస్తూ, అవసరమైతే గురువు చేత దెబ్బలు తింటూ నటిస్తాడు. ప్రదర్శనలో పూర్తి స్వేచ్ఛతో బృందం సభ్యులను గురువును అవసరమైతే ప్రేక్షకులను కూడా సమాజంలోని సంఘటనలను గుర్తు చేస్తూ తిట్టడం లేదా పొగడటం ఇతని నైజం. కళాకారులు ప్రదర్శనాద్యంతం రక్తి కట్టించడం లో రెండు నగారాలను వాయిస్తూ బృందం సభ్యులకు ,ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగిస్తారు. వీరు చేతిలో అధర్వణ వేదం పట్టుకొని దీన్నే మంత్రదండం అంటారు. దీనితో మాయమంత్రాలు ఉన్నట్టు భ్రమింపచేస్తారు కానీ మాయలు మంత్రాలు లేవని చెట్ల క్రియలు ఉన్నాయి కాబట్టే ఇంద్రజాల విద్యలు చేయగలుగుతున్నామని అంటారు .అందుకే గ్రామాల్లో విద్యలు ప్రదర్శించే సందర్భంలో ఆ గ్రామంలో మంత్రగాళ్ళు ఉంటే మేం చేసే విద్య లకు అంతరాయం కలిగించమని ధైర్యంగా సవాలు విసురుతూ ఉంటారు.
ఒక గ్రామంలో ఒకానొక సందర్భంలో కళాకారుడు ఒకరు సాయంత్రం మంత్రగా నిగా చెప్పుకునే ఒకరి ఇంటికి వెళ్లి ,చుట్ట అంటించుకోవడానికి నిప్పు కావాలంటే, అతను తువ్వాలలోతెచ్చి ఇచ్చాడట, దాన్ని అతను చేతిలో పట్టుకొని చుట్ట అంటించుకు న్నాడట, అప్పుడు ఆ మంత్ర గాడు కళాకారుని గొప్పతనం చూసి నా కంటే గొప్పవాడని రూ.1016 ఇచ్చి కాళ్ళు కూడా మొక్కాడట, ఈ రకంగా గ్రామంలో వీరిని చూసి మంత్రగాళ్ళుగా చెప్పుకునే వారు కూడా భయపడతారంటారు. కళాకారులు ఆధునిక మెజిషియన్స్ కి దీటుగా, నేటి కాలంలో కూడా సంప్రదాయ పద్ధతిలో, నాటకీయ ఫక్కీలో పద్మశాలిని ఆశ్రయించి ప్రదర్శించినప్పటికీ, ఆ గ్రామంలోని ఇతర కులాలన్నింటినీ తమ ప్రదర్శనతో కట్టిపడేసి అలరిస్తారు. తరతరాలుగా సంక్రమించిన తమ కళ, కలగా కాలగర్భం లో కలిసిపో కూడదని నేటి ఆధునిక కాలంలో కూడా ప్రేక్షకులను రంజింప చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదర ణ లేదని, పింఛన్ కల్పించలేదని వాపోతున్నారు. అయినప్పటికీ తమ కళను ఆదరిస్తున్న పద్మ శాలీల దగ్గర ఆత్మగౌరవం తో ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తు న్న కళాకారులు నిజంగా సాధనా శూరులే.

 

 డా.బాసని సురేష్

Article about Padmashali magics