Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ముచ్చటగా మూడోసారి

paes-and-hingisయుఎస్ ఓపెన్ టైటిల్ పేస్-హింగిస్ సొంతం
న్యూయార్క్ : అనుభవాజ్ఞుడు లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ మహిళా టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్ జత ఈ సీజన్‌లో మరో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అనుభవానికి తోడు అదిరిపోయే ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇండో-స్విస్ జోడీ భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున జరిగిన ఫైనల్లో అమెరికా జంట సామ్ క్వారీ-బెథానీ మాటెక్ సాండ్స్‌ను మట్టికరిపించి ఈ సీజన్‌లో ముచ్చటగా మూడో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాల్గో సీడ్‌గా టోర్నీని ఆరంభించిన పేస్-హింగిస్ జోడీ తుది పోరులో 6-4, 3-6, 10-7తో సామ్‌క్వారీ-బెథానీ మాటెక్‌పై శ్రమించి నెగ్గింది.

మ్యాచ్‌ను ఫేవరెట్ జోడీగా ప్రారంభించిన పేస్-హింగిస్ జోడీ తొలిసెట్ ఆరంభంలోనే బెథానీ సాండ్స్ సర్వీస్‌ను లవ్(40-0)తో బ్రేక్ చేసి 2-1తో నిలిచింది. ఇక ఐదోగేమ్‌లో బ్రేక్ పాయింట్ కాపాడుకొని గేమ్‌ను సొంతం చేసుకున్న అమెరికా జంట ఇండో-స్విస్ జోడీ ఆధిక్యాన్ని 2-3కు తగ్గించినా.. తరువాత పేస్ మంచి ప్లేస్‌మెంట్ షాట్లు ఆడడంతో 5-4తో సెట్ కైవసానికి దగ్గరయ్యారు. ఇక పదోగేమ్‌లో సర్వీస్ చేసిన హింగిస్ అద్భుత వ్యాలీతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంతో తొలిసెట్ పేస్-హింగిస్ సొంతమైంది. అయితే రెండోసెట్‌లో ఇండో-స్విస్ జోడీకి అమెరికా జంటతో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలోనే బెథానీ మాటెక్ వరుసగా రెండు విన్నర్స్ కొట్టి హింగిస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో అమెరికా జంట 3-1తో నిలిచింది.

ఇక అదే జోరును కొనసాగించిన క్వారీ-బెథానీ జంట సెట్‌ను 6-3తో నెగ్గడంతో మ్యాచ్ సూపర్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇక్కడా మొదట్లోనే హింగిస్ సర్వీస్‌లో రెండు పాయింట్లు సాధించిన అమెరికా జంట 4-1తో నిలిచి పేస్-హింగిస్ జోడీకి షాకిచ్చేలా కనిపించింది. అయితే తమ అనుభవాన్ని రంగరించిన నాల్గోసీడ్ జోడీ తమ సర్వీస్ పాయింట్లను కాపాడుకుంటూనే ప్రత్యర్థి జంట సర్వీస్‌లో పాయింట్ల సాధించి స్కోరుబోర్డును 7-7తో సమం చేసింది. అదే దూకుడుతో ఓవర్‌హెడ్ విన్నర్ కొట్టిన పేస్-హింగిస్ జోడీ సూపర్ టైబ్రేక్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

పేస్ జోడీకి రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ : యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన వెటరన్ జోడీ లియాండర్ పేస్-మార్టి నా హింగిస్‌కు భారత ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అభినంద నలు తెలిపారు. ‘మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన పేస్, హింగిస్‌లకు హృదయపూర్వక శుభా కాంక్షలు’ అంటూ ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్లో పేర్కొనగా, ‘గొప్ప విజయం సాధించిన పేస్, హింగిస్‌కు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడారు. మీ విజయానికి మేము పరవశించిపోయాం’ అని మోడీ ట్వీట్ చేశాడు.

Comments

comments