Home ఎడిటోరియల్ సంపాదకీయం: పాకిస్థాన్ కవ్వింపు చర్య

సంపాదకీయం: పాకిస్థాన్ కవ్వింపు చర్య

Sampadakeeyam-Logoబలూచిస్థాన్‌లో గూఢచారి కార్యకలాపాలకు, విద్రోహ చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై భారత నావికాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించటంతో, అసలే అస్తుబిస్తుగా ఉన్న భారత్-పాక్ సంబంధాలు అథమస్థాయికి దిగజారాయి. భారతప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు పాక్ చర్యను ఖండించాయి. జాదవ్ ప్రాణాన్ని కాపాడేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవలసిందిగా ప్రధానమంత్రిని కోరాయి. మిలటరీ కోర్టుల పునరుద్ధరణపై పాకిస్థాన్‌లో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాదవ్‌కు మరణశిక్ష విధించారు. మిలటరీ కోర్టులంటేనే రహస్య విచారణ. దాని శిక్షలపై అప్పీలుకు అవకాశం లేదు. అయితే దేశంలో తీవ్రమైన చర్చ తదుపరి సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలుకల్పించే నిబంధన పొందుపరిచారు. జాదవ్ విడుదల సాధించేందుకు దౌత్యకృషితోపాటు ఈ నిబంధనను భారత్ వినియో గించుకోవాలి.

జాదవ్ శిక్షను వెంటనే అమలు చేయబోవటం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించటం వెసులుబాటు కల్పిస్తున్నది. పాక్ మిలటరీ కోర్టు నిర్ణయం పట్ల ఆరంభ స్పందన తీవ్రంగా ఉండటం సహజం. జాదవ్‌ను విడుదల చేయకపోతే భారత్-పాక్ సంబంధాల్లో తీవ్ర పర్యవసానాలుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారంనాడు లోక్‌సభలో హెచ్చరించారు. వివిధ నగారాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. అయితే కయ్యానికి కాలుదువ్వే ప్రసంగాలు, ప్రకటనల వల్ల ప్రయోజనం లేదు. ప్రజల మనోభావాలను సంతృప్తి పరచటంకోసం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గంభీర ప్రకటనలు చేసినా, ప్రభుత్వపరంగా ఇప్పుడు కావలసింది సంయమనం, జాదవ్ విడుదల సాధించేందుకు దౌత్యకృషి. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకోవా లన్న కొన్ని సూచనలు గర్హనీయం. భారత్-పాక్ సమస్యలు ద్వైపాక్షిక మైనవని, ఇరుపక్షాల మధ్య చర్చలే పరిష్కార మార్గమన్నది భారత్ ప్రకటిత విధానం. కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ ఉబలాటం ఇటీవల వ్యక్తమైంది. అమెరికా జోక్యాన్ని (మధ్యవర్తిత్వాన్ని)పాకిస్థాన్, కశ్మీరీ వేర్పాటు వాదులు కోరుకుంటున్నారు. ఆ విధంగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయటం వారి ఉద్దేశం. మూడవపక్షం జోక్యానికి స్థానంలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయటం హర్షణీయం.

కులభూషణ్ జాదవ్‌ను ఇరాన్‌లోని చాబహార్ రేవునుంచి పాక్ సైనికులు కిడ్నాప్ చేశారు. భారత నావికాదళంలో మాజీ అధికారి అయిన జాదవ్‌ను సర్వీసులో ఉన్న అధికారిగా చిత్రించిన పాకిస్థాన్, భారత రీసెర్చి అండ్ ఎనాలసిస్ విభాగం (‘రా’) పంపిందని ఆరోపిస్తున్నది. జాదవ్ భారత నౌకాదళంలో పనిచేశాడని, ప్రభుత్వంతో అతనికెట్టి సంబంధం లేదని భారతప్రభుత్వం స్పష్టం చేసింది.

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఏజంట్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ మహమ్మద్ హబీబ్ ఏప్రిల్ 6 న భారత సరిహద్దు సమీపంలోని నేపాలీ పుణ్యక్షేత్రం లుంబిని నుంచి అదృశ్యం కావటానికీ, కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించటానికీ మధ్య సంబంధం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ నుంచి జాదవ్ కిడ్నాప్‌లో హబీబ్ పాత్ర ఉన్నట్లు కొన్ని పత్రికలు ప్రచురించాయి. ఉద్యోగం ఆశచూపి అతన్ని నేపాల్ రప్పించారని, అతని అదృశ్యం ‘రా’ పని అని పాకిస్థాన్ మీడియా భావిస్తున్నది.

అదే వాస్తవమైతే ఇరువురిని పరస్పరం మార్చుకునేందుకు తెరచాటు దౌత్యం ద్వారా ప్రయత్నించాలి. జాదవ్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవటానికి 60 రోజులు వ్యవధి ఉందని పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ వారి పార్లమెంటులో చెప్పటం, రెండు ఇరుగుపొరుగు దేశాలు శాశ్వతంగా శత్రువులుగా ఉండజాలవు, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాన్‌జుయ అనటం జాదవ్ విడుదల విషయంలో చర్చలకు అవకాశమిస్తున్నది. భారత్-పాకిస్థాన్‌లు రెండూ పునరాలోచించాలి. నిలిచిపోయిన సమ్మిశ్ర చర్చలను పునరుద్ధరించుకోవాలి.అదొక్కటే మార్గం.