Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రవాదుల స్వర్గధామం పాక్

ఉగ్రవాదుల స్వర్గధామం పాక్

  • పాక్ వైఖరిని ఎండగట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ఆఫ్ఘన్‌లో మరింతగా భారత్ ప్రమేయానికి పిలుపు
  • దక్షిణాసియా పట్ల వ్యూహంలో అగ్రదేశం మార్పులు

Trump-Afghanistan

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాసియాపట్ల తన నూతన వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం నాడు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. టెర్రరిస్టుల ఆశ్రమంగా ఆ దేశాన్ని ఆయన కఠిన పదజాలంతో తప్పుపట్టారు. అది అరాచకాన్ని సృష్టించే శక్తుల స్వర్గధామంగా మారిందని, టెర్రరిస్టులను తరిమేయడానికి పాకిస్థాన్ ఎంతో చేయవలసి ఉందని ట్రంప్ అన్నా రు. దేశాన్ని ఉద్దేశించి కమాండర్ ఇన్ చీఫ్‌గా ట్రంప్ తొలి టివి ప్రసంగం చేస్తూ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టెర్రర్ గ్రూపులకు ఆ దేశం ఆశ్రయమిస్తోందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ దేశం పాకిస్థాన్‌కు వందల బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందిస్తుంటే, మరోపక్క ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కొనసాగిస్తోందని ట్రంప్ విమర్శించారు. గతంలో పాకిస్థాన్ తమ విలువైన భాగస్వామిగా ఉందని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా తమ సైన్యాలు కలిసి కృషి చేశాయని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు టెర్రరిజం వల్ల పాక్ ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పారు. అందుచేత టెర్రర్ గ్రూపుల నిలయంగా మారవద్దని పాక్‌కు సూచించారు. అరాచకం, హింస, ఉగ్రవాదం రెచ్చగొట్టే శక్తులకు స్వర్గధామంగా పాక్ మారిందని ఆయన అన్నారు. భారత్, పాకిస్థాన్‌లు రెండు అణ్వాయుధ సంపన్న దేశాలు కావడంతో వాటి మధ్య గల వైషమ్యాలు పెద్ద సంఘర్షణగా మారే ప్రమాదం ఏర్పడిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సమగ్ర సమీక్ష తర్వాత ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాసియాపట్ల అనుసరిస్తున్న వ్యూహంలో పెనుమార్పులకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా కీలక ప్రయోజనాలకు సంబంధించి మూడు ప్రాథమిక నిర్దారణలకు వచ్చామని తెలిపారు. మొదటిది ఆ వ్యూహం గౌరవ ప్రదమైన, నిలకడగల ఫలితాలను అందించాలని, ఈ సరికే ఎన్నో త్యాగాలకు ఓర్చి అనుసరించిన వ్యూహం అదని ఆయన చెప్పారు. రెండోది వేగంగా ఆఫ్ఘనిస్థాన్‌నుంచి వైదొలగడం మంచిది కాదని, ఆమోదయోగ్యం కాదని కూడా అన్నారు. అమిత వేగంతో సంకీర్ణ సేనలను పూర్తిగా ఉపసంహరిస్తే ఆ ఖాళీలోకి ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదా తక్షణమే దూరిపోతాయన్నారు. అమెరికాపై అల్‌ఖైదా భీకర టెర్రరిస్టు దాడి (9/11) కి ముందు అటువంటి ఖాళీ ఏర్పడిందని ఆయన వివరించారు. మూడవది కొత్త వ్యూహంలో నూతన స్తంభం పాకిస్థాన్ పట్ల అమెరికా వైఖరి మారడంగా ఆయన వివరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం కొనసాగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్‌ను కఠిన పదజాలంతో హెచ్చరించారు. ఈ సమస్యపట్ల తాము ఇక మౌనంగా ఉండజాలమని హెచ్చరించారు. తాలిబన్, ఇతర గ్రూపుల టెర్రరిస్టులకు పాకిస్థాన్ మెరుగైన ఆశ్రయం కల్పిస్తోందని నొక్కి చెప్పారు.
భారత్‌కు అమెరికా మరింత చేరువ
ఈ సందర్భంగా భారతదేశంతో మరింత సాన్నిహిత్యాన్ని ట్రంప్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రతిజ్ఞ గైకొన్నారు. యుద్ధంతో చిన్నాభిన్నమైన ఆఫ్ఘనిస్థాన్‌కు మరింతగా సహాయం అందించాలని భారత్‌ను కోరారు. భారత దేశంతో కీలక రక్షణ భాగస్వామ్యం పెంపు దక్షిణాసియాపట్ల తాము మార్చుకోనున్న వ్యూహంలో ముఖ్యమైనది వివరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి భారత్ మరింతగా ఆర్థికపరమైన ప్రమేయం కూడా కల్పించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ తమ కీలక ఆర్థిక, భద్రతా భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో సుస్థిరత కోసం భారత్ కృషిని ప్రశంసించారు. తమతో వేలాది కోట్ల డాలర్ల వాణిజ్యం నెరపుతున్న భారత దేశం ఆఫ్ఘనిస్థాన్‌పట్ల తమకు మరింతగా సహాయపడాలని కోరుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను సాధించడమే లక్షంగా భారత్‌తో కలిసి కృషి చేస్తున్నట్లు చెప్పారు.