Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్ ఔట్

షరీఫ్ ఔట్

అవినీతి కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చి, అనర్హత వేటేసిన సుప్రీంకోర్టు 

ప్రధాని పదవికి రాజీనామా
పనామా పత్రాల ఆధారంగా ఇమ్రాన్‌ఖాన్ వేసిన కేసులో తీర్పు
నవాజ్‌పైనా, ఆయన కుమారులు, కుమార్తెపైనా క్రిమినల్ కేసుల దాఖలుకు ఆదేశాలు
ఆర్థికమంత్రి ఇషాఖ్ దార్ మీదా అనర్హత వేటు

nawaz-sharifఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం అనర్హత వేటు వేసింది. వంచనకు పాల్పడ్డ ఆయన పదవిలో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి, షరీఫ్‌ను దోషిగా నిర్థారించడంతో పాటు ఆయనపై, ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పనామా పత్రాలపై షరీఫ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్, ఇతర కొన్ని పార్టీలు వేసిన పిటిషన్ల విచారణ క్రమంలో తీర్పు వెలువడింది. 67 సంవత్సరాల నవాజ్ షరీఫ్ ప్రధాని పదవీకాలం అర్థాంతరంగా నే ముగియడం ఇది మూడోసారి. దేశంలో ఆర్థిక గడ్డుపరిస్థితి, మరో వైపు తీవ్రవాదం ముదిరిన దశలోనే చాలా కాలంగా అంతా ఎదురుచూస్తున్న పనామా కేసు తీర్పు వెలువడింది. దీనితో దేశంలో మరోసారి రాజకీయ సంక్షోభం కమ్ముకుంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును సుప్రీంకోర్టులో జనంతో కిక్కిరిసి ఉన్న గదిలో న్యాయమూర్తి ఇజాజ్ అఫ్జల్ ఖాన్ చదివి విన్పించడంతో షరీఫ్ రాజకీయాధికార భవితవ్యం చెల్లాచెదురైంది. తీర్పు వెలువడగానే కోర్టు వెలుపల గుమికూడి ఉన్న ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వపు ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. నవాజ్ గద్దెదిగు, వెళ్లిపో అంటూ నినాదాలు చేశారు.
ఆర్థిక మంత్రిపై కూడా అనర్హత వేటు : షరీఫ్‌తో పాటు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్, షరీఫ్ అల్లుడు, జాతీయ అసెంబ్లీ సభ్యుడు క్యాప్టెన్ ముహమ్మద్ సఫ్దర్‌పై కూడా అనర్హత వేటు ప్రకటించారు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని 62, 63వ అధికరణ పరిధిలో షరీఫ్‌ను న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించింది. పార్లమెంట్ సభ్యులు నిజాయితీ, నిష్కళంకంతో ఉండాలని రాజ్యాంగ నిబంధన స్పష్టం చేస్తోంది. దీనికి ప్రతిగా వ్యవహరించినట్లు నిర్థారణ అయినందున ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడైనందున, ప్రధాని పదలో కొనసాగడానికి వీల్లేదని ప్రకటిస్తున్నట్లు జస్టిస్ ఖాన్ తెలిపారు. షరీఫ్‌ను ప్రజా సంబంధిత పదవుల నుంచి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాను గతంలో ఏ తప్పూ చేయలేదని షరీఫ్ అధికారికంగా ప్రకటించిన విషయం తప్పని తేలిందని,రాజ్యాంగ పరిధిలో కీలక పదవిలో ఉన్నవారు తప్పుడు ప్రకటన చేయడానికి వీల్లేదని న్యాయస్థానం తెలిపింది. తీర్పు తరువాత అధికారిక పాకిస్థానీ ముస్లిమ్స్ లీగ్ నవాజ్ (పిఎంఎల్ -ఎన్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ షరీఫ్ పదవి నుంచి వైదొలిగినట్లు తెలిపారు. పనామా కేసు విచారణ వివిధ దశల సందర్భంగా పార్టీ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే ఎగువ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. షరీఫ్‌తో పాటు ఆయన కుమారులు హుస్సేన్, హస్సన్, కూతురు మర్యంపై కూడా అవినీతి కేసులు దాఖలు చేయాలని జాతీయ జవాబుదారి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాలలో కేసులు నమోదు చేసి, ఆరు నెలల్లో వాటిపై విచారణ ముగించాలని స్పష్టం చేశారు. పనామా గేట్ కుంభకోణంలో షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. 199౦ ప్రాంతంలో షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారని, వివిధ కంపెనీలను అడ్డుపెట్టుకుని లండన్‌లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో గతవారంలో రోజువారీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టి, ఇప్పుడు వెలువరించింది.
తీర్పు అభినందనీయం : ఇమ్రాన్ ఖాన్
అవినీతి వ్యవహారాన్ని ఎండగట్టడంలో తనతో పాటు కలిసివచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. సమైక్య పోరుతోనే అవినీతి నేతల పనిపట్టగలిగినట్లు తెలిపారు. పాకిస్థాన్‌లో తొలిసారిగా ఓ శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి, అనర్హత వేటు వేసిందని , ఈ తీర్పుతో ప్రజలకు వ్యవస్థ పట్ల నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. దేశంలో గాడ్‌ఫాదర్ పాలన ముగిసిందని ట్వీట్ చేశారు. ఇది దేశం మంచికే అన్నారు. దుబయ్‌లో వైద్య పరీక్షల కోసం ఉంటున్న మాజీ అధ్యక్షులు పర్వెజ్ ముషారఫ్ స్పందిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో జాతియావత్తూను అభినందిస్తున్నట్లు ప్రకటన వెలువరించారు. ఇది మంచి తీర్పు అన్నారు.
ఎన్నికైన ప్రధానిని ఇంటికి పంపించారు
ప్రజలు ఎన్నుకున్న మరో ప్రధానిని ఈ విధంగా బలవంతంగా ఇంటికి పంపించారని షరీఫ్ కూతురు మర్యం నవాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిపై అనర్హత వేటు పడినంతనే ఆయన ప్రజాజీవిత ఘట్టం ముగియలేదని, ఈ తీర్పు ఆయన తిరిగి ప్రజాజీవితంలోకి రాకుండా అడ్డుకోజాలదని స్పష్టం చేశారు. నవాజ్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రహ్మండమైన మెజార్టీతో గెలుస్తారని , ఆయనను ఎవరూ ఆపలేరని , ఎవరికైనా ధైర్యముంటే ఆపండని సవాలు విసిరారు. 43 సంవత్సరాల మర్యం నవాజ్‌కు రాజకీయ వారసురాలిగా ప్రచారం జరుగుతోంది.
తమ్ముడు షెబాజ్ పాక్ ప్రధాని?
పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా షెబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. అనర్హతతో పదవీ చ్యుతుడు అయిన షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంత ముఖ్యమంత్రి అయిన షెబాజ్‌ను తదుపరి నేతగా ఎంపిక చేసే వీలుందని అధికార పిఎంఎల్‌ఎన్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన అలుపెరగని కార్యకర్తగా పనిచేస్తారని, సోదరుడు షరీఫ్‌కు విధేయుడని, సమర్థుడైన పాలనాదక్షుడిగా పేరుతెచ్చుకున్నారని పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే జాతీయ అసెంబ్లీలో ఆయన ఇప్పుడు సభ్యుడు కానందున వెంటనే కీలక పదవిని అప్పగించేందుకు వీల్లేదని, ముందుగా పార్లమెంట్‌కు ఎన్నిక కావాల్సి ఉందన్నారు. అయితే ముందుగా ప్రధానిగా ఎన్నుకుని తరువాత సభ్యుడిగా పంపించేందుకు కూడా వీలుందని తెలిపారు.