Home అంతర్జాతీయ వార్తలు పాక్‌కు చైనా అత్యాధునిక యుద్ధనౌకలు

పాక్‌కు చైనా అత్యాధునిక యుద్ధనౌకలు

నాలుగింటి కోసం పాక్ ఆర్డర్ నిర్మాణంలో మొదటి పోరాట నౌక

Pakistan -China

బీజింగ్ : తన ఆప్త మిత్రుడు పాకిస్థాన్ కోసం చైనా అత్యంతాధునిక యుద్ధనౌకను రూపొందిస్తోంది. రెండు దేశాలమధ్య భారీ ద్వైపాక్షిక ఆయుధ ఒప్పందం ప్రకారం చైనా పాక్‌కు నాలుగు యుద్ధ నౌకల్ని అందించాలి. అందులో భాగంగా మొదటి నౌకను నిర్మిస్తోంది. హిందూ మహాసముద్రంలో అధికార సమతుల్యత కోసం చైనా, పాకిస్థాన్ ఈ ఆయుధ ఒప్పందం చేసుకున్నాయని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఆధునికమైన డిటెక్షన్, ఆయుధ వ్యవస్థలతో కూడిన ఈ యుద్ధ నౌకల్లో యంత్రాలు సముద్ర ఉపరితలంపై నౌకాదాడులు, సముద్ర గర్భం, ఆకాశంలో జరిగే దాడుల్ని ప్రతిఘటించే సామర్థం కలవి…అని చైనా ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ (సిఎస్‌ఎస్‌సి) పేర్కొంది. పాకిస్థాన్ కోసం నిర్మించబోయే ఈ యుద్ధ నౌక…చైనా ఇప్పుడు వినియోగిస్తున్న అత్యంత ఆధునిక క్షిపణి వ్యవస్థ తరహాలో నిర్మిస్తారు.

ఇది ఏ తరహా యుద్ధ నౌక అనే విషయం సిఎస్‌ఎస్‌సి పేర్కొనలేదు. కానీ, షాంఘైలోని హుడాంగ్- జోంఘువా షిప్‌యార్డ్‌లో దీన్ని నిర్మిస్తున్నారని తెలిపింది. పాకిస్థాన్‌కు అన్నివిధాలా మద్దతు ఇస్తు న్న చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేస్తూ పాక్ ఆయుధ వ్యవస్థ పటిష్టం చేస్తోంది. అంతేకాక, రెండు దేశాలూ కలిసి జెఎఫ్-తండర్ అని సింగిల్ ఇంజన్ మల్టీ రోల్ యుద్ధ విమానాన్ని కూడా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు చైనా అందించే యుద్ధనౌక టైప్ 054ఎపి తరగతికి చెందింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) నౌకాదళం ఉపయోగిస్తున్న టైప్ 054ఎ ఆధారంగా ఈ యుద్ధ నౌకను నిర్మిస్తున్నారని పాకిస్థాన్ నేవీని పేర్కొంటూ చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇలాంటి నాలుగు యుద్ధ నౌకల్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా చైనాకు ఆర్డర్ ఇచ్చామని పాకిస్థానీ నేవీ ఇంతకు ముందు తెలిపింది.