Home జాతీయ వార్తలు పంజాబ్‌లో ఓటు వేసిన పాక్ మహిళ

పంజాబ్‌లో ఓటు వేసిన పాక్ మహిళ

Pak-Woman

చండీగఢ్: పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన తాహిరా మఖ్బూల్ అనే మహిళ శనివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. పాక్‌లో నాన్ ఇస్లామిక్‌గా ముద్రపడ్డ అహ్మదీయ ముస్లిం వర్గానికి చెందిన తాహిరా(35), 2003 వరకు పాక్‌లోనే నివసించింది. పాక్, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన తాహిరా 2003 డిసెంబర్ 7న ఖైదాన్‌కు చెందిన చౌధురి మక్బూల్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం తాహిరాకు భారత పౌరసత్వం రావడంతో ఖైదాన్ నియోజకవర్గంలో ఓటు వేసింది.

ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయడంతో తన జీవితానికి ఈద్ పండగ వచ్చినట్టుందని.. భారత పౌరురాలిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనడం నాకెంతో గర్వకారణంగా ఉందని చెప్పింది. తనకు 22 ఏళ్లు వచ్చే వరకూ పాక్‌లోనే ఉన్నా ఒక్కసారి కూడా తనకు ఓటు వేసే అవకాశం రాలేదని ఆమె వాపోయింది. తాను ఓటు వేసిన ప్రాంతంలోనే మరో 12 మంది పాక్ మహిళలు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారని వారికి కూడా పౌరసత్వం కల్పించాలని కోరింది. తన 35 సంవత్సరాల జీవితంలో తొలిసారి ఓటు వేశానని ఆ మహిళ తెగ సంబరపడిపోయింది.