Home తాజా వార్తలు టీమిండియాపై పాక్ ప్రశంసలు

టీమిండియాపై పాక్ ప్రశంసలు

Team Indiaకరాచీ: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజ యం సాధించిన టీమిండియాను దాయాది పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కోహ్లి సేన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సయితం భారత జట్టును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వసీం అక్రం, మోయిన్ ఖాన్, షాహిద్ అఫ్రిది, ఇంజమామ్, వకార్ యూనిస్, రమీజ్ రాజా, మిస్బాఉల్ హక్ తదితరులు కూడా భారత జట్టును అభినందించారు. ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై ఓడించడం ఎంత పెద్ద జట్టుకైనా చాలా కష్టమని, అయితే భారత్ అది ఆచరణలో చేసి చూపించడం సంతోషం కలిగించిందని వారు తమ సందేశంలో పేర్కొన్నారు.

చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు, కెప్టెన్‌కు వీరు సోషల్ మీడియా వేదికగా అభినందించారు. పటిష్టమైన దేశవాళి విధానం, క్రికెట్ బోర్డు ముందు చూపు తదితర కారణాలతో ప్రస్తుతం టీమిండియా బలమైన జట్టుగా ఎదిగిందన్నాడు. ఒకప్పుడూ ఆస్ట్రేలియా, విండీస్, ఇంగ్లండ్‌ల మాదిరిగా భారత్ ప్రస్తు తం బలంగా మారిందని, ఆ జట్టును ఓడించడం ప్రత్యర్థులకు చాలా కష్టంగా మారిందని వసీం అభిప్రాయపడ్డాడు. మరోవైపు ప్రపంచంలోనే భారత్ బలమైన బౌలింగ్ లైనప్‌ను కలిగి ఉందని, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు భారత్‌లో కొదవలేదన్నాడు. అందువల్లే భారత్‌కు ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం దక్కిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు వకార్, మోయిన్ ఖాన్‌లు పేర్కొన్నారు.

Pakistani Cricketers Appreciate Team India