Home ఎడిటోరియల్ సంపాదకీయం: నవాజ్ షరీఫ్‌ను మింగిన అవినీతి!

సంపాదకీయం: నవాజ్ షరీఫ్‌ను మింగిన అవినీతి!

sampadakeyamపనామా పేపర్స్ వెలుగులోకి తెచ్చిన అవినీతి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవాజ్‌షరీఫ్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించటంతో ప్రధానమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయటం అనివార్యమైంది. షరీఫ్, ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తెపై 6వారాల్లోగా అవినీతి కేసు నమోదు చేసి, 6మాసాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా నేషనల్ అక్కౌంటబిలిటీ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్వదేశంలో పన్నులు ఎగనామం పెట్టి బోగస్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలించిన వేలమంది వివిధ దేశాల ప్రముఖుల జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం 2016 ఏప్రిల్ 4న ప్రచురించింది. ఆ దర్యాప్తు పన్నులు లేని లేదా నామమాత్రంగా ఉండే నల్లధనం స్వర్గధామాల్లో ఒకటైన పనామాకు సంబంధించింది అయినందున అది పనామా పేపర్స్‌గా ప్రసిద్ధి పొందింది. షరీఫ్ రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 1990 దశకంలో మనీ లాండరింగ్‌ను ఆ పత్రాలు బయటపెట్టాయి. ఆ డబ్బుతో ఆయన కుటుంబం ఆర్జించిన ఆస్తుల్లో లండన్‌లో నాలుగు విశాలమైన ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఆరోపణను తొలుత తిరస్కరించిన నవాజ్‌షరీఫ్, ఆరోపణల దర్యాప్తుకు 2016 ఏప్రిల్ 5న జ్యుడీషియల్ కమిటీని నియమించాడు. ప్రతిపక్షాలు ఆ కమిటీని తిరస్కరించాయి. కాగా ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రిక్‌ఎఇన్సాఫ్, అవామీ ముస్లింలీగ్, జమాత్‌ఎ ఇస్లామీ పిటిషన్‌లు ఆధారంగా సుప్రీంకోర్టు గత సంవత్సరం అక్టోబర్‌లో కేసు విచారణ చేబట్టింది. ఈ సంవత్సరం మే నెలలో సుప్రీంకోర్టు ఆర్గురు సభ్యులతో సంయుక్త దర్యాప్తు బృందాన్ని నియమించగా, జులై 10న అది తుది నివేదిక సమర్పించింది. జులై 21న విచారణ ముగించిన ధర్మాసనం శుక్రవారం (జులై 28) షరీఫ్‌కు ‘అనర్హత’ విధిస్తూ ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.

పాకిస్థాన్ ముస్లింలీగ్(పిఎంఎల్‌ఎన్) అధ్యక్షుడైన నవాజ్ షరీఫ్ పంజాబ్‌లో అత్యంత ప్రభావవంతమైన కుటుంబానికి చెందినవాడు. ఉక్కు పారిశ్రామిక వేత్త అయిన షరీఫ్ రాజకీయాల్లో ప్రవేశించిన తదుపరి, ప్రధానమంత్రిగా పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవటం ఇది మూడవసారి. షరీఫ్ 1990నుంచి 1993 వరకు తొలిసారి ప్రధానిగా పనిచేశాడు. 1997లో రెండవసారి ప్రధానమంత్రికాగా సైన్యాధ్యక్షుడు పెర్వెజ్ ముషారఫ్ 1999లో తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించు కున్నాడు. ఆ మాటకొస్తే పాకిస్థాన్‌లో ఐదేళ్లు పదవీకాలం పూర్తిచేసిన ప్రధాని లేడు. 70ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో సైనిక నియంతలే ఎక్కువకాలం పరిపాలించారు. ప్రజా స్వామ్యయుతంగా పౌరప్రభుత్వాలు ఏర్పడినపుడల్లా, సైనిక తిరుగుబాట్లు, సొంత పార్టీలో తిరుగుబాటు లేదా న్యాయవ్యవస్థ ప్రధానులను అర్థాంతరంగా తొలగించింది. సిట్టింగ్ ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు తొలగించటం ఇది రెండవసారి. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై అవినీతి కేసును తిరిగి తెరవాలన్న కోర్టు ఆదేశాన్ని పాటించ నందుకు 2012లో కోర్టు ధిక్కార నేరం కింద న్యాయవ్యవస్థ తొలగించిన మొదటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీ.

పనామా పత్రాలు వెలుగుచూసిన 14 మాసాల్లోనే పాకిస్థాన్ ప్రధాని అవినీతి కేసు లో పదవి కోల్పోయాడు. పనామా పత్రాల్లో 500లకుపైగా భారతీయుల పేర్లు ఉన్నాయి. ఈ నల్లకుబేరుల పేర్లు బయటపెట్టటానికి కూడా నరేంద్రమోడీ ప్రభుత్వం సుముఖత చూపకపోవటం విడ్డూరంగా ఉంది. విదేశీబ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదలకు పంచుతానన్న మోడీ, నల్లధనంపై, అవినీతి పై పోరాటానికి కంకణం కట్టుకున్నామన్న ఆయన ప్రభుత్వం అటువంటి నేరస్థుల పేర్లను వెల్లడించకుండా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నది. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎగనామం పెట్టిన ఆర్థిక నేరస్థుల పేర్లు ప్రకటించ టానికీ సాంకేతిక కారణాలే చెబుతున్నది. అవినీతిపై పోరాడే పద్ధతి ఇదేనా?