Home మహబూబ్‌నగర్ పంచాయతీ.. సవాళ్లు.. ప్రతీ సవాళ్లు

పంచాయతీ.. సవాళ్లు.. ప్రతీ సవాళ్లు

Panchayat .. challenges .. every challenge

సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్న రాజకీయ పార్టీలు
రెఫరండంగా బరిలోకి దిగనున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్
అధిక స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలుపునకు ప్రణాళిక
జిల్లాలో 7,25,675 మంది ఓటర్లు
మూడు విడతలుగా పోలింగ్
17 వేల సిబ్బంది అవసరం కాగా,అందుబాటులో 6 వేల మంది
719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
ఈ నెల చివరిలోగా రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి
వచ్చే నెలలోనే ఎన్నికలు
ఆగస్టు 1తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించడంతో, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు బిజిగా ఉంటున్నా రు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై కసరత్తులు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ స్థాయి ఎన్నికల తరహాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. పల్లెల్లో ఈ ఎన్నికలు పరువు ప్రతిష్టల సమస్యగా భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు సవాల్‌గా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల జెండాలతో కాకుండా జరుగుతుండడంతో పరోక్షంగా ఆయా రాజకీయ పార్టీల ప్రభావంతోనే జరుగుతాయి. పంచాయితీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ఇరు పార్టీలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు చేయడంలో సఫలం అయినట్లు భావిస్తున్న టిఆర్‌ఎస్ అభివృద్ది, సంక్షేమ పథకాల పేరుతో జనంలోకి వెళ్తుండగా, అధికార పార్టీ చేసిన అభివృద్ది జరగలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఓట్లను అడిగే పనిలో కాంగ్రెస్ భావిస్తోంది.

రెండు పార్టీలకు గ్రామాల్లో పట్టు ఉండడంతో రణరంగంగా మారే అవకాశాలు ఉన్నాయి.ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. గత ఉమ్మడి జిల్లాలో 1330 గ్రామ పంచాయితీలు ఉండగా, జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 468 పాత పంచాయితీలు ఉండేవి, కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటుతో ఆ సంఖ్య 733కు పెరిగింది. అయితే ఇందులో కూడా 12 గ్రామ పంచాయితీలు మున్సిపాల్టీలలోకి విలీనమయ్యాయి. మఖ్తల్,చందాపూర్ కలిపి మున్సిపాల్టీగానూ,భూత్‌పూర్, అమిస్తాపూర్ కలిపి ఒక మున్సిపాల్టీగానూ,జడ్చర్ల,నాగసాల, బూరెడ్డి పల్లె కలిపి ఒక మున్సిపాల్టీగానూ మారనుంది. కేవలం దేవరకద్ర పంచాయితీ మాత్రమే మేజర్ గ్రామ పంచాయితీగా మారింది.దీంతో 721 గ్రామ పంచాయితీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో శంకరాయపల్లె తాండ, బండమీద పల్లె గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగడం లేదు. వీటికి 2015లో ఎన్నికలు జరగడంతో మరో రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. అయితే 721 గ్రామ పంచాయితీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా బిసిలకు బిసి ఓటర్ల ఆదారంగా రిజర్వేషన్లు అమలు కాగా,ఎస్‌సి, ఎస్‌టిలకు మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. రిజర్వేషన్ల ఎంపిక కూడా సర్పంచ్‌లకు ర్రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవుతుండగా, వార్డులకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో ఆర్‌డిఓ సమక్షంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాలో మొత్తం ఓటర్లు 7,25,675 మంది ఉండగా అందులో పురుష ఓటర్లు 3,63,737 మంది ఉండగా, 3,61,889 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పంచాయితీ ఎన్నికల్లో యలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వార ఓటింగ్ జరపనున్నారు. జిల్లాలో 4600 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. 6366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నారు.ఎన్నికలకు 17 వేల సిబ్బంది అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 6 వేల మంది ఉద్యోగ సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంది. జిల్లాలో సిబ్బంది కొరత కారణగా మూడు విడుతలగా ఎన్నికలు జరపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వారే పంచాయితీ ఎన్నికల్లోనూ, అదే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.ఓటర్ల జాబితాల్లో పేర్లు లేని వారు,అడ్రస్‌లేని వారు ఎన్నికలలోగా తమ ఓటు హక్కును నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో ఎవరైనా ఓటు హక్కు లేని వారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారు సద్వినియోగం చేసుకోవచ్చు.

107 తండాలకు వారే సర్పంచులు
మా తండా మా పంచాయితీలు అన్న నినాదానికి ముఖ్యమ్రంతి కెసిఆర్ ఆమోదం తెలపడంతో జిల్లాలో కొత్తగా 100 శాతం ఎస్‌టి జనాభాతో ఉన్న 107 తండాల గ్రామ పంచాయితీలకు కొత్తగా ఏర్పాటు జరిగాయి. గతంలో ఇతర గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్‌టిలు ఈ సారి జరిగే పంచాయితీ ఎన్నికల్లో తమ గ్రామాల్లోనే తమ ఓటు హక్కను వినియోగించుకోవడమే కాకుండా ఎస్‌టిలే గ్రామ పంచాయితీలుకు సర్పంచులుగా మారనునున్నారు. వంద శాతం ఎస్‌టి పంచాయితీలకు సర్పంచులు వారే కాకుండా ఇతర గ్రామాల్లో జరిగే పంచాయితీల్లో కూడా వారికి రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది చారిత్రక విజయమని ఎస్‌టిలు భావిస్తున్నారు. మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో దాదాపు సగానికి సగంకు పైగా మహిళలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
పంచాయితీ ఎన్నికలు అనగానే సవాళ్లు, ప్రతి సవాళ్లు గ్రామాల్లో నెలకొననున్నాయి.పంచాయితీ ఎన్నికల్లో ఘర్షణలు, దౌర్జన్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక పంచాయితీలకు పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఎప్పటికప్పడు నిఘా ఉంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారలు చర్యలు తీసుకోనున్నారు.