Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పంచాయతీ ఎన్నికలు బిసిల గణన తర్వాతే

హైకోర్టు మధ్యంతర ఆదేశాలు బిసిల జనాభా, ఓటర్ల వివరాలు ప్రచురించి ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని ఉత్తర్వు
ఆ తర్వాతే ఆయా జాబితాలు సిద్ధం చేయాలి
కాంగ్రెస్ నేతల వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచన

highcourt

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనాభా గణన, ఓటర్ల గుర్తింపు జరిగిన తర్వాతే పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిసి జానాభా, ఓటర్ల వివరాలను ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించా కే చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు న్యాయమూర్తి ఎం ఎస్ రామచందర్‌రావు మధ్యంతర ఆదేశాలిచ్చారు. పిటిషనర్ వ్యాజ్యంలో లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రతివాదులైన పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇతరులు తమ వాదనల తో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాల ని ఆదేశించింది. ఈ మేరకు ప్రతివాదుల కు నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా పడింది. బిసి జనా భా లెక్కలు తేల్చకుండానే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడుతోందని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొం టూ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, రవీంద్రనాథ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి మంగళవారం విచారించారు. వీటితోపాటు ఏపీ బీసీ తరగతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్‌రాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాస్ గౌడ్ వేసిన మరో వ్యాజ్యాన్ని కూడా కలిపి న్యాయమూర్తి విచారణ జరిపారు. తెలంగాణలో బీసీల గణన చేశాకే చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని న్యాయమూర్తి తెలంగాణకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయగా, ఏపీకి సంబంధించిన వ్యాజ్యంలో కేంద్రంతోపాటు ఏపీకి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ జనాభా గణన, ఓటర్ల వివరాల సేకరణ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే ఆ జాబితాలను ఖరారు చేయాలి. ఇవేమీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు సిద్ధపడుతోంది. ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. బీసీ జనాభా లెక్కలపై ప్రభుత్వం రకరకాలుగా చెబుతోంది. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 54 శాతం ఉన్నారని చెప్పింది. ఒక సారి 34 శాతం.. గత ఏడాది ఒక బిల్లు విషయంలో 37 శాతమని విరుద్ధ లెక్కలు చెప్పింది. అసలు బీసీలు ఎంత శాతం ఉన్నారో ప్రభుత్వం తేల్చాలి. ఆ తర్వాతే బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి. ఆపై రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అప్పటి వరకూ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు.. అని శ్రవణ్, రవీంద్రల తరఫు లాయర్ వాదించారు. బీసీలు ఎంత శాతం ఉన్నారో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వద్ద గణాంకాలు ఉన్నాయని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు బదులిచ్చారు. చట్ట ప్రకారం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సర్వే చేయాలన్న నిబంధనను న్యాయమూర్తి గుర్తు చేశారు. సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని రామచందర్‌రావు బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వ్యవధి ఇవ్వడానికే అభ్యంతరం లేదని, అయితే ఈలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదల కావచ్చునని రామచందర్‌రావు బదులిచ్చారు. అయితే చట్ట ప్రకారం బీసీల గణన, ఓటర్ల వివరాలు తేల్చాలని, వాటిపై ప్రజ ల నుంచి అభ్యంతరాలు స్వీకరించాకే ఎన్నికలు నిర్వహించాలని న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలిచ్చారు. విచారణ నెల రోజులకు వాయిదా వేశారు.
ఏపీతోపాటు కేంద్రానికి నోటీసులు: బీసీ జనాభా లెక్కల వివరాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్/పట్టణాభివృద్ధి/గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, జనాభా లెక్కల రిజిష్ట్రార్ జనరల్‌లకు నోటీసులు జారీ చేశారు. బీసీ జనాభా గణనపై పిటిషనర్ ఆరోపణలకు మీ వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను వెల్లడించాలని, 2011 నాటి జనాభా వివరాల సేకరణ ప్రకారం బీసీ జనాభా లెక్కల్ని ప్రచురించాలంటూ ఏపీ బీసీ తరగతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్‌రాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాస్ గౌడ్ కలిసి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ కేసులో న్యాయమూర్తి ఏపీతోపాటు కేంద్రానికి నోటీసులు ఇచ్చారు. బీసీల జనాభా వివరాలు గోప్యంగా ఉండటానికి వీల్లేదు. బహిర్గతం చేయాలి. 2011లో జనాభా లెక్కలు తేలితే ఇప్పటి వరకూ ఓబీసీల వివరాలు వెల్లడించలేదు. మంజునాథ్ కమిషన్ వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది… అని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ కూడా నాలుగు వారాలకే వాయిదా పడింది.

Comments

comments