Search
Monday 24 September 2018
  • :
  • :

పంచాయతీ పోరు జులైలో

panchayat

జులై నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి రెండు నెలల వరకు ప్రభుత్వ కొత్త కార్యక్రమాలొద్దు
వచ్చే ఏడాది ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు ఎన్నికల తరువాతే పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
మూడు దశల్లో ఎన్నికలు : సిఎస్ జోషి

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎట్టి పరిస్థితుల్లోనూ జులై నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హోటల్ మారియట్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ పంచాయ తీ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలన్నారు. ఈ 2 నెలల్లో ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30మంది చనిపోయారన్నారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా ఉంటుందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్‌శాఖ అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తెప్పించుకోవాలని సూచించా రు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల ఓట ర్లు పాల్గొంటారన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించామన్నారు. ఇప్పటికే ఓటర్ల తుదిజాబితా పూర్తిచేసామని చెప్పారు. ముద్రణాసామగ్రి మొత్తం జూన్ 15నాటికి సిద్దమవుతుందన్నారు. కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులను నియమించాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు జూన్ మొదటి వారంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ రెండో వారంలో ప్రొసీడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఉద్యోగుల బదిలీల అనంతరం జూన్ 4వ వారంలో రెండో సారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలట్ పత్రాలను జిల్లాల్లోనే ముద్రించాలన్నారు. సిబ్బంది నిర్వహణ మినహా మిగతా ప్రక్రియనంతా జూన్10లోగా పూర్తిచేయాలని తెలిపారు. స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలని చెప్పారు. భవిష్యత్ తెలంగాణకు ఈ ఎన్నికలు కీలక పునాది లాంటివన్నారు. వచ్చే ఏడాది ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. జూన్ 15లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్లానింగ్ పకడ్భందీగా చేసుకోవాలని చెప్పారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే నిర్వహణ సులువుగా,సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. ఇక నుంచి పంచాయతీ ఎన్నికలపైనే అందరు ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చాలా మంది ఎస్‌పిలు తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారన్నారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సమగ్ర అవగాహన కల్పించుకుని సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి ఘటనలకు తావీయకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్‌పిలు, పోలీస్‌కమిషనర్లను ఆదేశించారు. ఎన్నికలయిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. ఈ ఎన్నికలకు 4కమిషనరేట్ల బలగాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. ఎక్సైజ్, అటవీ తదితర శాఖల సహకారం కూడా తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేయడంలేదని తెలిపారు. ఎన్నికల తర్వాత వారి బదిలీలు చేస్తామన్నారు. జూన్ 1లోగా బిసి ఓటర్ల గణన పూర్తి చేయాలని ఆయన అదికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ డిజి, అడిషనల్ డిజి, ఇంటలిజెన్స్ డిజిలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, కలెక్టర్లు,పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

Comments

comments