Home తాజా వార్తలు అద్దాల్లా గ్రామాలు

అద్దాల్లా గ్రామాలు

Panchayat sanitation personnel need to raise wages

పంద్రాగస్టు నుంచి పల్లెలను పరిశుభ్రం చేసే కార్యక్రమం
పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది
ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా రీజియనల్ రింగ్‌రోడ్డు
నాలుగు ప్రధాన కూడళ్లలో మౌలిక సౌకర్యాల పెంపు
ప్రగతిభవన్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్
గ్రామాల పరిశుభ్రతకు పలు సూచనలు చేసిన సిఎం
పచ్చదనం పెంచడానికీ విలువైన సలహాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం వినూత్నంగా ఆలోచించి వ్యూహాన్ని ఖరారు చేయాలని, మూస పద్ధ్దతిలో లేకుండా చూడాలని సిఎం కెసిఆర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి చేయాల్సిన విషయాలపై నిర్ది ష్ట కార్యాచరణ రూపొందించాలని, ఇందులో మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవంనాడే ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, ఈ నెల రోజు ల్లో చేయాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనే సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వివాహ, జనన, మరణ ధ్రవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలను కూడా పంచాయితీలకు అప్పగించాలని సూ చించారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణను ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పికె జా, వికాస్ రాజ్, నీతూ ప్రసా ద్, స్మిత సభర్వాల్, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

గ్రామాలను పరిశుభ్రత కోసం సిఎం చేసిన సూచనలు
వదిలేసిన గుంతలు, ఉపయోగించని-పాడుపడిన బావులను పూడ్చేయాలి.
-పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి.
-కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి.
మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలనూ శుభ్రంచేయాలి. మురికి నీరు సాఫీగా పోయేలా వాటిని తీర్చిదిద్దాలి.
గ్రామంలోని అంతర్గత రోడ్లపై గుంతలనుపూడ్చివేయాలి. గుంతల్లో మొరం నింపాలి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి.
దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు పెంచాలి. ప్రత్యేకంగా ‘కృష్ణ తులసి’ మొక్కలను పెంచాలి.
గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించి అందుకు తగిన డంప్ యార్డు కోసం స్థలాన్ని సేకరించాలి.
ప్రతీ -గ్రామానికి ఒక స్మశాన వాటికను ఖచ్చితంగా నిర్మించాలి.
– గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి, వారానికోసారి శ్రమదానంలో పాల్గొనేలా చొరవ తీసుకోవాలి.
గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలను చైతన్య పరచాలి.
గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై చేసిన సూచనలు
– రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలి.
— గ్రామంలో రైతులు, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని, దానికి అనుగుణంగా ఇండెంట్ తయారు చేసి, నర్సరీల్లో ఆ తరహా మొక్కలను పెంచాలి.
– దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలను గుర్తించి వాటి పెంపకంపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. వాటిని పెంచేలా ప్రోత్సహించాలి.
– రైతులు పొలం గట్ల మీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి.
– గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలి.
– గ్రామ పరిధిలోని నదులు, ఉప నదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలి.
– అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో, నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించి, ఆ ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో డిఇఓలకు లేఖలు రాయాలి.

ప్రత్యేకాధికారులు ప్రతీ గ్రామానికి సంబంధించి సేకరించాల్సిన వివరాలు :
గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయి, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి?
గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి?
గ్రామంలో స్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలం సేకరించాలి.
గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది? లేకుంటే ఏర్పాటు చేయాలి.
గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా?
కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి.
గ్రామ పంచాయితీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి?

ప్రపంచస్థాయి ‘ఎక్స్‌ప్రెస్ వే’గా రీజినల్ రింగురోడ్డు
హైదరాబాద్‌కు ప్రస్తుతమున్న ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)కు అవతల నిర్మించతలపెట్టిన రీజనల్ రింగు రోడ్డు మామూలు రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ‘ఎక్స్‌ప్రెస్ వే’ గా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ‘వరల్డ్ క్లాస్ ఎక్స్‌ప్రెస్ వే’ గా తీర్చిదిద్దే తరహాలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డిపిఆర్)ను తయారు చేయాలని, దీనికి నిధులు మంజూరు చేసే విషయంలో తానే కేంద్ర ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడతానని సిఎం ప్రకటించారు. ప్రగతిభవన్‌లో ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గణపతి రెడ్డి, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమై రీజనల్ రింగు రోడ్డు నిర్మాణంపై లోతుగా చర్చించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్ నగరం. ఇక్కడి వాతవారణం, సామరస్య జీవనం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ధి చెందుతుంది. దేశ నలుమూలల నుంచీ హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి మరో రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంగారెడ్డి-గజ్వేల్‌చౌటుప్పల్‌మాల్-కడ్తాల్‌షాద్‌నగర్-చేవెళ్లకంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతోఈ రహదారి నిర్మాణం జరగాలి. ముంబైపూణె, అహ్మదాబాద్-వడోదర మధ్య ప్రస్తుతమున్న ‘ఎక్స్‌ప్రెస్ వే’ల కన్నా మన ఆర్‌ఆర్‌ఆర్ గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగుళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే వద్ద వచ్చే జంక్షన్లను బాగా అభివృద్ది చేయాలి. ఈ నాలుగు జంక్షన్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలను కల్పించాలి. పార్కింగ్, ఫుడ్ కోర్టులు, రెస్ట్‌రూమ్‌లు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయాలి. దేశంలోనే ఈ రహదారి అతి గొప్ప రహదారిగా ఉండాలి. మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి, అధ్యయనం చేయాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.