Home రాష్ట్ర వార్తలు పంచాయతీలను పరుగెత్తిస్తాం

పంచాయతీలను పరుగెత్తిస్తాం

ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండేలా అత్యంత క్రియాశీలకం చేస్తాం 

ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలకు స్పష్టమైన విధులు
విధి నిర్వహణలో విఫలమయ్యే వారిపై చర్యలు
వచ్చే బడ్జెట్‌లో జనాభాను బట్టి నేరుగా నిధులు
ఒక్కో గ్రామానికి రూ. 1025 లక్షలు
వచ్చే ఏడాది నిర్ణీత సమయంలోనే ఎన్నికలు
వీలైతే ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టం
ప్రగతి భవన్ సమావేశంలో సిఎం కెసిఆర్

కొత్త పంచాయతీలపై ఎంఎల్‌ఎల నుంచి ప్రతిపాదనలు కోరండి : అధికారులకు సిఎం ఆదేశం 

KCR

హైదరాబాద్ : స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలకంగా పనిచేసే విధంగా, విధి నిర్వహణలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థపై అవగాహన, అనుభవం కలిగిన అధికారు లు, ప్రజా ప్రతినిధులు, సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకొని కొత్త చట్టానికి రూపకల్ప న చేయాలని ఆయన కోరారు. వీలైతే ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టి, చట్టం తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సిఎం ప్రకటించారు. సర్పంచ్‌ల మాదిరిగానే ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలకూ విధులు, బాధ్యతలపై స్పష్టత రావాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో నేరుగా పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధు లు కేటాయిస్తామని, ఒక్కో గ్రామానికి రూ.10 నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తామన్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సిఎం కెసిఆర్ సమావేశం నిర్వహించారు. కొత్త చట్టం ఎలా ఉండాలి? ఎలాంటి విధులు స్థానిక సంస్థలకు అప్పగించాలి? ఎలాంటి బాధ్యతలు వారు నిర్వర్తించాలి? వాటికి నిధులు ఎలా సమకూర్చాలి? ప్రజలకు మరింత జవాబు దారీగా, మరింత క్రియాశీలకంగా తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సిఎం చర్చించారు. “కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గొప్ప పరిపాలనా సంస్కరణలు తెచ్చుకున్నాం. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12–13 వేలు దాటుతుంది. ఈ పంచాయతీలు కేవలం నామమాత్రంగా ఉండడానికి వీలు లేదు. విధులు, బాధ్యతలు లేకుండా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అవన్నీ ప్రజలకు నూటికి నూరు శాతం చేరాలంటే స్థానిక సంస్థలు బాగా పనిచేయాలి. ఇప్పుడున్న విధానం కొనసాగితే ప్రయోజనం లేదు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు భయంకరమైన ప్రమాదంలో ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఏజన్సీలుగా ఉన్న ఇవి రానురాను రాజకీయ పరమైపోయాయి. ఈపరిస్థితిలో సమూలంగా మార్పు రావాలి. మరింత శక్తివంతం, ప్రభావవంతం చేయాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం మారితేనే యావత్ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వర్తించాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? అనే విషయంలో పూర్తి స్థాయి స్పష్టతనిస్తూ కొత్త చట్టం తయారు కావాలి ”అని సిఎం అభిప్రాయపడ్డారు. “కేంద్ర నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఫైనాన్స్ కమిషన్, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాల ద్వారా సమకూరే డబ్బులు అన్నీ జమచేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలి. విధులు, బాధ్యతలతో పాటు కావాల్సిన నిధులు, ప్రజల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణతో సమర్థవంతంగా పనిచేయాలి. ఇన్ని విధాల సహకారం అందించినా సరే, విధుల నిర్వహణలో వైఫల్యం చెందిన చోట క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలి. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం తయారు కావాలి” అని సిఎం చెప్పారు. “వచ్చే ఏడాది నిర్ణీత కాల పరిమితి ప్రకా రం పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పూర్తవగానే సర్పంచ్ లకు పూర్తి స్థాయి లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ గ్రామా నికున్న అవసరం ఏమిటి? భవిష్యత్తులో వారికి ఇంకా ఏది అవసరమవుతుంది? తదితర విషయాలను బేరీజు వేసుకుని అభివృద్ధి ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకోవాలి. ఈ దృక్పథంతో సర్పంచ్ లు పనిచేసేలా వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. సర్పంచ్ లుగా ఎన్నికైన వారిలో చాలామందికి మంచిపేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. అందుకే వారు మంచిపనులు చేసే అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలి” అని సిఎం అభిప్రాయపడ్డారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజయానంద్, తెలంగాణ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ జి.జయపాల్ రెడ్డి, కన్సల్టెంట్లు శంకరయ్య, లింబగిరి స్వామి, ఎన్జీవో ప్రతినిధులు ఎపి రంగారావు, బాలాజి ఊట్ల ఈ సమావేశానికి హాజరయ్యారు.
కొత్త పంచాయతీలపై ప్రతిపాదనలు కోరండి
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు కోరుతూ లేఖలు రాయాలని అధికారులను సిఎం ఆదేశించారు. గిరిజన తండాలు, గోండు గూడేలు, కోయ గూడేలు, చెంచుపల్లెలతో పాటు ప్రధాన గ్రామానికి వెలుపల ఉన్న పల్లెలు, గూడేల వివరాలు సేకరించాలని కోరారు. 500 జనాభాకు పైగా ఉన్న ఆవాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే నిర్ణయం తీసుకున్నందున, దానికనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరాలని సిఎం సూచించారు.