Home ఎడిటోరియల్ సంపాదకీయం: పారిస్ ఒప్పందంపై పిల్లిమొగ్గలు

సంపాదకీయం: పారిస్ ఒప్పందంపై పిల్లిమొగ్గలు

Sampadakeeyam-Logoవాతావరణంలో మార్పులను అరికట్టేందుకుగాను గ్రీన్‌హౌస్ గ్యాస్‌ల విడుదలను నియంత్రించేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పారిస్‌లో 2015 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశం ఆమోదించిన ఒప్పందానికి అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఆమోదముద్ర వేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారంనాడు ప్రకటించారు. ప్రపంచం మొత్తంమీద విడుదలవుతున్న బొగ్గుపులుసు వాయువు, ఇతర హానికర వాయువుల్లో 55 శాతానికి కారణమవుతున్న 55 దేశాలు ఆమోదముద్రవేసిన తదుపరి పారిస్ ఒప్పందం అమలులోకి వస్తుంది. ఈ ఒప్పందాన్ని అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన ఘనతగా చెప్పుకోవటానికై ఆయన పదవీకాలం ముగిసేలోపు ఈ ధృవీకరణను సాధించేందుకు అమెరికా కొంతకాలంగా భారత్‌పై ఒత్తిడి చేస్తోంది. అయితే అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత సభ్యత్వ ఆకాంక్షను అమెరికా గట్టిగా బలపరచనందునే సియోల్ సమావేశంలో తమ ప్రయత్నం ఫలించలేదన్న బాధ భారతప్రభుత్వంలో ఉంది. 2008లో అధ్యక్షుడు జార్జి డబ్లు బుష్‌లాగా ఒబామా గట్టిగా భారత్ పక్షాన నిలబడకపోవటంవల్లనే చైనాను అడ్డంపెట్టుకుని అమెరికా మిత్రదేశాలైన ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, మెక్సికో, స్విట్జర్లాండ్‌లు భారత్ ప్రవేశాన్ని వ్యతిరేకించాయని భావిస్తోంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకందారు కాని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో స్థానం ఉండదన్న నిబంధనను చైనా లేవనెత్తగా పై దేశాలు చైనాకు వంతపాడాయి.

భారత్‌ను అణు వ్యాప్తి చేయని బాధ్యతాయుత దేశంగా గుర్తించి, అణు సరఫరాలకు భారత్‌కు మినహాయింపు ఇచ్చినపుడు ఆ నిబంధనను పక్కనబెట్టారు. వాతావరణ మార్పు ఒప్పందాన్ని ఆమోదించటంలో భారతప్రభుత్వం జాగుచేస్తున్నందున ఎన్‌ఎస్‌జిలో అమెరికా క్రియాశీలంగా వ్యవహరించ లేదనే అనుమానాలున్నాయి. ‘మాదేశంలో ప్రొసీజర్స్’ కారణంగా సంవత్సరాంతంలోపు పారిస్ ఒప్పందం ధృవీకరణ సాధ్యం కాదని మూడు వారాల క్రితం మోడీ ప్రభుత్వం ప్రకటించటం గుర్తుచేసుకో దగింది. ఇంతలో ఏమైంది? అక్టోబర్ 2న ధృవీకరిస్తామని ప్రధాని మోడీ ప్రకటించటంలో ఆంతర్యమేమిటని దౌత్యవర్గాలు పరిపరివిధాల ఆలోచిస్తున్నాయి. ఇది ఇచ్చిపుచ్చు కోవటం (పారిస్ ఒప్పందం ధృవీకరణకు బదులుగా ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం) కాదని అమెరికా త్రోసిపుచ్చి నప్పటికీ అదే వాస్తవంగా కనిపిస్తున్నది. ‘రెంటికీ అంతర్ సంబంధం లేదు. అయితే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి భారత్ సిద్ధంగా ఉందని అమెరికా స్పష్టంగా, గట్టిగా భావిస్తున్నది’ అన్న అమెరికా దక్షిణ, మధ్య ఆసియా అధికారి చేసిన వ్యాఖ్యల్లోని నిగూఢ అర్థం అదిగానే కనిపిస్తున్నది. ఐరాస వాతావరణ మహాసభ నవంబర్7న ముర్రాకేష్‌లో జరగనుంది. పారిస్‌లో జరిగిన కాప్(సిఒపి) సమావేశంలో ప్రధాని మోడీ చాలా చొరవతో గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలలో భారత్ మిగతా ప్రపంచంతో కలిసి నడుస్తుందని హామీ ఇస్తూ 2005 ఉద్గారాల స్థాయిలో 33-35 శాతం కోతకు అంగీకరించారు.

2030 నాటికి ఈలక్షాన్ని సాధించాలి. భూమి వేడిమి 2 శాతం మించితే వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయని, అందువల్ల దాన్ని 2శాతం లోపుకు పరిమితం చేసే నిమిత్తం గ్రీన్‌హౌస్ గ్యాస్‌ల విడుదలలో కోతపెట్టే లక్షాలను ప్రపంచదేశాలు ఆమోదిం చాయి. వాతావరణాన్ని కలుషితం చేసిన పారిశ్రామిక దేశాలే అందుకు పరిహారం చెల్లించాలని, ఉద్గారాల విడుదల్లో కోతను తమపై రుద్దితే తమ అభివృద్ధి కృషికి నష్టం జరుగుతుందని వర్థమాన దేశాలు అంతకుముందు చాలాకాలంగా వాదిస్తున్నాయి. ఆ తగ్గించే టెక్నాలజీ కూడా పారిశ్రామిక దేశాలవద్దే ఉంది. అయితే పునరుత్పాదక ఎనర్జీ ఉత్పత్తికి (జల, వాయు, సౌర) తాము సాయం చేస్తామంటూ అభివృద్ధి చెందిన దేశాలు వర్థమాన ప్రపంచంపై ఒత్తిడి చేసి ఒప్పుదల పొందాయి. అవి చేస్తామన్న సాయం అవసరంలో ఆవగింజంత-100బిలియన్ డాలర్లు. ప్రపంచ వ్యాప్త ఉద్గారాల్లో భారత్ వాటా 4.5 శాతం. వాతావరణ పరిరక్షణ కొరకు ఉత్సాహం ప్రదర్శించిన ప్రధాని మోడీ, పారిస్ ఒప్పంద ఆమోదాన్ని మరిదేనితోను లింకుపెట్టకుండా ఈ పాటికే పూర్తిచేసి ఉంటే ప్రపంచ దేశాల్లో మనదేశానికి ఎంతో గౌరవప్రదంగా ఉండేది.