Home అంతర్జాతీయ వార్తలు పారిస్ ఒప్పందానికి ఓకే

పారిస్ ఒప్పందానికి ఓకే

Paris-climate-deaచైనా, అమెరికా ఆమోదముద్ర, ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కి ఒప్పంద పత్రాల అందజేత, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు

బీజింగ్: ప్రపంచంలో 40 శాతం కార్బన్ ఉద్గారాలకు కారణమైన చైనా, అమెరికాలు శనివారంనాడు ఉమ్మడిగా పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోద ముద్ర వేశాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ గ్యాస్‌ల ఉద్గారాలను బాగా తగ్గించడానికి ఉద్దేశించిన ఒప్పందం అది. ఆ రెండు దేశాలు ఆమోద ముద్ర వేయడంతో ఈ ఏడాది ఆఖరుకు ఒప్పంద అమలులోకి వచ్చేదన్న ఆశాభావానికి ఊతం లభించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇక్కడ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్‌కు ఆమోదించిన ఒప్పందం పత్రాలను అందచేశారు. కీలక జి-20 దేశాల శిఖరాగ్రసభ హ్యాంగ్‌ఝౌ నగరంలో ప్రారంభానికి ఒకరోజుముందు ఈ ఆమోదం పడింది. ఆ సభలో ప్రపంచంలోని 20 పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల నాయకులు సమావేశమౌతారు. ప్రపంచంలో అధికభాగం ఉద్గారాలకు కారణమౌతున్న రెండు దేశాలు ఆమోద ముద్ర వేయడం కీలకపరిణామమని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు చైనాలోని హ్యాంగ్‌ఝౌ నగరంలో ఒబామా ప్రసంగిస్తూ వాతావరణ మార్పుల నుంచి భూగ్రహాన్ని రక్షించడానికి అత్యుత్తమ ఒప్పందం అని పారిస్ అంగీకారాన్ని అభివర్ణించారు. లక్ష్యానికి చేరువుగా ప్రపంచాన్ని తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అంతకుముందు చైనా పార్లమెంటు ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. తమ దేశం మొత్తం ఒప్పందానికి బద్ధమై ఉందని అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. అమెరికా, చైనాలు ఆమోదించిన పారిస్ ఒప్పందం ఉష్ణోగ్రతల పెరుగుదలను తగ్గించడానికి చర్యలను సూచించింది. ఇందుకు కార్బన్ ఉద్గారాలు తగ్గించడమే ప్రధానంగ జరగాలని నిర్దేశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు డిగ్రీలను మించకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తోంది. డెన్మార్క్‌లో 2009లో జరిగిన వాతావరణ సభలో ఒప్పందం కుదరలేదు. అందుచేత ఈ ఏడాది పారిస్ లో కుదిరిన ఒప్పందం గణనీయమైనదని ప్రపంచదేశాలు ప్రశంసించాయి.

నేడు జి-20సదస్సు
హ్యాంగ్‌ఝౌ: ఆదివారంనాడు ఇక్కడ ప్రారంభమయ్యే రెండు రోజుల జి-20 శిఖరాగ్ర సభలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం గురించి లోతుగా చర్చిస్తారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించటానికి, ఉద్యోగాల కల్పన, అందరినీ కలుపుకుపోయే వృద్ధి, వాతావరణం మార్పుల కట్టడికి ఆర్థిక సహాయం వంటి కీలక అం శాలు చర్చకు వస్తాయి. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం రంగాలలో ప్రపంచ దేశాల కృషి పై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమె రికా అధ్యక్షుడు ఒబామా, ఇతర ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ ఈ సందర్భంగా చర్చలు జరుపుతారు. భారతదేశం నిర్మాణాత్మకంగా అమెరికాతో అన్ని అంశాలపై చర్చలు జరుపుతోంది. సమస్యల పరిష్కారానికి అమెరి కాతో కలిసి కృషి చేయడంపై కూడా చర్చిస్తారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థను రూపొందించడంపై కూడా వారు చర్చిస్తారు. ఇదే మొదటిసారిగా మోడీ ప్రస్తుతం వియత్నాం లో పర్యటిస్తున్నారు. అక్కడినుండి చైనా చేరుకుంటారు. జి-20సభకు ముందు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా,ఇండి యా, చైనా,దక్షిణాఫ్రికా దేశాలు) సమావేశమై వర్థమాన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా లేవనె త్తేవిషయంపై వ్యూహాన్ని రూపొందిస్తారు. ఈ ఐదు దేశాల నేతలు వచ్చేనెల గోవాలో కూడా సమావేశమౌతారు. అక్కడ బ్రిక్స్ శిఖరాగ్రసభ జరుగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో మరింత సమన్వయంతో వ్యూహాన్ని రూపొందిస్తారు.