Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పరివార్ లక్ష్యం పోలరైజేషన్ ?

Polarisationమతతత్వం పెరగటం పట్ల దేశంలో ఇంతటి నిరసనలు వ్యక్తమవుతున్నా సంఘ్ పరివార్ బృందం ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎదురు విమర్శలకు పాల్పడటం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కాని ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదేమో. ఇటు వంటి నిరసనలు ఇంకా ఇంకా ఎక్కువ కావాలని సంఘ్ పరివార్ కోరుకుంటున్నదేమో. అది జరిగితే, దేశం లో అధిక సంఖ్యాకులు హిందువులు అయినం దున వారు తమ హిందూవాదంవైపు పోలరైజ్ కాగల రన్నది వారి అంచనా కావచ్చు. అట్లా జరుగుతుందా లేదా అనేది వేరే సంగతి. కాని అటువంటి అంచ నాలు ఉండటం అసహజం కాదు. పరివార్ వ్యూహం లో ఇటువంటి అంచనాలు ఒక భాగమన్న అభి ప్రాయాన్ని రాజకీయ పండితులు గతంలోనూ వెలి బుచ్చారు. ప్రస్తుత సందర్భంలో ఆ స్థితి మరొక మారు కనిపిస్తున్నది.
పరివార్ ప్రతినిధులతోపాటు నరేంద్రమోడీ మంత్రివర్గ సహచరులు, అధికారపక్షమైన బిజెపి నాయకులు గతవారంరోజులుగా చేస్తున్న ప్రకటన లను జాగ్రత్తగా గమనించండి. లౌకికవాదం పేరిట అందరూ మోడీపైన, హిందూవాదంపైన దాడి చేస్తు న్నారన్నది వారి మాటల సారాంశం. తమకు, తక్కిన వారందరికి మధ్య ఒక విభజన రేఖ గీయటం ఇటు వంటి వ్యూహాలలో మొదటి అడుగు. ఆ రేఖ ఎంత బలపడేట్లు చేస్తే విభజన అంత పెరుగుతుంది. బల పడాలంటే ప్రజలు అటో, ఇటో ఎంచుకునే పరిస్థితిని కల్పించాలి. తాము బాధితులైనట్లు, తక్కిన వారంతా ఒక్కటై తమను బాధిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించాలి. ఈ క్రమంలో మొదట తమ వారను కున్నవారు ఇంకా పూర్తిగా తమవెనుక సంఘటిత మవుతారు. మామూలు స్థాయి సానుభూతిపరులు స్పష్టమైన విధంగా తమ వైపు తిరుగుతారు. సర్వ సాధారణంగా తటస్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారిలో తగినంతమంది “బాధితుల” పట్ల సానుభూతి కలిగే వారుంటారు. మోడీని అటు వంటి “బాధితుని”గా చూపటం ఇప్పటికే మొద లైంది. ఇపుడే కాదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటినుంచీ “బాధితుడే”నని దేశం ముందు చిత్రీకరించచూస్తున్నారు.
అసహనం గురించిన విమర్శలు మతతత్వానికి సంబంధించినవి కాగా, మోడీని ప్రధానంగా ముందుకు తేవటం ఎందుకు? మోడీకి సాధారణ ప్రజల్లో “అభివృద్ధికి చిహ్నమనే” పేరుంది. ఆ పేరు ను గుజరాత్ సమయంనుండి ఇప్పటివరకు కొన సాగిస్తున్నారు. ఆ “గతప్రతిష్ట”ను చూపే లోక్‌సభ ఎన్నికలు గెలిచారు. అదే ప్రతిష్టను ఏడాదిన్నర తర్వాత కూడా చూపుతూ, మతతత్తంపై వస్తున్న విమర్శలకు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను పోటీగా నిలపచూస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలమైతే, అపుడు సాధారణ ప్రజల దృష్టిలోంచి క్రమంగా మతతత్తం అనే రూపంలో వచ్చిన సమస్య పక్కకు జరిగి మోడీ కేంద్రబిందువవుతారు. అప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయజూస్తున్న ఆయనపై లౌకిక వాదులనే వారంతా ఆ వాదాన్ని సాకుగా చేసుకుని దాడి చేస్తు న్నారనే భావన కలుగుతుంది. అపుడు లౌకికవాదులు అంటున్న మతతత్త సమస్యకు గల తీవ్రత తగ్గు తుంది. అది పరివార్ కోరుకునే పోలరైజేషన్‌కు గీటురాయి అవుతుంది.
ఇది ఇట్లా జరిగి తీరుతుందనటం లేదు. కాని ఈ తరహా సమస్యలకు లోనైనవారు వేసే ఎత్తుగడ లలో ఇదొకటి. అందరికీ ఒక అంశం గురిగా మారి నపుడు ఆ దాడి తీవ్రతను తట్టుకునే శక్తి ఆ అంశానికి తగ్గుతుంది. అపుడు, దృష్టిని మళ్ళించేందుకు మరొక గురిని మొదటిదాని పక్కన ఏర్పాటు చేస్తారు. అందు వల్ల తమకు ప్రమాదం తప్పి తీరుతుందనే హామీ ఉండదుగాని, అందుకు అవకాశం మాత్రం కలుగు తుంది. ఈ ఎత్తుగడ సాఫల్యవైఫల్యాలు వివిధాంశా లపై ఆధారపడి ఉంటాయి. కాని ప్రస్తుత సందర్భా నికి వచ్చినపుడు ఒక సమస్య ఉంది. మోడీకి అభివృద్ధి చిహ్నమనే ప్రతిష్ట దేశంలో గత ఎన్నికల సమయంలో ఉండినట్లు ఇపుడు లేదు. అందువల్ల, లౌకికవాదం అంటూ జరిగే దాడివల్ల ఆయన “బాధి తుడు” అయినట్లయితే, ఆ ప్రభావం అభివృద్ధిపై ఉండగలదనే వాదన ప్రభావం ప్రజలపై ఉండే అవకాశం చాలా తక్కువ.
పరివారీయుల ఎత్తుగడకు మరొక సమస్య కూడా ఉంది. ప్రజలు మతతత్తంతో ప్రభావితులయే పరిస్థితి అయోధ్య వివాదకాలంనాడు ఉన్నట్లు, అప్పటి నుంచి ఇరవయ్యేళ్ళకు పైగా గడిచిపోయిన తర్వాత ఇపుడు లేవు. అందుకే వీరు మోడీని, అభివృద్ధి నినాదాన్ని ముందుకు తేవలసి వచ్చింది. అటువంటి స్థితిలో, లౌకికవాదులవల్ల హిందూమతం ఒక “బాధిత” అవుతున్నదనే వాదన ప్రజలను మెప్పించగల అవకాశం కూడా కన్పించటం లేదు. ఇది చాలదన్నట్లు, దేశంలో మతపరమైన అసహనం సాధారణ ప్రజలకు కూడా వ్యతిరేకత కలిగించే స్థాయికి పెరిగిపోతున్నది. ఇది కొద్ది మాసాలుగా జరుగుతూ వస్తున్నందున ప్రజలకు ఈ సరికే కొన్ని అభిప్రాయాలు ఏర్పడి పోయాయి. జరుతున్నవన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. ఇటువంటి స్థితిలో హిందూమతం “ఒక బాధిత” అని చెప్పి ఒప్పించగల అవకాశం కన్పించదు. మతపరమైన విషయాలలో ఇతర పార్టీల ద్వంద్వ నీతిని బిజెపి ఎత్తి చూపు తున్నది. ఉదాహరణకు ఢిల్లీలో సిక్కు వ్యతిరేక హత్యాకాండ. ఆ విమర్శ కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా సరైందే. కాని అది కొన్ని దశాబ్దాలకిందటి ఉదంతం అయినందున ప్రజలకు పాతబడిన దానివలె తోస్తుంది. అప్పటినుంచి ఒక కొత్తతరం ఉనికిలోకి వచ్చినందున వారికి ఈ విషయం అంతగా తెలి యదు. అదిగాక, ఒక తప్పుకు మరొక తప్పుతో చెల్లు బాటు కాదుగదా, రెండూ తప్పులే అవుతాయి. సిక్కుల హత్యాకాండ సమయంలో కాంగ్రెస్ కూడా తీవ్రమైన ఖండనలకు గురైంది.
ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసు కున్నప్పుడు, సమాజాన్ని హిందువులు – ఇతరులు గా లేక హిందూవాదులు – లౌకికవాదులుగా లేక అభివృద్ధి వాదులు – ఇతరులుగా పోలరైజ్ చేయా లనే సంఘ్‌పరివార్ ఆలోచన నెరవేరగల అవకాశం కన్పించటం లేదు. 2014లో లభించిన ఆధిక్యతను, మోడీకి ఉన్నట్లు భావిస్తున్న ప్రతిష్టను కలిపి చూసు కుని, దేశంలో హిందూత్వ భావనల వ్యాప్తికి ఇంత కన్న సదవకాశం ఉండదని, దానిని త్వరగా సద్విని యోగం చేసుకోవాలని ఆలోచిస్తున్న పరివార్ వైపు నుంచి అవాంఛనీయమైనవి అనేకం జరుగు తున్నా యి. వాటిపై అనూహ్యమైన రీతిలో వ్యతిరేకత ఏర్పడుతున్నది. దానిని తట్టుకునేందుకు, ఎదురు దాడి చేసేందుకు పరివార్ సంస్థలు, ప్రభుత్వ నాయ కులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నా గాని అవేవీ పనిచేయటం లేదు. వ్యతిరేకత తీవ్రరూపం తీసుకుం టున్నట్లు వారు కనీసం అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతటి వాడు వెంటవెంటనే ఒకటికి రెండు సార్లు వ్యాఖ్యలు చేసినపుడు గ్రహించి తమ పద్దతిని మార్చుకోవలసింది. తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గతపక్షం రోజులలో వరుసగా పలు సందర్భాలలో హితవులు చెప్పిన దానిని బట్టి అయినా తమ ధోరణినుంచి ఉపసంహరించు కోవల సింది. కాని అటువంటిదేమీ జరగకపోగా ఆ ధోరణి మరింత ప్రకోపించటం కన్పిస్తున్నది. కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్యను బిజెపి నాయకుడొకరు “తల నరకగల”నని బహిరంగ సభలో హెచ్చరించా డంటే పరివారీయుల తీరు ఎంతప్రమాదకరంగా మారుతున్నదో గ్రహించవచ్చు.
అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసు కోవాలి. లౌకికవాదులు ఈ ధోరణులను ఎంత బలంగా ఖండించినా, అంతమాత్రాన దేశంలో లౌకిక వాదం విస్తరించదు. మతతత్త వ్యతిరేక వాతా వరణం ఒకటి తాత్కాలికంగా ఏర్పడవచ్చుగాని, నికరమైన రీతిలో లౌకికవాదం పెరగదు. ఇప్పటికే గట్టి లౌకికవాదులైన వారికి కొత్తగా చెప్పవలసింది లేదు. అస్పష్టతలు గలవారికి స్పష్టత కలిగించటం, గీతకు ఆవలగలవారిని ఈవలకు తీసుకురావటం ఎంత జరిగితే లౌకికవాదం అంత విస్తరిస్తుంది. కావలసింది ఊర్ధముఖంగా పైకి పెరగటమే కాదు. దానికన్న ముఖ్యంగా అడ్డంగా విస్తరించాలి. అటు వంటి విస్తరణ కోసం లౌకికవాదులు చేస్తున్నది దాదాపు శూన్యం.
ఈ దిశలో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటి, దానిని ఎట్లా మార్చవచ్చు అనే ఆలోచనలు గాని, అందుకు తగిన ప్రయత్నాలుగాని లౌకిక వాదులు ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా, తాము అధికారంలో ఉన్న చోట జనరంజక పాలనను అందించటం కూడా ప్రజలను మతతత్తశక్తులవైపు ఆకర్షితులు కాకుం డా ఆపగలదు. ఇది కూడా వీరు దృష్టిలో ఉంచు కోవటం లేదు. ఈ రెండూ జరిగినట్ల యితే, హిందూవాదం పేరిట హిందువులను తప్పు దారి పట్టించే పరివార్ ప్రయత్నాలు నెరవేరకుండా ఉంటాయి. ఇటువంటి నికరమైన పనులు చేయ కుండా, సమస్య తలెత్తినపుడల్లా ఖండనలన్నది బలహీనమైన వ్యూహమవుతుంది.
-9848191767

Comments

comments