Home తాజా వార్తలు పార్లమెంట్ ఎన్నికలకు మొదలైన కసరత్తు

పార్లమెంట్ ఎన్నికలకు మొదలైన కసరత్తు

 Prepare for Parliament election

రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సిఇఓ నివేదిక
వివిప్యాట్‌లకు వేసవి గుబులు
అదనపు ఇవిఎంలపై సమాలోచనలు

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కసరత్తు మొదలుపెట్టింది. రానున్న ఎన్నికల్లో పోలింగ్ సన్నద్ధత కోసం ముప్పై అంశాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సిఇఓ కార్యాలయానికి లేఖ రాసింది. వాటిపై సిఇఓ కార్యాలయం సోమవారం నాటికే నివేదిక సమర్పించాల్సి ఉన్నా అదనంగా రెండు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. రానున్న రెండు రోజుల్లో ఈ నివేదికను పంపనున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో వినియోగించాల్సిన ఇవిఎంలపై కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఇవిఎంలకు తోడు అదనంగా ఎన్ని అవసరమవుతాయో కూడా సిఇఓ కార్యాలయం అధికారులు ఇప్పటికే లెక్కలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించినవాటిలో ఎన్నింటిని పార్లమెంటుకు తిరిగి వినియోగించుకునే వీలు ఉంటుందనే అంశంపై ఇప్పటికప్పుడు స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 45 రోజుల అనంతరం కోర్టులో ఎన్నికల పిటిషన్లను దాఖలు చేయడానికి పార్టీలకు, అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

ఆ తర్వాత 45 రోజుల పాటు తిరిగి లెక్కించడం తదితర అవసరాల కోసం వాటిని వినియోగించకుండా సీల్ చేసిన స్థితిలోనే ఉంచాల్సి ఉంటుంది. ఆ విధంగా డిసెంబరు 11వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి అయినందున మార్చి 10వ తేదీ వరకు వీటిని వినియోగించడం సాధ్యం కాదు. అయితే కోర్టులో వేసిన ఎన్నికల పిటిషన్లకు అనుగుణంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఇవిఎంల (కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్)ను, వివిప్యాట్‌లను తిరిగి వినియోగించడానికి వీలు పడదు. కోర్టు విచారణలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించినవి మినహా మిగిలినవాటిని నిక్షేపంగా వినియోగించుకోవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్ని ఇవిఎంలు, వివి ప్యాట్‌లను తిరిగి వినియోగించుకోవడానికి సాధ్యమవుతుందో స్పష్టంగా చెప్పలేమని,ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యేదానిపై ఆధారపడి ఉంటుందని సిఇఓ కార్యాలయం అధికారి ఒకరు వివరించారు.
నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ :
రానున్న పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోడానికి, ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోడానికి బుధవారం నుంచి అవకాశం లభించనుంది. వచ్చే నెల 25వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగనున్నందున ఫిబ్రవరి 21వ తేదీకల్లా దరఖాస్తులను పరిశీలించి తగిన సవరణలు చేసి ఫిబ్రవరి 22న తుది జాబితాను విడుదల చేసేలా రాష్ట్ర సిఇఓ కార్యాలయం షెడ్యూలును విడుదల చేసింది. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు ఓటర్ల నుంచి, రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలు రావడం, వాటిపై ఎన్ని చర్యలు తీసుకున్నా పొరపాట్లు పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో స్వయంగా సిఇఓ రజత్‌కుమార్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పార్లమెంటు ఎన్నికలకు ఆ పరిస్థితి పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఈసారి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా ఎన్నికల సంఘం చేపట్టనుంది. జనవరి 25వ తేదీ వరకు ఓటర్లకు అవకాశం ఉంది.
వివి ప్యాట్‌లతో ఎన్నికల సిబ్బందికి తలనొప్పి :
ఎన్నికల్లో వివిప్యాట్‌లను తప్పనిసరిగా వాడేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నందున రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ వీటిని వినియోగించనుంది. అయితే వీటికి ఉన్న ప్రత్యేకతల దృష్టా ఎక్కువ వెలుతురు, ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అవి పనిచేయడం మొరాయిస్తాయి. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఎన్నికల సంఘం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఓటు వేసే దగ్గర ఎక్కువ వెలుతురు ఇచ్చే బల్బులను వాడలేదు. దీంతో ఓటర్లకు తగినంత వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ వెలుతురు బల్బులను వాడినట్లయితే వివిప్యాట్‌లలోని సెన్సార్లకు ఎక్కువ ఉష్ణోగ్రత తగిని పనిచేయడం మొరాయిస్తాయనే ఉద్దేశమే ఇందుకు కారణం. అయితే రానున్న పార్లమెంటు ఎన్నికలు వేసవి కాలం తీవ్రంగా ఉన్న రోజుల్లో జరగనున్నందున వీటి కోసం చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, సాధారణ పగటి (రూమ్ టెంపరేచర్) ఉష్ణోగ్రత 40 డిగ్రీలకంటే ఎక్కువే ఉంటున్నందున వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయక తప్పదని అధికారి ఒకరు తెలిపారు.

దాదాపు 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ తరహా ఏర్పాట్లు చేయడం మామూలు విషయం కాదని, వీటిని తయారుచేసిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్లతో చర్చల తర్వాత ఒక స్పష్టత వస్తుందని ఆ అధికారి వివరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఎంత సంఖ్యలో ఇవిఎంలు, వివిప్యాట్‌లు అవసరమవుతాయో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తర్వాత ఖరారయ్యే ఓటర్ల సంఖ్య, దాని వెన్నంటి నిర్ధారించే పోలింగ్ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా పార్లమెంటు ఎన్నికలకు వేరే ఇవిఎంలు, వివిప్యాట్‌లను వినియోగించడమే శ్రేయస్కరమనే ఉద్దేశంతో సెప్టెంబరులోనే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సిఇఓ కార్యాలయం వివరించిందని, మరికొన్ని రోజుల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని ఆ అధికారి వివరించారు.

****
అరుణ్

parliament election 2019