Home రాష్ట్ర వార్తలు సబ్ కా సాత్ అంటూనే రాష్ట్రానికి హాత్

సబ్ కా సాత్ అంటూనే రాష్ట్రానికి హాత్

తెలంగాణను అవమానించిన బిజెపికి ఎందుకు ఓటేయాలి
దేశంలో మోడీ, రాహుల్ తప్ప నాయకులే లేరా?
సికింద్రాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం
16 ఎంపి స్థానాలు గెలిపించుకుంటే రాష్ట్రానికి నిధులు
సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు

ప్రధాని మోడీ వైఖరిని ఎండగట్టిన కెటిఆర్

పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల హామీ ఏమైందని ప్రశ్న

KTR

 

మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో నల్లధనం వెలికితీసి ప్రతి పేదవాడి ఖాతా లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాన నరేంద్రమోడీ అన్నారని…ఆ హామీ ఏమైందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. మోడీ సబ్ కా సాత్…అంటూ తెలంగాణకు హాత్ ఇచ్చారని విమర్శించారు. బుధవారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం లో గులాబీ జెండా ఎగురవేస్తారని దీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో బిజెపి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇదే రకమైన మాటలు జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు కూడా మాట్లాడారని అన్నారు. ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తాము ముందే చెప్పామని, ఇటీవల జరిగిన శాసనసభ స్థానాల్లో గతంలో బిజెపి గెలిచిన స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలిచిందని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నుంచి మొదలుకుని అన్ని ఎన్నికల్లో బిజె పి ఘోరంగా ఓటమి పాలైందని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కచ్చితంగా టిఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి సంవత్సరం తర్వాత పదవి నుంచి తొలగించారని, ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో కూడా చెప్పలేదని అన్నారు. దత్తాత్రేయకు సరైన గౌరవం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గంలో  తెలంగాణ బిడ్డకు అవకాశం ఇవ్వకుండా అవమానించిన బిజెపి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బిజెపికి ఓటు అడిగే హక్కు లేద ని అన్నారు. ఏం చేసిండని నరేంద్ర మోడీ ఓ ట్లు అడుగుతున్నారని నిలదీశారు. రాజ్యాంగబద్దంగా పన్నుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా తప్ప మనకు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. బిజెపి నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ లేదు…బిజెపి నేతలకు హోష్ లేదు

సారు…కారు…16…ఢిల్లీ సర్కారు’ ఇదే నినాదంతో మనం ప్రజల్లోకి వెళదామని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను టిఆర్‌ఎస్ నుంచి 16 మందిని, తమ మిత్రపక్షమైన ఎంఐఎం నుంచి ఒకరిని గెలిపించుకుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్‌కు 16 సీట్లిస్తే ఏం చేస్తుందని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇద్దరు ఎంపిలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కెసిఆర్…అదే 16 మందిని గెలిపిస్తే ఏం చేస్తడో చూపిస్తామని అన్నారు. రాహుల్‌గాంధీకి, నరేంద్రమోడీకి మధ్యనే ఈ ఎన్నికలు అని అంటున్నారని, దేశంలో మోడీ, రాహుల్ తప్ప ఇంకా నాయకులే లేరా..? అని ప్రశ్నించారు. అయితే బోఫోర్స్…లేదా రఫేల్ కుంభకోణాలు చేయడానికేనా వారిని ఎన్నికున్నది అని నిలదీశారు. దేశంలో మోడీ హవా లేదు…రాహుల్‌గాంధీకి ఆదరణ లేదని విమర్శించారు. మోడీ, రాహుల్ కంటే సమర్థులు ఈ దేశంలో చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండబోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ లేదు..బిజెపి క్యాడర్‌లో హోష్ లేదని ఎద్దేశా చేశారు.

కేంద్రంలో ఒక్కొక్క ఎంపి కీలకమే

కేంద్రంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాయని, లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైళ్లన్నీ బీహార్‌కు వెళ్లాయని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడం వల్ల గుజరాత్‌కు బుల్లెట్ వేసుకున్నారని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా మోడీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదని తెలిపారు. ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఇచ్చారా లేదా ఆలోచించుకోవాలని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పాలనలో దేశం ఆగమైందని విమర్శించారు.

గత పాలకుల నాయకత్వంలో ఉత్తర భారతదేశంలో కరెంట్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడదామని రక్షణ శాఖ భూములు ఇవ్వమని అడిగితే కేంద్రం ఇవ్వలేదని, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్ కడుదామని ప్రతిపాదిస్తే రక్షణ భూముల ఉన్నాయన్న కారణంగానే నిర్మించలేకపోయామని చెప్పారు. కేంద్రంలో ఒక్కొక్క ఎంపి కీలకం కాబోతున్నారని, ఢిల్లీ జుట్టూ మన చేతిలో ఉంటే మన రా్రష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది ఎంపిలు గెలిచి ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించబోతున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశంలో టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

 

Parliament Elections: KTR Comment on Modi Government