Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పల్లెల కోసం పార్టీల పట్టు

Party hold for the villages

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : రాబోయే 2019 సాధారణ ఎన్నికలకు ముందు జరగబోనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోనున్నాయని అంటున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా దశల వారీగా ఇప్పటికే పూర్తి కావడంతో పార్టీలన్ని ఆ దిశగా సంసిద్దత ప్రక్రియను మొదలు పెట్టాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకొని రాబో యే ఎన్నికలను సవాలుగా మారాలని యోచిస్తున్నాయి. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగనున్నప్పటికీ పరోక్షంగా మాత్రం పార్టీల ప్రభావంతోనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ సానుభూతిపరులను రంగంలోకి దించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. 2019 సాధారణ ఎన్నికలలో తమ పార్టీల తరపున గ్రామాల్లో ప్రధాన సంధానకర్తలుగా సర్పంచులు వ్యవహరించనున్నందున పా ర్టీలన్ని ఈ దిశగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నట్లయితే ఆ గ్రామ పంచాయతీలలో తమ పట్టు నిలవడమే కాకుండా అత్యధిక ఓట్లను సాధించవచ్చని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. వీటికి తోడుగా బీజేపీ, తెలంగాణ జన సమితి, కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఉనికిని కాపాడుకుంటూ రాబోయే సాధారణ ఎన్నికలలో పోటీకి సిద్దం కావాలని భావిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలలో అత్యధికంగా గెలిపించుకొనేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. అధిష్టానం సైతం పరోక్షంగా ఇదే రీతిలో ఆదేశాలు జారీ చేయడంతో మంత్రులు ఆయా మండలాల్లోని తమ పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా అధికారిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాలకు మంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు. మంత్రుల పర్యటనలతో గత కొద్ది రోజుల నుంచి గ్రామాల్లో ముందస్తు ఎన్నికల ప్రచార పర్వం కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేరీతిలో కాంగ్రెస్ పార్టీ సైతం గ్రామీణ ప్రాంతాలలో తరచుగా పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కార్యకర్తలను చేజారి పోకుండా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తుంది. ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ ఇప్పటి నుంచే మొదలైందని అంటున్నారు.

Comments

comments