Home మంచిర్యాల రైళ్లలో బియ్యం అక్రమ రవాణా

రైళ్లలో బియ్యం అక్రమ రవాణా

Passing the train to Maharashtra directly

టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని దందా
రూటు మార్చి అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులు
యథేచ్ఛగా రైళ్లలో మహారాష్ట్రకు తరలింపు
తాజాగా బెల్లంపల్లిలో 20 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

మన తెలంగాణ/మంచిర్యాల: పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని కొందరు వ్యాపారులు యథేచ్ఛగా రైళ్లలో తరలిస్తున్నారు. గత కొంత కాలంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్నా ఈ అక్రమ దందాకు తెరపడడంలేదు. సబ్సిడీ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో లోతుగా పరిశీలించకపోవడం వలన ప్రతినిత్యం ఏదో ఒక చోట సబ్సిడీ బియ్యం పట్టుపడుతున్నాయి. సబ్సిడీ బియ్యం అక్రమంగా తరలించిన వారిపై పలు సార్లు కేసులు నమోదు చేసినప్పటికి వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఆదివారం బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల నుంచి బెల్లంపల్లి మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 20 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లి ఇందిరానగర్‌కు చెందిన శ్రీరాముల సమ్మయ్య అనే వ్యక్తి బొలెరో వాహనంలో అక్రమంగా బియ్యం తరలిస్తుండగా అడ్డుకున్నారు. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి , బెల్లంపల్లి , రేచిని రోడ్ , కాగజ్‌నగర్, సిర్పూర్(టి) రైల్వే స్టేషన్ల గుండా ప్రతినిత్యం రైళ్లలో వందలాది టన్నుల సబ్సిడీ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతుంది. గత కొన్ని రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అకస్మిక దాడులు నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు. సబ్సిడీ బియ్యంతో పాటు నకిలి విత్తనాలు, నల్లబెల్లం పట్టుకున్న సంఘటనలు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే విధంగా చేస్తున్నాయి. రేషన్ షాపుల్లో సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు గాను ఈ పాస్ విదానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల తాండూర్ మండలం రేచిని రోడ్డు రైల్వే స్టేషన్‌లో పోలీసులు 50 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కుల ఆటకట్టించేందుకు ఈ-పాస్ విదానం ద్వారా రేషన్ పంపిణీ చేస్తుండగా ఇప్పటి వరకు రహస్య స్థావరాల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బయటకు తరలుతున్నాయి. కొందరు రేషన్ డీలర్లు సబ్సిడీ బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముతుండగా వారు మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని గోందియాకు లారీలో అక్రమంగా 20 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా మాదారం ఎస్‌ఐతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రైళ్లలో సాగుతున్న ఈ అక్రమ రవాణా వ్యవహారం లారీల వైపు మళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నుండే కాకుండా కరీంనగర్, వరంగల్, కొమురంభీం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ బియ్యాన్ని రైళ్లలో తరలిస్తూ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రస్తుతం వేలి ముద్రలు వేస్తేనే బియ్యం పంపిణీ జరుగుతుండగా అక్రమ రవాణా జరిగే అవకాశం లేకపోవడంతో వ్యాపారులు వారి వద్ద బియ్యం నిల్వలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పేదలు, డీలర్ల వద్ద నుంచి రూ. 10 నుంచి రూ. 16కు బియ్యాన్ని కొనుగోలు చేస్తూ మహారాష్ట్రలో రూ. 25కు విక్రయిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున నిల్వలు ఏర్పాటు చేసుకొని ఒకే సారి రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏదిఏమైనా పెద్ద ఎత్తున సబ్సిడీ బియ్యం రైళ్లలో మహారాష్ట్రకు తరలిపోతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు వ్యాపారులతో చేతులు కలిపి సహకరిస్తుండగా అడ్డు అదుపు లేకుండా అక్రమ రవాణా కొనసాగుతుంది. ఇప్పటికైనా సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.