Home ఖమ్మం రెవెన్యూ భూ మాయాజాలం…

రెవెన్యూ భూ మాయాజాలం…

 land

 

*భూమి లేకుండానే పాస్ పుస్తకాలు
*రైతుబంధు సాయం కోసం దొంగపాస్ పుస్తకాలు సృష్టి
*రెవెన్యూ సిబ్బంది కన్నుసన్నల్లో పాస్ పుస్తకాల జారీ
*వెలుగులోకి వస్తున్న సత్తుపల్లి సెగ్మెంట్ రెవెన్యూ లీలలు
*ఇప్పటికే ఒక విఆర్‌ఓపై సస్పెన్షన్ వేటు?
*మరి కొంతమందిపై వేటుకు రంగం సిద్ధం

ఖమ్మం : భూమి లేకుండానే పట్టాదార్ పుస్తకాలు జారీ అయ్యాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బంధు పంట సాయం పొందడానికే కేవలం కాగితాలపైనే భూమి ఉన్నట్లు సృష్టించి బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేశారు. ఒక్క మండలమే కాదు సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ తంతు చోటు చేసుకున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇప్పటికే సత్తుపల్లి మండలంలో ఒక విఆర్‌ఓను సస్పెండ్‌కు గురి చేయగా ఈ నియోజకవర్గంలో పెనుబల్లి, వేంసూరు మండలాల్లో పనిచేసే మరి కొంతమంది రెవెన్యూ సిబ్బందిపై వేటు వేసేందుకు రం గం సిద్ధమైంది.

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాల ద్వారా రైతులు పడే ఇబ్బందులు తొలగించేందుకు గత ఏడాది రెవెన్యూ భూ రికార్డుల శుద్దీకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన విష యం తెలిసిందే. ఏళ్ళతరబడి భూ వివాదాలతో రైతులంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ, జెసి, ఆర్డీఓ కోర్టుల చుట్టూ తిరిగేవారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రెవెన్యూ రికార్డుల శుద్దీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా విచారణ చేసి ఎలాంటి వివాదాలు లేకుం డా క్లీన్ చిట్ ఇస్తూ అధునాతన డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేశారు.

ఇందుకు రెవెన్యూ చట్టంలోని కొన్ని లొసుగులకు స్వస్తి చెబుతూ సాదాబైనామాకు అవకాశం కల్పించారు. జిఓ నెంబర్ 59.60ల ద్వారా అక్రమణలను క్రమబద్దీకరణకు కూడా అవకాశం కల్పించారు. అనంతరం పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ అయిన రైతులకు రైతుబంధు సాయాన్ని అందించారు. అయితే సత్తుపల్లి నియోజకవర్గంలోని కొన్ని మండలాల రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తమకు అనుకులంగా మార్చేసుకున్నారు. గ్రామాల్లోని కొంత మందితో చేతులు కలిపి భూములు లేకుండానే పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేశారు.

వేంసూరు మండలం గుడూరుపాడు గ్రామంలో సర్వే నెంబర్ 202 (ఖాతానెం.598) లో ఓక వ్యక్తి తనకు ఉన్న 5.7 ఎకరాల భూమిని 15 ఏళ్ళ క్రితం ఇతరులకు విక్రయించారు. అయితే అదే సర్వే నెంబర్‌పై అదే వ్యక్తిపై పట్టాదారు పాస్‌పుస్తకాన్ని స్థానిక రెవె న్యూ అధికారులు జారీ చేశారు. ఆ తరువాత ఏంచక్కా ప్రభుత్వ రైతుబంధు పంట సాయాన్ని పొందుతూ వస్తున్నారు. ఇదే గ్రామంలో సర్వే నెంబర్ 164లో (ఖాతానెం. 589)లో కూడా 5 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించగా మళ్ళీ వారి పేర్లపై పట్టదారు పాస్ పుస్తకం జారీ అయ్యింది. క్షేత్రస్థాయిలోకి వెళితే వారి పేర్లపై భూమి ఉండదు. కానీ రైతుబంధు సాయాన్ని మా త్రం పొందుతూ వస్తున్నారు. ఇదే గ్రామంలో సర్వే నెంబ ర్ 2,5 లల్లో కూడా ఇలాంటి తతంగమే నడిచింది.

ఇదే మండలంలో కందుకూర్, వేంసూర్, చౌడవరం, అమ్మపాలెం, లింగపాలెం తదితర గ్రామాల్లోకూడా ఇ లాంటివి పెద్ద ఎత్తున్న చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాక మర్లపాడు, కెజిమల్లేల, కల్లూరిగూడెం తదితర గ్రామాల్లో విఆర్‌ఓల సహాయంతో ఆర్‌ఐ ఒకరు స్థానికులతో కలిసి పెద్ద మొత్తంలో వసూళ్ళకు పాల్పడి అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున్న చేతులు మారినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా పెనుబల్లి మండలంలోని రెవెన్యూశాఖలో కూడా పెద్ద ఎత్తున్న అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మండలంలో ఏరుగట్ల, కొండ్రపాడు, కారాయిగూడెం, విఎం.బంజర, లంకసాగర్, లంకలపల్లి, గొల్లగూడెం, బయ్యన్నగూడెం, లింగగూడెం, భవన్నపాలెం, తాళ్లపెంట తదితర గ్రామాల్లో రైతుల నుంచి రెవెన్యూ సిబ్బంది అక్రమంగా పెద్ద ఎత్తున్న వసూళ్ళకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై శాఖా పరమైన విచారణ కొనసాగుతుంది. సత్తుపల్లి మండ లం బేతుపల్లి, కాకర్లపల్లి గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయిలో భూమి లేకున్నా పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయ డం, అంతేగాక వారికి తొలి, మలి విడత రైతుబంధు పథ కం సాయాన్ని చెక్ రూపంలో అందించినట్లు రుజువైనట్లు తెలుస్తోంది.

ప్రభు త్వ చెరువు శిఖం భూములకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రభుత్వ అవసరాల నిమిత్తం రైతుల నుంచి భూములు తీసుకొని వారికి పరిహారం అందించిన భూములపేర్లతో కూడా పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేసి వాటిపై కూడా రైతుబంధు సాయం పొందుతున్నట్లు సమాచారం. సోసైటీలో సహకార రుణాలు తీసుకున్నట్లుగా చూపించి పట్టాదార్ పాస్‌పుస్తకాలను పొందారు. అందులో భాగంగానే ఈ మండలానికి చెందిన మహిళా విఆర్‌ఓను సస్పెండ్ చేశారు. మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమైంది.

పెనుబల్లి మండలంలో కూడా ఆరుగురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాలకోసం తిరుగుతునే ఉన్నారు.

 

Patented books are issued without land