Home తాజా వార్తలు స్థానిక ‘మండలి’ పోరుకు వేళాయె

స్థానిక ‘మండలి’ పోరుకు వేళాయె

Telangana Legislative Council

 

పట్నం నరేందర్ రెడ్డి రాజీనామాతో ఎన్నికలు
ఖుషీ, ఖుషీగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు
మూడు రోజులలో నోటిఫికేషన్
ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఆశల పల్లకిలో ఆశావహులు

మన తెలంగాణ/రంగారెడ్డి: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కాలం కలిసివస్తుంది. పదవీ కాలం ముగియడానికి దగ్గరవుతున్న సమయంలో మరోమారు అదృష్టం తన్నుకువస్తుంది. స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా రెండవ సారి విజయం సాధించిన పట్నం నరేందర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేయడంతో మరోమారు ఆ స్థానంకు ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల శాసనసభ్యుడి ఎంపికకు ఈ నెల 28 న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పదవిపై ఆశ పెట్టుకున్న జిల్లా నేతలు చాలా మంది ఆదినాయకుల ఆశీస్సుల కోసం శతవిదాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 2015 డిసెంబర్‌లో నిర్వహించిన ఎన్నికలలో జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యులుగా పట్నం నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజులు విజయం సాధించిన సంగతి విధితమే.

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనసమండలి సభ్యుడిగా ఎంపికలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జడ్పీటిసి, ఎంపిటిసిలు, మున్సిపాలిటి నగర పంచాయతీ పరిధిలోని కౌన్సిలర్‌లతో పాటు గ్రేటర్ లోని జిల్లా ప్రాంతంలోని డివిజన్ కార్పొరేటర్‌లు ఓటర్లుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా లెక్కల ప్రకారం వికారాబాద్ డివిజన్‌లో 184, మల్కాజ్‌గిరిలో 149, చెవెళ్లలో 173, రాజేంద్రనగర్‌లో 48, సరూర్‌నగర్ 217 మంది ప్రజా ప్రతినిధులతో పాటు గ్రేటర్ పరిధిలోని ఉమ్మడి జిల్లా కార్పొరేటర్‌లు ఓటర్లుగా ఉంటారు. జిల్లా అధికార యంత్రాంగం ఓటరు జాబితాను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో ఎన్నికల సమయంలో టిఆర్‌యస్ తరపున బరిలోకి దిగిన నరేందర్ రెడ్డి, రాజులు ప్రత్యర్దులు మాజీ మంత్రి చంద్రశేఖర్(కాంగ్రెస్), బుక్క వేణుగోపాల్ (టిడిపి), కె.ఆశోక్(బిజెపి)లపై అఖండ విజయం సాధించారు.

వార్ వన్‌సైడ్…
స్థానిక మండలి ఎన్నికలలో అధికార టిఆర్‌యస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ది ఘన విజయం సాధించనున్నారు. స్థానిక సంస్థలతో పాటు గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌యస్ పార్టీకి తిరుగులేని శక్తిగా ఉంది. గత ఎన్నికలలో బరిలోకి దిగిన పెద్దగా ప్రభావం చూపని కాంగ్రెస్,టిడిపిలు ప్రస్తుత ఎన్నికలలో కనీసం బరిలోకి దిగే పరిస్థితులు కూడ కనిపించడం లేదు. మండలి సభ్యుడి ఎన్నికలలో కీలకమైన జడ్పీటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్‌ల పదవి కాలం మరో మూడు నెలల్లో ముగుస్తున్న సమయంలో మండలి ఎన్నికలు రావడంతో వారంతా ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు. గత మండలి ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలతో ఎంజాయ్ చేసిన ఓటర్లు మరోమారు పండగ వాతావరణం వస్తుందన్న ఆశతో కనిపిస్తున్న అధికార టిఆర్‌యస్‌కు స్పష్టమైన మెజారిటి ఉండటంతో పార్టీ ప్రతిపాధించిన అభ్యర్ది ఘన విజయం దక్కనుండటంతో క్యాంపు రాజకీయాల చాన్స్ కనిపించడం లేదు.

ఫిబ్రవరిలోనే మండలి ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు చాలా మంది ఆదినాయకుల ఆశీస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా మంది నేతలు పదవిపై ఆశ పెట్టుకున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చెవెళ్ల నియోజకవర్గంకు చెందిన టిఆర్‌యస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, తాండూర్‌కు చెందిన కరణం పురుషోత్తం రావు, కొత్త మనోహర్ రెడ్డి(మహేశ్వరం), చంద్రశేఖర్‌రెడ్డి(ఇబ్రహింపట్నం)లతో పాటు శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టిఆర్‌యస్‌లో చేరిన క్యామ మల్లేష్‌తో సహ పలువురు ఉమ్మడి జిల్లా నేతలు ఈ స్థానంను ఆశీస్తున్న మంత్రి కెటిఆర్ ఆశీస్సులు ఉన్నవారికి పదవి దక్కనుంది.

Patnam Narender Reddy Resigned To MLC in Rangareddy