Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఎపికి ప్రత్యేక హోదాపై పవన్ కామెంట్స్

PAWAN1

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేక హోదా ఎవరి వ్యక్తిగత సమస్య కాదని జనసేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంట్ సాక్షి చెప్పారని ఆయన అన్నారు. ఎంపిలు సరిగా పని చేయకపోవడం వల్లనే ఎపికి ప్రత్యేక హోదా రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపిలు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై జన సేన పార్టీ ఆధ్వర్యంలో జెఎఫ్‌సిని ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు మేథోమథన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో తెలంగాణను విలీనం చేసిన సమయంలో రాజనీతిజ్ఞుల సూచన మేరకు రెండు రాష్ట్రాలను ఒకటి చేశారని ఆయన తెలిపారు. వెనుకబడిన తెలంగాణకు అండగా నిలబడతాం అని చెప్పారని, కానీ నాటి హామీలను పట్టించుకోకపోవడంతో ఆ సమస్య దశాబ్దాల పాటు పేరుకపోయి జఠిలమైందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఎపిని విడదీసి తెలంగాణను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎపికి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు విసుగు చెందుతున్నారని ఆయన అన్నారు. యుపిఎ హయాంలో ఎంపిలు సరిగా స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్‌డిఎ హాయంలో కూడా అదే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి తప్పు జరిగిపోయిందని, విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను ఒకటి చేశాని, ఇటువంటి పరిస్థితుల్లో అనేక హామీలు ఇచ్చారే కానీ వాటిని అమలు చేయలేదని, దీంతో జైఆంధ్రా ఉద్యమం వచ్చిందని, ఈ ఉద్యమం కారణంగా వందలాది మంది అమరులయ్యారని పవన్ పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా వందలాది మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన చెప్పారు. రాజకీయ నేతలు చేసిన తప్పులకు ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారని ఆయన వాపోయారు. శనివారం జరిగిన సమావేశంలో తెలంగాణ గురించి కూడా చర్చకు వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయని ఆయన చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదాపై టిడిపి, వైసిపి ఎంపిలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన అన్నారు. ఎపి ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించిన విషయంపై తనకు సమాచారం లేదని ఆయన చెప్పారు. ఎపి హక్కుల సాధనకు పార్టీలకతీతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఏకమైనప్పుడే కేంద్రం దిగొస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Pawan Comments on Special Status for AP

Comments

comments