Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పవన్ మళ్లీ నటన వైపు..?

Pawan Kalyan might act in Son in law Vaishnav Tej Film

హైదరాబాద్: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయనతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ఎదురుచూస్తుంటారు. ఒక్క చిత్రమైనా పవన్ తో చేస్తే చాలు అనుకునేవారు ఉన్నారు. ఇక పవన్ ఫ్యాన్ ఫాలొవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పలేం. అభిమానుల‌కి ఆయ‌న ఒక దేవుడు. చేసింది కేవ‌లం పాతిక చిత్రాలే అయినా అభిమానగ‌ణాన్ని మాత్రం అసంఖ్యాకంగా సంపాదించుకున్నాడు ప‌వర్ స్టార్. అభిమానులు కూడా పవన్ మళ్లీ నటిస్తే బావుండు అని కోరుకుంటున్నారు. అయితే, ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌నే ఉద్దేశంతో ఆయన రాజకీయాల‌లోకి వ‌చ్చి ‘అజ్ఞాత‌వాసి’ మూవీ త‌ర్వాత సినిమాలు చేయ‌డం మానేశాడు. దీంతో త‌మ అభిమాన హీరో మళ్లీ ఎప్పుడు వెండితెర‌పై కనిపిస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఇది సాధ్యామా? ఇప్ప‌ట్లో అది కుదురుతుందా?అని అనుకునే అభిమానులకు ఇది ఓ తీపి కబురు అనే చెప్పాలి.

తాజాగా ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప‌వ‌న్ మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకోనున్నాడ‌ని తెలుస్తోంది. సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లో వెండి తెర‌పై అరంగేట్రం చేయనున్నాడనే విషయం తెలిసిందే. దీనికోసం వైష్ణవ్ ప్రస్తుతం న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని సమాచారం. ఇక వైష్ణ‌వ్ తేజ్ తొలి  చిత్రాన్ని ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాల డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహించనున్నాడట. ఈ నేపథ్యంలో ప‌వ‌న్ మేన‌ల్లుడు మూవీని దర్శకత్వం వహిస్తున్న డాలికి ప‌వ‌న్‌తోనూ మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ప‌వ‌ర్ స్టార్‌ని కలిశారట. దీనికి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేది తాజాగా హల్ చల్ చేస్తున్న వార్త. మేన‌ల్లుడి కోసం డాలి అభ్య‌ర్ధ‌న‌ను ప‌వ‌న్ అంగీక‌రించినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం ద్వారా ప‌వ‌న్ మళ్లీ మేక‌ప్ వేసుకుని వెండితెర‌పై మెరుస్తాడని అభిమానులు ఆశ పడుతున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే,  ఈ వార్త నేపథ్యంలో ప్రస్తుతం ప‌వ‌న్ ఎప్పుడు ఎవరి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారట. సో.. వారి నిరీక్షణకు శుభం కార్డు పడాలని ఆశిద్దాం.

Comments

comments