Home తాజా వార్తలు నా తల్లిని దూషిస్తారా?

నా తల్లిని దూషిస్తారా?

pawan

ప్రభంజనమైన పవనం

రామ్‌గోపాల్ వర్మపై పవన్ కల్యాణ్ నిప్పులు
తల్లి, మెగా ఫ్యామిలీతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆవేశపూరిత నిరసన, ఛాంబర్‌పైనా అస్త్రాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు చలనచిత్రపరిశ్రమ చరిత్రలో శుక్రవారం ఓ ఘాటై న దినంగా నిలిచిపోతుంది. కాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పటికే చినికి చినికి గాలివానగా మారగా అదిప్పుడు మహా ప్రభంజనమై మరింత సంచలనాత్మకమైంది. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయం గా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తన బృందంతో వచ్చి వర్మపై నిప్పులు చెరిగి ఛాంబర్ వైఖరిని కూడా కడిగి వదిలిపెట్టా రు. వర్మ తన తల్లిని దూషించడంపై తీవ్రంగా మండిపడ్డా రు. జరుగుతున్న దుష్పరిణామాలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ఒక్కరోజులో చెప్పాలని ఛాంబర్‌కు గడువు పెట్టారు. పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసి న హేయమైన దూషణ వెనుక ఉన్నది, ఆమె చేత తిట్టింప చేసింది తానేనని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్వ యంగా చెప్పుకున్న తరువాత గురువారం అల్లు అరవింద్ ఆయనను తీవ్రంగా తప్పుబడుతూ మీడియాకి ఎక్కిన సం గతి తెలిసిందే.

శుక్రవారం నాడు ఉదయం పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబుతో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన నటులు రామ్‌చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్‌లతో కలిసి హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌కు వచ్చారు. పవన్ ఛాంబర్‌కు వచ్చిన విషయం తెలియడంతో మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్‌లతో పాటు వివిధ యూనియన్ల నాయకులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, ఫిల్మ్ ఫెడరేషన్ తదితర విభాగాల నాయకులను పవన్ ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమను పలుచన చేస్తూ…నటీమణుల గౌరవానికి భంగం కలిగిస్తూ చిత్ర సీమలోని కుటుంబాలను అభాసు పాల్జేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ఏమి చేస్తున్నారని నిలదీశారు.

సినిమా నటీమణుల్ని, ఈ రంగం లో పనిచేస్తున్న మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే స్పందించారా అని ప్రశ్నించారు. “ఒక ఛానల్‌లో సినిమా రంగంలోని వారి గురించి అవమానకరంగా మాట్లాడితే ఏమి చేశారు? క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మొత్తం తెలుగు చిత్ర సీమను పలుచన చేసేలా వార్తలు,కథనాలు వస్తుంటే ఎందుకు అభ్యంతర పెట్టడం లేదు”అని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. “చట్టపరంగా పోరాడడానికి 24 క్రాఫ్ట్ ఒకే తాటిపైకి రావాలి..మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. ఇందుకు అన్ని విభాగాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. తక్షణం దీనిపై కదలాలి”అని పవన్ అన్నారు.ఈ సందర్భంగా పలువురు నటీమణులు, డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ తరహా కథనాల మూలంగా ఎదుర్కొంటున్న అవమానాలు, ఇబ్బందులను పవన్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్‌ను కలిసిన వారిలో ‘మా’ నాయకులు శివాజీరాజా,హేమ, అని తా చౌదరి, ఏడిద శ్రీరామ్, దర్శకుల సంఘం తరపున ఎన్.శంకర్, వినాయ క్, మెహర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, వీర శంకర్, మారుతి, నిర్మాతల మం డలి నుంచి సుధాకర్ రెడ్డి, దామోదర ప్రసాద్, అల్లు అరవింద్, సుప్రి య, కె.ఎస్.రామారావు, ఎన్.వి.ప్రసాద్,నాగ అశోక్ కుమార్, ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, పి.డి.ప్రసాద్, ముత్యాల రాందాస్, కుమార్ చౌదరి, రచయితలు పరుచూరి బ్రదర్స్, విశ్వ, ఫెడరేషన్ నుంచి కొమర వెం కటేష్ తదితరులు ఉన్నారు.

అనంతరం ప్రస్తుత పరిణామాలు, పవన్‌కల్యాణ్ ఆందోళనలపై శనివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటిస్తారు. ఇక తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బాధ్యులపై న్యాయమైన పోరాటం చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు కొందరు న్యాయవాదులతో పవన్‌కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ సమావేశమయ్యారు.

వరుస ట్వీట్లతో ఆగ్రహం : శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఈ వ్యవహారంపై పవన్‌కల్యాణ్ వరుసగా ట్వీట్లు చేశారు. తనపై చేయించిన అనుచిత వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. “నాపై ఆరోపణలు చేస్తున్న వారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీల కోసం టివి షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను.

ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది”అంటూ పవన్ చేసిన ట్వీట్ ఆయన మనోవేదనను తెలియజేసింది. “మీరంతా కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలు, మీ కూతుళ్లు, కోడళ్లు, మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు.ఆత్మగౌరవంతో బతికేవాడు. .. ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే… అసలు దేనికన్నా భయపడతాడా? వెనుకంజ వేస్తాడా?”అని ప్రశ్నించారు. “ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకే ప్రపంచం తెలియని నా కన్నతల్లిని… ఎవరికీ ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని… మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహానిచ్చి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆతర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయి మీరు దిగజారారు”అని ఆవేదన వ్యక్తంచేశారు పవన్‌కల్యాణ్.

పవన్ మరో ట్వీట్‌లో “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నమస్కారాలు. కిమిడి కళా వెంకట్రావు దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు. అందులో మీరు చేస్తున్న ‘ధర్మపోరాట దీక్ష’లో రాష్ట్ర మేలు గురించి పాల్గొనాలని మీరు అడిగారు. అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఏమీ ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు ‘చేయూతనిచ్చిన చేయిని’ వెనుకమాలుగా ఓ మీడియా శక్తుల ద్వారా చంపివేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మటం”అని పేర్కొన్నారు. “ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది.

‘నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా… అధికారం అనేది అండదండలు ఉన్న వారిపై, ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడి పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు”అని పవన్ మరో ట్వీట్‌లో అన్నారు.

ఛాంబర్ వద్ద ఉద్రిక్తత : పవన్‌కల్యాణ్ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉన్నారు. ఇది తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఛాంబర్‌కు విచ్చేసి రామ్‌గోపాల్ వర్మ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేయడం కష్టంగా మారిందని పోలీసులు చెప్పడంతో పవ న్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రామ్‌గోపాల్ వర్మపై సినీ పరిశ్రమలోని పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో శనివారం వరకు వేచి చూస్తానని… ఆతర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ చెప్పినట్లు తెలిసింది.

మరోసారి వర్మ క్షమాపణలు : పవన్ విషయంలో తాను తప్పు చేశానని… క్షమించాలని రామ్‌గోపాల్ వర్మ అభ్యర్థించారు. వర్మ మాట్లాడుతూ…“పవన్‌కల్యాణ్ గురించి నెగటివ్‌గా కామెంట్ చేయనని మా తల్లి మీద ఒట్టేశాను. కానీ ఆతర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలంగా నేను నెగటివ్‌గా కాకుండా లాజికల్‌గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. పెద్దవాళ్లను అన్నప్పుడు చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం. మహేష్ కత్తిని ఉదాహరణగా చూపించి శ్రీరెడ్డికి సలహా ఇచ్చింది నేను. అయితే ఈ విషయాన్ని నేనే స్వయంగా ఒప్పుకొని క్షమాపణ కూడా చెప్పాను. ఇకపోతే మీ అమ్మగారిని తిట్టడమన్నది కరెక్ట్ కాదు. మీ అంత సూపర్‌స్టార్‌ను దుర్భాషలాడడం మంచిది కాదు. ఈ విషయంలో మీరు ఊహించుకుంటున్న వారెవరూ ఈ వ్యవహారంలో లేరు. ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్లీ క్షమాపణ చెప్పుకుంటున్నాను”అని తెలిపారు.

సినీ ప్రముఖుల సంఘీభావం : శ్రీరెడ్డి-రామ్‌గోపాల్ వర్మ వివాదంతో టాలీవుడ్‌లో ఓ రకమైన వాతావరణం నెలకొంది. వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్‌తో సహా హీరోలు, నటీనటులు, దర్శకులు కూడా అందరూ పవన్ వైపు ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్‌కు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. పవన్‌ను తిట్టిన శ్రీరెడ్డిపై, తిట్టించిన రామ్‌గోపాల్ వర్మపై ఛాంబర్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వర్మ ఓ చీడ పురుగు : రామ్‌గోపాల్‌వర్మ ఓ చీడ పురుగులాంటివాడని అన్నా రు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. శ్రీరెడ్డి, వర్మ వివాదం గురించి శివాజీ రాజా మాట్లాడుతూ“ఈ విషయం ఫిలింఛాంబర్‌కు సంబంధించినది. వర్మపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై న్యాయవాదులతో చర్చిస్తున్నాం”అని తెలిపారు.