Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విజయాల్లో కీలక పాత్ర

Payal Rajput in RX 100 movie

మొన్నటివరకు తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్ర గ్లామర్ కోసమో లేదా హీరోతో పాటల్లో డాన్స్ చేయడం కోసమో ఉండేది. కానీ కాలం మారుతోంది.  ప్రస్తుతం వస్తున్న సినిమాల విజయాల్లో హీరోయిన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోతో సమానంగా ఉండే పాత్రల్లో హీరోయిన్లు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండడం మంచి పరిణామం. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతున్న ‘గీత గోవిందం’ టైటిల్‌లో మొదట ఉన్నది హీరోయిన్ పేరే. కథలో కీలకమైన మలుపుకు కారణం అవడమే కాకుండా హీరోను డామినేట్ చేసే పాత్రలో రష్మిక మందన్న అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మంచి విజయాన్ని సాధించిన ‘ఆర్‌ఎక్స్ 100’లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. హీరోకు సమానంగా ఉండే పాత్రలో నటించి మెప్పించింది పాయల్. ఈ పంజాబీ భామ చక్కగా నటించి ప్రేక్షకులను అలరించింది. ‘మహానటి’లో కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో అద్భుతంగా నటించి మైమరపించింది. సావిత్రి పాత్రలో జీవించి ప్రేక్షకులను అలరించింది. హిట్ మూవీ ‘ఛలో’లో కథ కీలక మలుపు తిరిగేది హీరోయిన్ పాత్ర వల్లే. ఇందులో కథానాయికగా రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘తొలిప్రేమ’లో వరుణ్‌తేజ్‌కు ధీటుగా రాశీఖన్నా పాత్రను తీర్చిదిద్దడం సినిమాకు ప్లస్‌గా మారింది. ఇక ‘భాగమతి’ చిత్రం అనుష్క అద్భుతమైన నటనతోనే ఘన విజయం సాధించింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ స్టార్ హీరోయిన్‌కు మంచి విజయాన్ని అందించింది. విడుదలకు సిద్ధమైన ‘యు టర్న్’లో ముఖ్య పాత్రలో నటించిన సమంత ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్లకు ఇస్తున్న ప్రాధాన్యత సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

Comments

comments