Home రాష్ట్ర వార్తలు గల్ఫ్‌లో గుండెకోత

గల్ఫ్‌లో గుండెకోత

  • పిసిసి సదస్సులో ప్రభుత్వంపై వక్తల విమర్శ, కాంగ్రెస్ వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయిస్తాం, కేరళలో మాదిరిగా ప్రవాసీ బీమా అమలు చేస్తాం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి

Uttam-Kumar-Reddy

హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మి కుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తామని, గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తా మని పిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కేరళలో అమలు చేస్తున్న తరహాలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ బీమాను అమలు చేస్తామన్నారు. పిసిసి ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘తెలంగాణ గల్ఫ్ భరోసా’ పేరుతో సెమినార్ జరిగింది. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం చేసింది శూన్యమని ఉత్తమ్‌కు విమర్శించారు.. గల్ఫ్ నుంచి ప్రతి రోజూ ఐదుగురి మృతదేహాలు వస్తుండడం అక్కడి దుర్భర పరిస్థితులను అద్దం పడుతున్నాయన్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో ఉంటున్న వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి, తెల్ల కార్డుల నుంచి తొలగిస్తున్నారని ఈ పద్ధతికి వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ జైళ్లల్లో మగ్గుతున్న వారికి న్యాయసహాయం అందించి రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. నిద్రావస్థలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను మేలుకొల్పి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మాటలు కాదు కార్యాచరణతో ముందుకెళ్లాలి : ప్రొ.కోదండరామ్
గల్ఫ్ బాధితుల సమస్యలపై మాటలకు పరమితం కాకుండా ఆచరాణా త్మకంగా వ్యవహరించాలని, ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని పునరుద్దరించాలని తెలంగాణా జెఎసి ఛైర్మన్ ప్రొ.కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల రేషన్ కార్డులను రద్దు చేయవద్దని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగైతే, వలస సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానాలతో కార్యాచరణను రూపొందిస్తే, జెఎసి మద్దతినిస్తుందని ప్రకటించారు. గల్ఫ్ వెళ్లేవారి నైపుణ్యాల శిక్షణను అవుట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించడంతో అది వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వ ఐఐటిలు, పాలిటెక్నిక్‌ల ద్వారా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటా యన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో తీసుకున్న చర్యలేమిటో ప్రభుత్వం వివరించాలని టిడిపి నేత ఇ.పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఎటు పోయాయని ప్రశ్నించారు. సిపిఐ మాజీ ఎంఎల్‌ఎ గుండా మల్లేశ్ మాట్లా డుతూ గతంలో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరించిన ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అక్కడి వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. సిఐటియుసి ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ సిరిసిల్లలో జరుగుతున్న కార్మికుల వెట్టి కనిపించని మంత్రి కెటిఆర్‌కు గల్ఫ్ కార్మికుల సమస్యలు ఎలా కనబడతాయని ప్రశ్నించారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహన్ మాట్లాడుతూ గల్ఫ్‌లో కార్మికులు బానిసలుగా బతుకుతున్నారని, వలస చట్టాలను సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన అవసరముందన్నారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, ఇంతవరకు ఎన్‌ఆర్‌ఐ పాలసీను ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రభుత్వాని ప్రశ్నించారు. గల్ఫ్ బాధితులపై సిఎంకెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు ఎన్నిసార్లు లేఖలు రాసిన నామమాత్రపు స్పందన కూడా లేదన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్ల ఇస్తామన్న కెసిఆర్ హామీ ఏమైందని అడిగారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నెలకొల్పుతున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు కూడా ప్రత్యేకంగా సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా అసెంబ్లీని సమా వేశపరిచి చర్చించాలని సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెమినార్‌లో ఎఐసిసి కార్యదర్శి ఆర్.సి. కుంతియా, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సిపిఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నరసింహారావు, పిసిసి ఎన్‌ఆర్‌ఐ సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.