Home జాతీయ వార్తలు తెలంగాణలోనే ఒంటరి మహిళలకు పెన్షన్

తెలంగాణలోనే ఒంటరి మహిళలకు పెన్షన్

Pension Scheme For Single women in Telangana

 

మహిళల సంక్షేమం, అభివృద్ధికి టిఆర్‌ఎస్ప్రభుత్వం కట్టుబడి ఉంది
సిఐఐ ఇండియన్ విమెన్స్ నెట్‌వర్క్ హెల్త్ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల

మన తెలంగాణ/హైదరాబాద్ : ఒంటరి మహిళలకు పెన్ష్‌న్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. బుధవారం బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్‌లో జరిగిన సిఐఐ – ఇండియన్ విమెన్ నెట్వర్క్ హెల్త్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ, మహిళ సమాజంలో సిఐఐ మరింత విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో మరింత పెరగాలని అభిలాషించారు. రాష్ట్రంలో ప్రతి మహిళా గౌరవంగా బ్రతకాలన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ తీసుకొచ్చారన్నారు. త్వరలో వారికి ప్రతి నెలా రూ. 2వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామన్నారు. అలాగే – ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కుటుంబం కోసం బీడీలు చుట్టే మహిళలకు కూడా దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

కేవలం పెన్షన్లు మాత్రమే కాకుండా గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు, భూములు మహిళల పేరుతో మంజూరు చేస్తున్నామన్నారు. నీళ్ల కోసం మహిళలు పడుతున్న కష్టాలను గుర్తించి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు ఇస్తున్నామని వివరించారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏక్కడా లేవన్నారు. కెసిఆర్ కిట్ ద్వారా ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్స్ తగ్గుతున్నాయన్నారు. కూతురు ప్రసవం ఖర్చు కోసం అమ్మగారి ఇంటిమీద ఆధారపడకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెలివరీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడి కేంద్రలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెద్దమొత్తంలో మంజూరు చేస్తూ 15 గుడ్ల స్థానంలో 30 గుడ్లు ఇస్తున్నామన్నారు. వైద్యశాఖలో అంచనా వేయని ఖర్చు ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారన్నారు. తెలంగాణ రాకముందు ఎన్నో అపోహలు సృష్టించారని, కొత్త రాష్ట్రమే అయినప్పటికీ కెసిఆర్ పాలనలో అనతి కాలంలో అనేక గొప్ప పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆరోగ్య, జ్ఞానవంతమైన తెలంగాణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Pension Scheme For Single women in Telangana